Home దునియా సాన్‌మారినో

సాన్‌మారినో

san marino is Surrounded by Italy

సాన్ మారినో. చిన్న స్వతంత్ర దేశం. చుట్టూతా ఇటలీ. ఇది మధ్యలో ఉంటుంది. యూరోప్‌లో వాటికన్ నగరం, మొనాకో తర్వాత ఇదే అతి చిన్న దేశం. యూరోప్‌లోకి మూడవది, ప్రపంచంలోకి ఐదవ అతి చిన్న దేశం. దాదాపుగా చతురస్రాకారంగా ఉంటుంది. ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు 8 మైళ్ల పొడవు ఉంటుంది. సాన్ మారినోను మౌంట్ టిటానో డామినేట్ చేస్తుంటుంది. అక్కడి భూమ్మీద పెద్ద భాగంలో మౌంట్ టిటానో(2424 అడుగులు)అనే కొండ ఉంటుంది. చాలా మైళ్ల దూరం నుంచి చూసినా పురాతనమైన మూడు కోటలను కిరీటంలాగా పెట్టుకున్న మౌంట్ టిటానో కనిపిస్తుంది. మౌంట్ టిటానోను, ఇంకా సాన్ మారినోను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతం అంటారు.

వేలరకాల పక్షులుంటాయి
సాన్ మారినో నగరం, ఈ దేశానికి ముఖ్య పట్టణం. కాని డోగనా సిటీ ఆ దేశంలోకెల్లా అతి పెద్దది. ఆ దేశపు వాతావరణం మధ్యస్థంగా ఉంటుంది. ఎండాకాలంలో 26 డిగ్రీల సెల్సియస్, చలికాలంలో 7 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. ఏడాదికి 22 అంగుళాల నుంచి 32 అంగుళాల వర్షపాతం ఉంటుంది. మధ్యధరా ప్రాంతం అవడంతో అక్కడ వ్యవసాయం భిన్నంగానే ఉంటుంది. ఎక్కువరకాల పంటలు పండవు. సాన్ మారినోలో వ్యవసాయం ఎక్కువ ఉండదు కాబట్టి అది ఆదాయ వనరు కాదు. గోధుమలు, ద్రాక్ష మాత్రమే ముఖ్య పంటలు. పాడి, పశువులు అక్కడ ముఖ్యం. ఆలివ్, పైన్, ఓక్, యాష్, ఫిర్, ఎమ్, ఇలా రకరకాల చెట్లు, విభిన్న రకాల గడ్డి పెరుగుతుంది. అక్కడ కొత్త కొత్త తరహా పూలు పూస్తాయి. హెడ్జెహాగ్స్, నక్కలు, బ్యాడ్జర్‌లు, మార్టెన్లు, వీసెల్స్ లాటి జంతువులతో పాటు కుందేళ్లూ అక్కడ బాగా కనిపిస్తాయి. అక్కడి వాతావరణంలో వేలరకాల పక్షులు, పక్షి జాతులు ఉంటాయి.

తక్కువ జనాభా
చరిత్ర పూర్వం నుంచే , ఆ ప్రాంతంలో మనుషులు నివసించినట్టు సాక్షాలున్నాయి. 4వ శతాబ్దం మొదట్లోనే సాన్ మారినో ఉన్నట్లు దాఖలాలున్నాయి. సెయింట్ మారినస్ అనే క్రిస్టియన్‌ల బృందం హింస నుంచి తప్పించుకోడానికి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
ఇటలీ మధ్యలో బిగించినట్టు ఉంటుందీ దేశం. 2013కి ఈ దేశ జనాభా 34,450 అని ప్రపంచ బ్యాంకు చెప్తోంది. సాన్ మారినో జనాభాను సమ్మరినేసి అంటారు. వేల సంఖ్యలో సమ్మరినేసిలు ఇటలీ వెళ్లి నివసిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్, అర్జెంటీనా లలో కూడా ఉంటారు. సాన్ మారినోలో పదింట తొమ్మిది మంది రోమన్ క్యాథలిక్కులే. అధికారికంగా ఇటాలియన్, రొమాంగ్‌నాల్ అనే భాషలు మాట్లాడతారు. సెల్టో గాల్లిక్ అనే భాష కూడా ఎక్కువగా మాట్లాడతారు. పియోడ్మాంట్, లాంబార్డీ అనే మాండలికాలు కూడా ఉంటాయి.

లిరా నుంచి యూరోలకు మారింది
అక్కడైతే ఎటువంటి ఖనిజ వనరులు లేవు. సాన్ మారినో ఇటలీతో వ్యాపార లావాదేవీలు నడుపుతుంది. కాబట్టి విద్యుత్తు కూడా ఇటలీ నుంచి తెచ్చుకుంటుంది. దేశపు ముఖ్య వనరులు పరిశ్రమలు, పర్యాటకం, వాణిజ్యం, వ్యవసాయం, కళలు. ఎలక్ట్రానిక్స్, పెయింట్, కాస్మెటిక్స్, సిరామిక్స్, నగలు, బట్టలు, ఇనుప వస్తువులు, ఫర్నిచర్, సాన్‌మారినో సంప్రదాయ కళలు, ఫైన్ ప్రింటింగ్, పోస్టేజ్ స్టాంపులు లాటివి ఆదాయ వనరులు. అంతకుముందు ఇటాలియన్ లిరా సాన్ మారినో కరెన్సీగా ఉండేది. 2002 లో దాన్ని యూరోలుగా మార్చారు.

మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం
సాన్ మారినో పర్యాటకం చాలా పెద్దది. సంప్రదాయ పర్యాటకంతోపాటు ఆధునిక హోటల్ సౌకర్యాలతో పాటు రెసిడెన్షియల్ టూరిజం కూడా బాగా అభివృద్ది చెందింది. 1923 నుంచి 1943 వరకు సమ్మారినీస్ ఫాసిస్ట్ పార్టీ పాలన కింద ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సాన్ మారినో తటస్థంగా ఉంది. 1944 లో జర్మన్ బలగాలు దాన్ని ఆక్రమించుకున్నాయి. సాన్ మారినో యుద్ధంలో సంకీర్ణ దళాల ముందు జర్మన్ ఓడిపోయింది. 1945 నుంచి 1957 మధ్యలో స్వతంత్రంగా ఎన్నుకోబడిన మొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇక్కడే అంకురించింది.

ప్రపంచంలో అతి చిన్న మిలిటరీ
ఈ చిన్న దేశాన్ని పెద్ద దేశాలు పరిగణనలోకి తీసుకోవనడానికి ఒక ఉదాహరణ. వాషింగ్‌టన్ డిసిలో సాన్ మారినో తన ఎంబసీని ఏర్పాటు చేసుకుంది కాని అమెరికాకు సాన్‌మారినోలో ఎంబసీ లేదు. సాన్‌మారినోకి కూడా మిలిటరీ ఉంది. ప్రపంచంలోకెల్లా అతిచిన్న సైనికదళం దీనిదే. ఆకుపచ్చ, ఎరుపు రంగు యూనిఫామ్ వేసుకుంటారు. సాన్ మారినో సరిహద్దులను వారు కాపలా కాస్తుంటారు. సాన్ మారినో మూడు కొండల చుట్టూ ఉంటుంది కాబట్టి టోర్టా ట్రె మోంటి(మూడు కొండల కేక్)అనే కేక్ ఇక్కడ ఎక్కువ ఫేమస్. సాన్ మారినోలోని మూడు కొండల లాగా చాకొలెట్‌తో పొరలుగా ఉంటుందీ కేక్. పియాడినా అనే సన్నటి ఇటాలియన్ ఫ్లాట్ బ్రెడ్ ముఖ్యమైన వంటకం. పియాడినాలో చీజ్, మాంసం, లేదా కూరగాయలు నింపుతారు. లేదా జామ్, చాకొలెట్ లాటివి కూడా నింపుతారు.

– శృతి