Home జాతీయ వార్తలు 24 గంటల్లో కర్నాటక ప్రభుత్వం ఖతం: బిజెపి

24 గంటల్లో కర్నాటక ప్రభుత్వం ఖతం: బిజెపి

Kumaraswamy with Yeddyurappaబెంగళూరు: కర్నాటకలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం వచ్చే 24 గంటల్లో కూలిపోతుందని బిజెపికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఉమేష్ కట్టి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కట్టి బెల్గాంలో ఈ ప్రకటన చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ ఎడ్యూరప్ప అధ్యక్షతన జరిగే పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ముందు విలేకరులతో మాట్లాడిన కట్టి కాంగ్రెస్‌కు చెందిన 15మంది అసమ్మతి ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోనే వచ్చే 24 గంటల్లో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుంది. మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తుంది అని ఆయన జోస్యం చెప్పారు. కాగా, కట్టి వ్యాఖ్యలపై ఎడ్యూరప్ప ఆసక్తిని కనపరచలేదు. కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కోరిక తనకు లేదని ఆయన చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని, అలాగే కొనసాగతామని ఆయన తెలిపారు.

ఇదిలాఉండగా, గత శనివారం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని కుమారస్వామి తన క్యాబినెట్‌ను విస్తరించిన దరిమిలా మంత్రి పదవి దక్కని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా తమ అసమ్మతిని వెళ్లగక్కారు. దీంతో ప్రభుత్వ మనుగడపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

Kumaraswamy Govt will collapse in 24 hrs, BJP MLA Umesh Katti says 15 cong MLAs are in touch with BJP, Yeddyurappa downplays Kattis observations