Home హైదరాబాద్ ప్రభుత్వ భూముల్లో భూ దందాలు

ప్రభుత్వ భూముల్లో భూ దందాలు

HOME-image

అరవై గజాలు రూ.8లక్షలు, నూట ఇరవై గజాలు రూ.14 లక్షలు నిజాంపేటలోని సైదప్ప కాలనీలో జోరుగా ప్రభుత్వ భూముల అమ్మకాలు లక్షలు పోసి కొని మోసపోతున్న పేదలు లక్షలు సంపాదిస్తున్న భూ కబ్జాకోర్లు మామూళ్ల మత్తులో జోగుతున్న మండల రెవెన్యూ అధికారులు 

ప్రభుత్వ భూములను కాపాడతాం, ఇంచు భూమి కూడా ఆక్రమణ కానివ్వం, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడినా ఎంతటివారైనా వదిలిపెట్టం’ అని  ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ హెచ్చరిస్తూనే వున్నారు. కాని నిజాంపేట గ్రామంలో మాత్రం ప్రభుత్వ భూముల కబ్జాదారులు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. సైదప్ప కాలనీలో ప్రభుత్వ భూమిని దర్జాగా అమ్మేసుకుంటున్నారు. కాలనీలో  మూడు పునాదులు, ఆరు గదులు అన్నట్టుగా జోరుగా ఆక్రమణల పర్వం కొనసాగుతుంది.   ఈ గ్రామంలోని అన్ని పార్టీలకు చెందిన నాయకులకు ప్రభుత్వ భూములంటే  ఎక్కడలేని ప్రేమ. ఆ భూములను  60, 120 గజాల ప్లాట్లుగా చేసి అమాయకులకు లక్షల రూపాయలకు అంటగటడం వారి హక్కుగా.. ఇది ఎవరు కాదనలేని బహిరంగ రహస్యం.. నీకు ఇంత నాకు ఇంత అని రెవెన్యూ అధికారులతో ముందుగానే మాట్లాడుకొని ఏకంగా ప్రభుత్వ భూములను తమ సొంత ఆస్తులుగా నమ్మించి, నోటరీలు చేసి మరీ దర్జాగా అమ్ముకుంటున్నారు.  పాపం సొంత గూడు ఉంటే చాలని ఆశపడే వారిని నిలువునా దోపిడీ చేస్తున్నారు. నిజాంపేట గ్రామంలో కబ్జాదారుల పేరిట కాలనీలు వెలుస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ  క్రమంలోనే నిజాంపేటలో ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న భూ దందాలపై మనతెలంగాణ ప్రత్యేక కథనం…. మన తెలంగాణ/బాచుపల్లి : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి మండలం పరిధిలోని నిజాంపేట గ్రామంలో ప్రభుత్వ భూముల్లో జోరుగా భూ దందాలు సాగుతున్నాయి. నాయకులు ప్రభుత్వ భూములలో ఫలానా సర్వే నంబర్‌లో నాకు ఇంత, నీకు అంత అని వాటాల వారీగా పంచుకొని ప్లాట్లుగా చేసి లక్షలకు అమ్ముకొంటున్నారు. వివరాల్లోకి వెళితే నిజాంపేట గ్రామంలో 191 సర్వే నంబర్లో మొత్తం 75-12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ సర్వే నంబర్ అంభీర్ చెరువుకు ఆనుకొని ప్రగతినగర్, బాచుపల్లి గ్రామాల సరిహద్దులకు ఆనుకొని పొడవుగా తుర్కచెరువు వరకు విస్తరించి ఉంది. అందులో 16 ఎకరాలు వీకర్ సెక్షన్ కాలనీకి, 24 ఎకరాలు రాజీవ్ గృహకల్ప ఇండ్ల కొరకు హౌజింగ్ బోర్డుకు, ఐదెకరాలు మాజీ సైనికోద్యోగికి అప్పటి ప్రభుత్వం కేటాయించింది.

దాదాపు ఐదు ఎకరాలు వరకు పక్కా పట్టా సర్వే నంబర్లలో కలిపేసుకున్నారు. ఇక మిగిలిన భూమిలో ఇంకో ఆరు ఎకరాల వరకు తెలంగాణ ప్రభుత్వం జి ఒ నంబర్లు 58, 59 ప్రకారం క్రమబద్ధీకరించింది. అంటే 75 ఎకరాల భూమిలో 50 ఎకరాల వరకు ఇంకా భూమి మిగిలి వుంది. ఆ భూమిని గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు వాటాలు వేసుకొని మరీ పంచుకొని అమ్ముకున్నారు. అలా ఏర్పడిందే సైదప్ప కాలనీ 191 సర్వే నంబర్‌లో రాజీవ్ గృహకల్పకు ఆనుకుని ఏర్పడింది. అతని పేరుతోనే కాలనీ ఏర్పడింది. ఇక్కడ అతని కుమారులు, కూతురు వారి సంబంధీకులదే హవా. రెవెన్యూ అధికారుల అండదండలు వీరికి పుష్కలంగా ఉన్నాయని అందుకే వీరు రెచ్చిపోయి మరీ కబ్జాల పర్వంలో మునిగితేలుతూ అందినకాడికి అమ్ముకుంటున్నారని ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఒకపక్క వీళ్లు ఇలా అమ్ముకుంటుంటే గ్రామానికే చెందిన మండల ప్రజాప్రతినిధి సోదరుడు గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలికి 100 గజాలను రూ.14 లక్షలకు అమ్మాడు. అక్కడ ఆమె గదిని నిర్మించుకుంటుండగా గత మంగళవారం బాచుపల్లి రెవెన్యూ అధికారులు కూలగొట్టడంతో ఆమె నాకు ఇది ప్రభుత్వ స్థలమని తెలియదని, ఇది నా భూమి అని మేకల నగేశ్ అనే వ్యక్తి అమ్మాడని మండల రెవెన్యూ అధికారిణి ముందే ఏడ్చింది.

మేస్త్రి పనిచేసుకునే మరో వ్యక్తి సైదప్ప బంధువుల దగ్గర 60 గజాలు రూ.7.50 లక్షలకు కొన్నానని, ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదని మీడియా ముందు వాపోయాడు. దీన్ని బట్టి నిజాంపేటలో ప్రభుత్వ భూముల్లో ఎంత జోరుగా భూదందాల పరంపరలు కొనసాగుతున్నాయో, వాటికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న వారికి ఏ మేర ముడుపులు ముడుతున్నాయో, వందల ఎకరాల ప్రభుత్వ భూములున్న నిజాంపేటలో వారి సంపాదన ఎంతో ఊహకు కూడా అందదు.

అధికారులు ఏం చేస్తున్నట్టు : ప్రభుత్వ భూములను ఎటువంటి ఆక్రమణలు జరుగకుండా కాపాడాల్సిన బాధ్యత సంబంధిత రెవెన్యూ అధికారులదే. కాని బాచుపల్లి మండలంలోని ప్రభుత్వ భూముల పరిస్థితి ఇంకోరకంగా ఉంది. మండల పరిధిలో నిజాంపేటలో కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆందులో నుండి వెయ్యి ఎకరాల వరకు వివిధ సంస్థలకు, వ్యక్తులకు కేటాయించగా దాదాపు ఇంకా వెయ్యి ఎకరాల వరకు ప్రభుత్వ భూమి మిగిలి ఉంది.మహానగరానికి ఆనుకుని ఉండటంతో ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకే ఇప్పుడు బాచుపల్లి మండలం అంటే రెవెన్యూ అధికారలకు కామ ధేనువు లాంటిది. అందుకే ఇక్కడికి రావడానికి వ్యయ ప్రయాసాలకోర్చి, తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించి పోస్టింగ్ తెచ్చుకుంటారు. ఇక వచ్చాక ఇంకేముంది. కంచే చేను మేసిన చందంగా కబ్జాదారులతో చేతులు కలుపుతారు. తన వాటా ఇంత అని మాట్లాడుకుని కళ్లు మూసుకుంటారు. చూపు ఉన్న గుడ్డి వారిలాగా ప్రవర్తిస్తారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నయానో, భయానో ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేస్తారు. ససేమిరా అంటే నామమాత్రపు చర్యలు తీసుకుంటారు. నిజాంపేట గ్రామంలో పనిచేసిన రెవెన్యూ అధికారి సంవత్సర ఆదాయం అతని పది సంవత్సరాల జీతంకు సమానమని వినికిడి. ఇప్పుడు పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారికి తెలియకుండా నిజాంపేటలో చీమ కూడా కుట్టదట. అంతలా పట్టు సంపాదించుకున్నాడని వినికిడి.

రెగ్యులర్ విఆరోఒ వచ్చినా చార్జి ఇవ్వని తహసీల్దార్ : బాచుపల్లి మండలం ఏర్పడి దసరాకు సరిగ్గా ఏడాది దాటింది. మొదట్లో సిబ్బంది సరిపడ లేకపోవడంలో ఒక్క విఆర్‌ఒనే కేటాయించారు. గత నాలుగు నెలల క్రితం నిజాంపేట గ్రామానికి ఇంకో విఆర్‌ఒను ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కాని తహసీల్దార్ మాత్రం ఆమెకు బాధ్యతలు అప్పగించకుండా జూనియర్ అసిస్టెంట్ బాధ్యతలను అప్పజెప్పి కార్యాలయానికే పరిమితం చేసింది. ఎందుకు బాధ్యతలు ఇవ్వడంలేదని తహసీల్దార్‌ను వివరణ కోరగా వచ్చిన విఆర్‌ఓకు పహణీ రాయడం రాదు, అందుకే అప్పగించ లేదని తెలిపింది. పహణీ సరిగ్గా రాయరాని విఆర్‌ఓకు మరి కార్యాలయంలో రికార్డులు రాయడం ఎలా వస్తుందో ఆ అధికారిణికే తెలియాలి. దీని వెనుక ఉన్న వాస్తవాలు జిల్లా కలెక్టర్‌కే తెలియాలి.

మేకల నగేశ్ దగ్గర 100 గజాలు 14 లక్షలకు కొన్నా
బాధితురాలు మేం ఊరినుండి ఇక్కడికి బతకడానికి ఇక్కడికి వచ్చాం. ఇద్దరం భార్యాభర్తలం పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నాం. పైసా పైసా కూడబెట్టి సొంత గూడు కట్టుకుందామని రూ. 14 లక్షలకు ఈ భూమిని మేకల నగేశ్ దగ్గర కొన్నాం. ఇది ప్రభుత్వ భూమి అని మాకు తెలియదు. ఏం చేయాలో మాకు తోచడంలేదు.

అరవై గజాలకు 7.30 పెట్టి కొన్నా
మరో బాధితుడు : ఇది మా భూమి అని పట్టా ఉందని చెబితే నమ్మి కొనుక్కున్నా, ఇప్పుడేమో మండల అధికారులు ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. ఊరిలో ఉన్న పొలం అమ్మి ఇక్కడ కొనుక్కున్నా. రెంటికి చెడిన వాడిని అయ్యాను. ఇప్పుడు మాకు దిక్కెవరు.