Home ఆంధ్రప్రదేశ్ వార్తలు సర్వేలకూ లగడపాటి స్వస్తి…

సర్వేలకూ లగడపాటి స్వస్తి…

Lagadapati

 

ఇక ఎగ్జిట్ పోల్ చేయనని ప్రకటన

ప్రజలనాడి పసిగట్టలేకపోయానని క్షమాపణ

హైదరాబాద్ : ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఇక భవిష్యత్తులో ఎగ్జిపోల్ సర్వేలు చేయనని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఎపి శాసనసభ ఎన్నికలలో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందున చింతిస్తున్నానని, ఇదివరకే రాజకీయ సన్యాసం తీసుకున్నానని, తాజాగా సర్వే సన్యాసం కూడా స్వీకరిస్తున్నానని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకు కారణాలు ఏమైనా సరే వరుసగా రెండు సార్లు విఫలమయ్యానని, ఇకపై భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సంచలన ప్రకటన చేశాడు. 2014లో కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఎంపి పదవికి రాజీనామా చేశానని, ఆ తరువాత రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నానన్నారు. అప్పటి నుంచి తాను ఏ పార్టీకి అనుబంధంగా వ్యవహరించలేదని, 2004 నుంచి సర్వేలు తనకు ఒక వ్యాపకంగా మారాయని, ప్రజల నాడి ఎవరికి అనుకూలమైనా, వ్యతిరేకమైనా పక్షపాతం లేకుండా చెప్పానని ఆయన తెలిపారు.

ఈ కోవలోనే ఎపి, తెలంగాణలో కూడా మీడియాద్వారా సర్వే ఫలితాలను ప్రజలకు వివరించానన్నారు. తన ఫలితాల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించమని కోరుతున్నానని తెలిపారు. తాజా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 100కు 10 అటుఇటు, 15లోక్‌సభ సీట్లు రెండు అటుఇటుగా వస్తాయని చెప్పారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 72(7 సీట్లు అటుఇటు) అలాగే 10కి (రెండు అటుఇటుగా)లోక్‌సభ స్థానాలు వస్తాయని లగడపాటి తన సర్వేలో తేలినట్లు తెలిపారు. అయితే లగడపాటి అంచనాలను పూర్తిగా తారుమారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు పరిమితమైంది. తెలంగాణలో గత అంసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందని, రాష్ట్రంలో 10మంది స్వతంత్రులు విజయం సాధిస్తారని తన సర్వేలో వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే తెలంగాణలో అందుకు భిన్నంగా 88 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి సంచలన విజయం సాధించింది. తన సర్వేల వెనుక మర్మం తరువాత చెబుతానని వివరించిన లగడపాటి ఆపై తెలంగాణ ఫలితాలపై పెదవి విప్పలేదు. తన సర్వేలు మూమ్మాటికి తప్పాయని, ఇక జీవితంలో సర్వేల జోలికి పోనని లగడపాటి ఒక ప్రకటనలో తెలిపారు. ఈక్రమంలో నూతన సిఎంగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్ జగన్‌కు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి సహకరించాలని లగడపాటి ఆకాంక్షించారు.

ప్రాణం తీసిన లగడపాటి సర్వే..

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ 100 స్థానాలకు పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న లగడపాటి సర్వేలను గుడ్డిగా నమ్మిన తెలుగుదేశం పార్టీ అభిమాని రూ.12 లక్షలు బెట్టింగ్ కాశాడు. తీరా ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్ కాంగ్రెస 151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడంతో పురుగుమందు సేవించి ఆత్మహత్మకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో కంఠమనేని వీర్రాజు లగడపాటి సర్వేలు చూసి టిడిపికి 100 స్థానాలు సాధించి తీరుతుందని తన స్నేహితునితో రూ. 12లక్షలు పందెం కాశాడు. ఈ క్రమంలో ఫలితాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఉహించని స్థానాలు 151 కైవసం చేసుకోవడంతో కలత చెందాడు. అనంతరం తీవ్ర మనోవేదనతో శుక్రవారం ఉదయం పురుగు మందు సేవించాడు. విషయం గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే వీర్రాజు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు లగడపాటి సర్వేలపై మండిపడుతున్నారు. లేనిపోని సర్వేలు చేసి నిండు ప్రాణం తీశాడని లగడపాటిపై కేసు పెట్టేందుకు వీర్రాజు కుటుంబ సభ్యులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Lagadapati says do not Survey Exit Polls