Home మంచిర్యాల రగిలిన భూ వివాదం

రగిలిన భూ వివాదం

Land dispute between brothers
మంచిర్యాల: గత కొంత కాలంగా అన్నదమ్ముల మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. తండ్రి పేరిట గల భూమిని తమ్ముడు ఒక్కడే రైతు బంధు కార్యక్రమంలో రెవెన్యూ రికార్డులలోకి నమోదు చేయగా అన్న తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. దీంతో పథకం ప్రకారమే ఇద్దరు ఘర్షణకు సిద్దమై ఒకరిపై ఒక్కరు కారంపొడి చల్లుకొని ఏకంగా కత్తిపోట్లకే సిద్దమయ్యారు. నెన్నెల మండల కేంద్రంలో బుధవారం ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వృత్తి రీత్యా అన్న బద్దం బాపురెడ్డి హైదరాబాద్‌లో జీవనం కొనసాగిస్తుండు. తమ్ముడు లక్ష్మారెడ్డి కరీంనగర్‌లో ఉంటున్నాడు. నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామంలో వారి తండ్రి పేరిట 30 ఎకరాల భూమి వ్యవహారంలో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. పథకం ప్రకారమే బుధవారం అన్నదమ్ములు ఇద్దరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రికార్డులను పరిశీలించగా తమ్ముడు లక్ష్మారెడ్డి పేరిట 30 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అన్న బాపురెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు. తండ్రి పేరిట ఉన్న భూములు ఇద్దరికి చెరిసగం రావాల్సి ఉండగా తమ్ముడు లక్ష్మారెడ్డి ఏకపక్షంగా ఒక్కడే పట్టా చేసుకోవడంతో బాపురెడ్డి అతని వెంట తీసువెళ్లిన కొబ్బరి బోండాల కత్తితో తమ్ముడిపై దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మారెడ్డి తీవ్రగా గాయపడ్డాడు. ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయంలోనే బాపురెడ్డి కత్తి బయటకు తీయడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అక్కడ ఉన్న గ్రామస్థులు వారిని అపడ్డానికి ప్రయత్నించగా ఇరువురు ఒకరిపై ఒక్కరు కారం చల్లుకొని ఘర్షణకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో గాయపడిన లక్ష్మారెడ్డిని  బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు, స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాపురెడ్డిని  అరెస్టు చేసి విచారిస్తున్నారు.