Home జిల్లాలు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరు

జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరు

ktr* ఏప్రిల్‌లో మేడ్చల్‌కు గోదావరి జలాలు
* జిఓ 111ను సమీక్షించి సరళీకరిస్తాం
* సర్పంచులు, ఎంపిటిసిలకు ప్రత్యేక శిక్షణ
* సీఎంతో జిల్లా ప్రజా ప్రతినిధుల ప్రత్యేక సమావేశం
* ఎమ్మెల్సీల సన్మాన సభలో మంత్రి కేటిఆర్
రంగారెడ్డి జిల్లా :జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన శాసనమండలి సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని చంపాపేట్‌లోని సామ సరస్వతి గార్డెన్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సభలో ఆయనతోపాటు మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రత్యేక కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే ఫార్మాసిటీతో పాటు ఐటి పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లాలో పరిశ్రమలు రావడంతో స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి సైతం (మొదటి పేజీ తరువాయి)
దొరుకుతుందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు చురుకు గా సాగుతున్నాయని, మేడ్చల్ నియోజకవర్గంకు ఏప్రిల్ 30 నుంచి తాగడానికి గోదావరి జలాలు అందిస్తామని, రెండు సంవత్సరాల్లో జిల్లాలోని ప్రతి ఇంటికి మంచినీరు అందించడానికి చిత్తశుద్ధితో ముందు కు పోతున్నామని తెలిపారు. జి.ఓ 111పై సమీక్ష నిర్వహించి దానిని మరింత సరళతరం చేయడానికి కృషి చేస్తామన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం పెంచి వారికి సముచిత గౌరవం కల్పించడం జరిగిందని, 14 ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా పంచాయతీలకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల కష్టాలను దూరం చేసి వారికి అండగా ఉండటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, జూన్ నుంచి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. పార్టీకి కార్యకర్తలు ,నాయకులు అండగా ఉండటం వలనే అధికారంలోకి వచ్చామని, వారికి ఎల్లపుడు అండగా ఉంటామన్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీకి కంచుకోటగా మారి తెలంగాణలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.
సిఎంతో ప్రత్యేక సమావేశం
రంగారెడ్డి జిల్లాను మరింత ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందని అన్నారు.
కెటిఆర్ కృషి అభినందనీయం: మంత్రి మహేందర్ రెడ్డి
జిల్లా అభివృద్ధికి మంత్రి కెటిఆర్ చూపిస్తున్న ప్రత్యేక చొరవ అభినందనీయమని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోవడంతో పాటు ఐటి రంగంలో అగ్రస్థానంలో నిలపడానికి కెటిఆర్ చేస్తున్న కృషివలనే దేశంలో ఐటి పరిశ్రమలు రంగారెడ్డి జిల్లాకు తరలివస్తున్నాయన్నారు. జిల్లాకు బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పించారన్నారు. జిల్లాలో కార్యకర్తలు పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుపోవాలని సూచించారు. జిల్లాలో నవాబ్‌పేట్ జడ్పీటిసితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేశారన్నారు
స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వండి: జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గత చరిత్రలో ఏనాడు లేని గౌరవం కల్పించిన తెలంగాణ ప్రభుత్వంకు వారు రుణపడి ఉంటారని సునీతారెడ్డి అన్నారు. గ్రామాల్లో ప్రజల అవసరాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. జిల్లా అభివృద్ధికి సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు చేస్తున్న ప్రత్యేక కృషి పట్ల జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, సంజీవరావు, కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, కె.యస్.రత్నం తదితరులు ప్రసంగిస్తు సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. గత పాలకులు చేసిన పాపాల వలనే జిల్లా అభివృద్ధిలో వెనకబడిందన్నారు. కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు.
నమ్మకాన్ని నిలబెడతాం..ఎమ్మెల్సీలు
మండలి సభ్యులుగా తమకు అవకాశం ఇచ్చిన పార్టీకి, గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని ఎమ్మెల్సీలు కొంపల్లి యాదవరెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు అన్నారు. సిఎం కెసిఆర్ చేపడుతున్న పథకాలు జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోతాయన్నారు. మంత్రి కెటిఆర్ అండతో జిల్లాను మరింత ముందుకు తీసుకుపోవడానికి తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు.
ఎమ్మెల్సీలకు ఘనంగా సన్మానం
జిల్లాలో నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కొంపల్లి యాదవరెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, శంబీపూర్ రాజులను జిల్లా పార్టీ నాయకులతో కలసి మంత్రులు కెటిఆర్, మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి ఘనంగా సన్మానించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఎమ్మెల్సీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు స్వప్న, యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.