Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇప్పుడంటే ఇడ్లీలు గని, ఎన్కట కుడుములు

Kudumulu

ఇప్పుడంటే ఇడ్లీలు తింటండ్రుగని ఎన్కట కుడుములు తినేది. కుడుములు కూడా ఇడ్లీల వలనే చేస్తరు. అదీ కూడా ఈ సలికాలంలోనే చేస్కతింటరు. కుడుములు అంటే అనుపకాయ ఇత్తులతోని చేస్తరు అనుపకాయ చేను గిదే సలికాలం కాస్తది. అండ్ల గింజలు తీసి శాట్ల పోస్తరు. ఎస్లల వరిపిండి పోస్తరు. నీళ్ళు వేడిచేసి ఈ పిండి అండ్లపోస్తరు. అటెన్క ఒలిచిన అనుప గింజల పోసి పిడికెలితోని ముద్దలు ముద్దలు పిస్కుతరు. పిండి అనుపగింజలు పోసినంక కోతిమీద ఆకు ఉల్లి ఆకు నూరిన పచ్చిమిర్చికాయ కారం కొంచెం ఉప్పు, కొంచెం జిలుకర కలుపుతరు.

అప్పుడు ముద్దలుగ పిసికుతరు. వాటిని మల్ల ఉండుకబెట్టాలె అంటె ఎస్లల లేదా గిన్నెల నీళ్ళుపోసి అడుగున కొంచెం వరిగడ్డి ఏస్తరు. ఆ గడ్డి మీద బట్ట ఏసి బట్టమీద పిస్కిన కుడుములు పెట్టి మూతపెట్టి కింద మంట పెట్టుతె ఉడికిన కుడుములు తయారైతై. కుడుముల రుశి మస్తుంటది. ఉడుకుడుకు కుడుములు తినాలె గని ఎన్ని తింటన్నమో ఏర్పడకుంట పోతయి. కొందరు కుడుములల్ల పల్లినూనెల అద్దుకొని తింటరు అదెంతో కమ్మగ ఉంటది. కుడుములు ఎన్కట బగ్గ తినేది. ఇందులో అనుప గింజలు ఉంటయి బలం అట్లనే కోతిమీరు ఎల్లి ఆకు సుత మస్తు రుశి వాసన కొడుతది. ఎన్కటికాలంల కుడుములు మస్తుగానే ఉండేది ఇవి కూడా నీటి ఆవిరి మీదనే ఉడుకుతయి.

అయితె ఇప్పటికాలంల సుత కుడుములు తింటండ్రగని ఇడ్లీలు లెక్క కుక్కర్ల పెట్టుకొని తింటండ్రు. ఇవ్వి కూడా మంచిగనే ఉంటన్నయి. సలికాలం వచ్చిందంటే కాయకూరలు ఆకుకూరలు మస్తు పండుతయి. ఈ కాలంల దొరికే ఉల్లి ఆకు కోతిమీరు ఆకు మెంతి ఆకు మస్తుగ పెరుగుతది. అసలు ఉల్లి మ్లల్లకుపోతె ఉల్లి పువ్వును సూస్తేనే గమ్మతి అన్పిస్తది. ఆకుకూరలు ఉల్లి, కోతిమీరు మల్లల్ల ఎన్కటికాలంల బూడిద ఎరువుగ పోసేవాల్లు. ఇప్పుడు క్రిమిసంహారక మందులు రసాయన ఎరువులు కొట్టుతండ్రు. దాంతోని అవి మస్తు పొడుగగ పెరుగుతన్నయి. ఎన్కట కోతిమీరు చెట్టు రెండు బెత్తల పొడుగు కూడా లేకుండే ఇప్పుడు స్తూస్తే ఫీటు పొడుగు ఉండింది. బాగా ఎరువులు వాడి పెంచుతున్నరు. గందుకే ఊర్లల్ల సుత ఇయ్యాలరేపు రోగాలు ఎక్కువ వస్తన్నయి.

ఈ సలికాలం సలి ఎక్కువనే ఉంటది. తెల్లారిలేసి ఎవుసం కాడికి పోయి తోటలకు నీళ్ళు కట్టబోతే అండ్ల బంతిపూల చెట్లు మనల్ని పలకరిస్తయి. బంతిపూలు మస్తు పూసే కాలం ఆకుకూరలు కూరగాయలు కాసేకాలం ఇది. సర్వపిండి ఎల్లకాలం పెట్టుకొనే వంటకం. సర్వపిండి అంటే సర్వకు లోపల ఒత్తుతరు. వరిపిండిల ఉప్పు, కొంచెం కారం పొడి, ఉల్లి ఆకులు, జీలకర, ఇన్ని నువ్వులు పోసి గిన్నెకు గినెన్కు పెట్టకి పోయి మీద పెట్టి తింటే గమ్మత్తు ఉంటది. పిండిల నూనెపోస్తరు. నూనెను బట్టి రుచివస్తది. నూనె లాగానే పోస్తరు.

ఆ నూనెల పిండి ఉడికి కొంత దోరదోర మాడతది. అది తినాలె గని రుశి మస్తుగుంటది. సర్వపిండి ఊర్లల్ల ఎప్పుడు పెట్టుకుంటరు. గీ సలికాలం ఇంకా ఎక్కువ పెడుతరు. కుడుములు, సర్వపిండితోపాటు పల్లికాయ పంచుక బుక్కుడు కందికాయ ఉడుకబెట్టుక తినుడు, అనుపకాయ ఉడుకుబెట్టుక తినుడు ఉండనే ఉన్నది. ఇవీగాకుండా మక్కగుడాలు మస్తుంటయి మక్కకొన్నలల్ల కందులు, రాజమాలు, పల్లిత్తు కూడ పోసి ఉడుకబెట్టి పోస్కు ఏస్క తింటె మధరమే. గుడాలన్నంక ఇంత కల్లు ఉంటే అదోలోకం పోద్దాలు ఎల్లేకాలం కూడా వస్తంది. కల్లు గుడాలు సర్వపిండి కుడుములు ఊర్లల్ల ఉపాహారం.

-అన్నవరం దేవేందర్, సెల్ :9440763479

Comments

comments