Home ఆదిలాబాద్ రెవెన్యూ లీలలు

రెవెన్యూ లీలలు

Land records are huge Irregularities

భూముల రికార్డులలో భారీగా అక్రమాలు

మనతెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో :  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు పతాక స్థాయికి చేరుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని రెవెన్యూ శాఖలో అక్రమాలకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వీఆర్‌వోలు ఈ అక్రమాలకు సూత్రధారులుగా కొనసాగుతున్నారన్న విమర్శలున్నాయి. మొత్తం వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని ఈ వీఆర్‌వోలు శాసించే స్థాయికి ఎదిగారని అంటున్నారు. ఇటీవల జరిగిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం రెవెన్యూ శాఖకు వరంగా మారిందని అంటున్నారు. రికార్డుల్లోని లొసుగులను వీరు ఆసరాగా చేసుకుంటూ రైతులను ముడుపుల కోసం ముప్పుతిప్పలు పెడుతున్నారని పేర్కొంటున్నారు. ప్రతి గ్రామంలో దాదాపు వంద నుంచి రెండు వందల మందికి పైగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ కాకపోవడం రెవెన్యూ అధికారులకు వరంగా మారిందని అంటున్నారు. దీనికి తోడుగా పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లిన వారిని కూడా వీఆర్‌వోలు లక్షంగా చేసుకొని వారిని ఇక్కట్లకు గురి చేస్తూ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తప్పుల సవరణకు వీఆర్‌వోలు ఓ ఫిక్స్‌డ్ రేటును నిర్ణయించారని అంటున్నారు. తాము డిమాండ్ చేసే డబ్బులు ఇవ్వకపోతే రికార్డులలో తప్పుల సవరణ జరగడం అసాధ్యమంటూ ఈ వీఆర్‌వోలు రైతులను దబాయిస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అంతా తామై వ్యవహరిస్తున్న వీఆర్‌వోలు తప్పుడు రికార్డులను సృష్టిస్తూ గందరగోళ పరిస్థితులకు ఆస్కారం ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో వీఆర్‌వో నాలుగైదు క్లస్టర్లకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తూ అంతా తామై శాసిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీఆర్‌వోలకు రెవెన్యూ శాఖలోని తహసీల్దార్ స్థాయి అధికారితో పాటు అంతకన్నా పైస్థాయి అధికారులంతా అండదండలు అందిస్తున్నారని అంటున్నారు. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా రెవెన్యూ అధికారులంతా కుమ్ముక్కై ఈ భారీ తతంగానికి తెర లేపారన్న వాదనలున్నాయి. అయితే రికార్డులను తారుమారు చేయడం, భూముల లెక్కలను తలకిందుల చేయడం, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చిత్రీకరించడం, ఒకరి పేరుపై ఉన్న భూములను మరొకరి పేరుపై మార్పు చేయడం లాంటి అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.