Home దునియా తెగువకు మారుపేర్లు.. తెలంగాణ రాజకీయాలలో మహిళలు

తెగువకు మారుపేర్లు.. తెలంగాణ రాజకీయాలలో మహిళలు

Telangana-Woman-Politiciansడాక్టర్ షేక్ హసీన సీనియర్ మహిళా జర్నలిస్టు. సమస్యలపై స్పందించేగుణం మిక్కుటంగా కలవారు. స్త్రీగా ‘ఆకాశంలో సగం- పోరాటాలలో సగం’ అంటున్న మహిళా లోకం పట్ల పూర్తి సానుభూతి ఉన్నవారు. సమాజంలోని స్త్రీ ద్వితీయ శ్రేణి పౌరురాలుగా మనుగడ సాగించడం ఆమె భరించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలకై ఏదోవిధంగా పరితపిస్తున్నవారు. ఔను, ఎలాంటి త్యాగాలలోనైనా తమ శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తున్న మహిళలు అవకాశాలలో మాత్రం వెనుకబడుతున్నారనే కాదనలేని వాస్తవాన్ని ఎవరు మాత్రం హర్షిస్తారు?

తెలంగాణ మహిళల విషయానికి వస్తే, ఇక్కడి వారికి తెగువ, ధిక్కారం, పోరాట శక్తీ, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, త్యాగగుణం చరిత్రలో మనకు కొల్లలుగా కనబడతాయి. భారతదేశ చరిత్రలోనే, దాదాపు దక్షిణ భారత ప్రాంతాన్నధికంగా కలిగిన కాకతీయ సామ్రాజ్యానికి చక్రవర్తిగా మొక్కవోని ధైర్యంతో శత్రువుల గుండెల్ని చెండాడడమే గాక, ఆదర్శ పాలనాధికారిగా పేరు గాంచిన రాణీరుద్రమ తెలంగాణ నేలలో జన్మించిన వీరవనితయే. అడవిపై అధికారం అడవిపుత్రులకే ఉండాలని, సామ్రాజ్యవాదులకెదురు నిలిచి సమరం చేసి మరణాలకు సవాల్ విసిరిన సమ్మక్క-సారలమ్మలు ఈ ప్రాంతం వారే.

భారతదేశాన్నే కాదు, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన తెలంగాణ సాయుధ పోరుకు నాందీ వాచకమై, నైజాం రాజ్య కర్కష భూస్వామ్య వ్యవస్థను సవాల్ చేసిన చాకలి ఐలమ్మ ఈ మట్టిలోని అరుణ కాంతి పుంజమే. అనంతరం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో అగ్రభాగాన నిలిచిన ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, సి.హెచ్. కమలమ్మ వంటి వారు పురుష నాయకులకే మాత్రం తీసిపోనివారు. ఆ వారసత్వంలో జరుగుతున్న విప్లవ, వామపక్ష పోరాటాల్లోనూ అనేక మంది మహిళలు పోరాట యోధురాండ్రే.

సమాజంలో తరతరాలుగా అణచివేయబడుతున్న వర్గాలు, మహిళలు, దళితులే అన్నది వాస్తవం. డా॥ బి.ఆర్. అంబేడ్కర్ ఈ విషయాన్ని సరిగ్గానే కనిపెట్టి వారి కోసం పోరాడారు. ఐనా, పితృస్వామ్య, మనువాద వ్యవస్థల్లో కూరుకుపోయిన సంఘంలో పోరాట ఫలాలు దక్కడం లేదు. మహాత్మాజ్యోతిబా పూలే అన్నట్లు “ పాత వ్యవస్థలో నువ్వనుకున్నంది సాధ్యం కానప్పుడు, కొత్త విలువలతో కూడిన కొత్త వ్యవస్థను నువ్వే నిర్మించు” అన్న సూక్తి ఆధారంగా నేటి చైతన్యవంతులైన మహిళలు వీధుల్లోనూ, శాసనసభల్లోనూ తమ న్యాయమైన హక్కుల కోసం అనివార్యంగా పోరుసలుప వలసి వస్తున్నది.

బాల్యవివాహాలు, వరకట్న, వితంతు, దేవదాసి, బురఖా, ఉద్యోగావకాశాలు, సమాన పనికి సమాన వేతనం, గర్భిణీల సమస్యలు, మహిళలు రెండవ శ్రేణి పౌరులుగా ఎంచబడడం, మహిళా రిజర్వేషన్లు, మహిళా బిల్లు లాంటి ఎన్నో సమస్యలపై నిరంతరం నారీలోకం గర్జిస్తూనే, గర్హిస్తూనే ఉంది. అలాంటి సామాజిక, రాజకీయ రంగాల్లో పోరాడుతూ కృషిచేస్తున్న వర్తమాన మహిళా మణులను, వారి ఫోటోలను, అభిప్రాయాలను ఆశయాలను ఆసక్తులను, ఎంతో శ్రమకోర్చి డా॥ షేక్‌హసీన గారు పుస్తక ప్రచురణ గావించడం అభినందనీయం; భావితరం సమాజానికి ఈ గ్రంథం స్ఫూర్తిదాయకం కాగలదనుటలో ఏమాత్రం సందేహం లేదు.

“ తెలంగాణ రాజకీయాలలో మహిళలు”- రచన : డా॥ షేక్ హసీనా, పుటలు : 200, వెల రూ.100/- ప్రతులకు : విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్ని పుస్తక కేంద్రాలు.