Home ఎడిటోరియల్ భూసర్వేతో సేకరణ సుళువు

భూసర్వేతో సేకరణ సుళువు

land

ఏ భూమి ఎవరిదో నిగ్గు తేలకుండా ప్రభుత్వాలు భూ సంబంధ వ్యవహారాలపై ముందడుగు వేయలేవు. పట్టా భూములు, ప్రభుత్వ భూములు, అటవీ విస్తీర్ణము, వ్యవసాయ యోగ్యము తదితర వివరాలు సేకరిస్తేగాని దేనినెలా ఉపయోగించు కోవాలో అర్థం కాదు.
రాష్ట్రంలోని 114.84 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీ ర్ణంలో 28లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. వ్యవసాయ యోగ్యమైన నేల 62.88 లక్షల హెక్టార్లుండ గా అందులో 45.61లక్షల హెక్టార్లలో నికర సాగు జరుగుతోంది. 31.64 లక్షల హెక్టార్ల సాగునేలకు నీటి పారుదల సౌకర్య ముంది.
పాలనకు భూ వివరాలకు చాలా సంబంధ ముంది. అందుకే తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేతికి రాగానే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్ జిల్లా మినహా ఆనాటి 9 జిల్లాల్లో జులై 2014 లోనే భూ సర్వే చేయించాలని తలచారు. అయితే ముందు జనాభా సర్వే అనుకోవడంతో ఇది వెనుకబడింది.
నిజాం హయాంలో 1932లో చివరి సర్వే జరగడం వల్ల భూమి వివరాలు సేకరించటం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదని, రెవెన్యూ పరిజ్ఞానం గల సిబ్బంది అధిక సంఖ్యలో అవసరమని భావించి సర్వేను వాయిదా వేస్తూ వచ్చింది ప్రభుత్వం.
సెప్టెంబర్ 2014లో ప్రకటించిన రైతు పంట రుణాల మాఫీ సమయంలోనే యాజమాన్యపు హక్కు ల్లో ఉన్న లొసుగులవల్ల తెలంగాణ ప్రభుత్వం పలు సమస్యలనెదుర్కొంది. ఒకే భూమిపై ఇద్దరు బ్యాంకు రుణం తీసుకోవడం, ఒకే రైతు అదే భూమిపై రెండు బ్యాంకుల్లో అప్పు తీసుకోవడం, లేనినేలపై దొంగ పాసు పుస్తకాలు చూపి అప్పులు తీసుకోవడం ఇలా రెవెన్యూ శాఖ నిర్వాకం బయటపడింది. వీటన్నింటినీ ఛేదించుకొని నికర రైతు పంట రుణం తేల్చుకోవడం వల్ల రాష్ట్రానికి దాదాపు వేయికోట్లు ఆదా అయ్యింది.
కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ రిపోర్టు ఆధారంగా 2006 నుండి పంపిణీ చేసిన పట్టా పాస్‌బుక్, యాజమాన్యపు హక్కు పత్ర పుస్తకాల నిర్వహణలో రెవెన్యూ శాఖ నిర్లక్షం వల్ల నకిలీలు స్వైరవిహారం చేశాయి.
మొదట్లో పట్టాపాస్‌బుక్, టైటిల్‌డీడ్ రెండు పుస్త కాలు చేతికందడంతో రైతు సంతోష పడ్డాడు. వాటిని బ్యాంకులు రుణాలకు రుజుపత్రాలుగా భావించాయి. ప్రభుత్వ రాయితీలను వ్యవసాయ తదితర శాఖలు వాటి ఆధారంగానే పంపిణీ చేశాయి. బెయిల్‌కు జామీనుగా కూడా కోర్టులు యాజమాన్యపు హక్కుపత్రం పుస్తకాన్ని అంగీకరించాయి. భూ తనఖా కూడా సులభమైంది. ఇసి, పదమూడేండ్ల పహాణీ, పాస్‌బుక్, టైటిల్ డీడ్ డిపాజిట్ చేయించుకుని బ్యాంకులు లక్షల రూపాయల తనఖా రుణాలు మంజూరు చేశాయి. ఎనిమిది ఎకరాల భూమి ఉన్న రైతు బ్యాంకు అప్పు ద్వారా ట్రాక్టరు,
హార్వెస్టరు పొందే సౌలభ్యం వచ్చింది.
రైతులందరికీ పాస్‌పుస్తకాల పంపిణీలో సమయం పడుతున్నందువల్ల ఆనాటి ప్రభుత్వాలు భూమి క్రయ
విక్రయాల సందర్భంలో రిజిష్టార్లు పాస్‌పుస్తకాల తనిఖీ చేయనవసరం లేదని ఆదేశించాయి. దీనివల్ల అమ్మేవారి పుస్తకాల్లో భూమి యథాతథంగా ఉంటూ కొన్నవారికి రెవెన్యూ శాఖ కొత్త పాస్‌బుక్కులు చేతిలో పెట్టింది. కొన్నవారికి పాస్ పుస్తకాలు సిద్ధం చేస్తున్న సమయంలో అమ్మినవారి పుస్తకాలు తెప్పించి అందులో భూ వివరాలు సవరించే బాధ్యత కూడా రెవెన్యూ శాఖ సరిగా నిర్వర్తించలేదు. దీని వల్ల కాగితాల్లో భూ విస్తీర్ణం పెరిగిపోయింది. నకిలీ పాస్ పుస్తకాలతో అది మరింత లెక్క
తప్పింది.
2008లో కేంద్రప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ ఇవ్వడంతో మాఫీ ఆశ పెరిగి పట్టాదారులందరూ బ్యాంకు రుణాలకు ఎగబడ్డారు. టైటిల్ డీడ్ భరోసాతో బ్యాంకులు అడిగినవారికి లేదనకుండా రుణాలు మంజూరు చేశాయి.
2014లో తెలంగాణ ప్రభుత్వం పంట రుణ మాఫీ సందర్భంగా క్రాస్ చెకింగ్‌వల్ల ఈ బండారమంతా బయటపడింది. ఈ దెబ్బతో రెవెన్యూ మరియు బ్యాంకు సిబ్బంది ఇక్కట్ల పాలయ్యారు కూడా. చేయని తప్పుకు నకిలీ పాస్‌పుస్తకాలపై లోన్లు ఇచ్చినట్లు రుజువు కావడంతో బ్యాంకు అధికారులు సస్పెండ్ అయ్యారు.
ఒక అనివార్య ప్రక్షాళన అనంతరం మిగిలిన పాస్ పుస్తకాలు రుణాలకు భరోసాగా బ్యాంకు లాకర్లలో ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల తదితర అవసరాల నిమిత్తం భూసేకరణ ఆరంభించడంతో పట్టాపాస్ పుస్తకాలు వెలుగు చూసే అవసరమొచ్చింది. వాస్తవానికిపంట రుణాల కోసం బ్యాంకులు రైతు పాస్ పుస్తకాలను తమ ఆధీనంలో ఉంచుకోకూడదు. వేసే పంట హామీపై ఇస్తున్న పంట రుణాలకు ఆ నేలను సాగు చేస్తున్నందుకు రుజువుగా ఆ సంవత్సరపు పహాణీ సరిపోతుంది. అయితే రైతును తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి బ్యాంకులు పట్టాపాస్ పుస్తకాలను తమ దగ్గర పెట్టుకుంటున్నాయి. ప్రభుత్వం కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత తమ వద్ద ఉన్న పుస్తకాల విలువ ఏమిటో బ్యాంకులకు అంతు చిక్కడం లేదు. కనీసం పంపిణీ సమయంలో పాత పుస్తకాలను వెనక్కి తీసుకొని కొత్తవి ఇస్తారో లేదో ఎవరికీ తెలియదు.
ఈ మధ్య కరీంనగర్ జిల్లాలో భూసేకరణ సమ యంలో కలెక్టర్ బ్యాంకరు అభ్యర్థనను తోసిపుచ్చినట్లు వార్త వచ్చింది. తమ వద్ద రుణం ఉన్న భూమిని కొను గోలు చేస్తున్నారు కాబట్టి సంబంధిత చెల్లింపు చెక్కును తమ కీయాలని కోరినా ప్రభుత్వాధికారులు సమ్మతించ లేదు. అమ్ముడుబోయిన భూమి పత్రాలు విలువ లేకుండా పోయి అప్పులు వసూలు కాని పరిస్థితి ఏర్పడుతుంది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే భూ ప్రక్షాళన రెండు అవసరాలు తీరుస్తుందనవచ్చు. ఇందులో మొదటిది భూ సేకరణకు మార్గం సుగమమవుతుంది. కొత్త పుస్తకాలు రావడంతో బ్యాంకు రుణాలకు తోడు పాత పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్న సేకరణ, కొనుగోలు సజావుగా సాగుతుంది. ఒక రోడ్ మ్యాప్ లాగా భూమి వివరాలన్నీ చేతిలోకి వస్తాయి. యజమానిని తక్షణం గుర్తించి పనులు చకచకా సాగించవచ్చు. పరాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమి బయటపడి అది ప్రభుత్వ ఖాతాలో పడుతుంది.
ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నుండి రైతుకు పంటకు ఎకరానికి రూ.4000/చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని రుణ మాఫీ తుది విడత మొత్తం విడుదల చేస్తూ ఏప్రిల్ లో ప్రకటించింది. దీనిలో ఎదురయ్యే పలురకాల సమస్యలకు పరిష్కారంగా భూ సర్వే ఉపయోగపడుతుంది.
రాష్ట్రంలో 50లక్షల హెక్టార్ల భూమి సాగవుతుండ గా 56లక్షల మంది రైతులు ఆ పనిలో ఉన్నారు. ఇందు లో 14 లక్షలమంది కౌలు రైతులు. రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది కాకుండా ప్రభుత్వం నియమించిన రైతు సంఘాల ప్రతినిధులు పండిస్తున్న రైతును గుర్తించి జాబితాను ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఇందులో కౌలు రైతులకు న్యాయం జరుగుతుందనే ఆశలేదు. రైతు ఆర్థికస్థోమత అంటే భూస్వామి, చిన్న రైతు అన్న భేదం లేకుండా పండించే ఎకరానికి అందరికీ ఆర్థిక సహాయం లభిస్తుందని ప్రభుత్వం అంటోంది. పెద్ద రైతులు సాధారణంగా అధికశాతం భూముల్ని కౌలుకే యిస్తుంటారు. కాని పరిహారాన్ని ఎప్పుడూ వదలుకోలేదు. 14 లక్షల కౌలు రైతులకు న్యాయం జరిగేలా విధివిధానాలుండాలి.
నిజానికి సమగ్ర భూ సర్వే అంచనాలకు మించిన పని 10,875 గ్రామాలను కొలుస్తూ పోవాలి. సిబ్బంది ఆవశ్యకత, సాంకేతిక, సంసిద్ధత తక్షణ అవసరం. నిజమైన భూ యజమానిని వెదికి పట్టుకోవడం, ప్రకటించడం, అభ్యంతరాలను పరిష్కరించడం శాంతంగా, సామరస్యంగా చేయవలసిన పని.
ప్రభుత్వం అంటున్నంతగా గ్రామాల్లో, కోర్టుల్లో భూ తగాదాలు లేవు. వాటికి ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం కూడా లేదు. 1000 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వే వల్ల రైతుల సమస్యలు తీరేకన్నా ప్రభుత్వానికి భూ స్వరూపం తెలిసిపోతుంది. కేవలం భూసేకరణ కోసమే ఈ బృహత్కార్యం తోడ్పడితే రైతుల చేతిలోంచి భూమి జారిపోయినట్లే.