Home ఎడిటోరియల్ తమిళనాట తెలుగు ఉనికికి పరీక్ష

తమిళనాట తెలుగు ఉనికికి పరీక్ష

telugu-languageబహుభాషలదేశంలో విద్యావిధానంపట్ల ప్రజా స్వామిక చింతనతో వ్యవహరించలేకపోతే మైనారిటీ భాషలే కాదు మెజారిటీ ప్రజల భాషలు కూడా అణిచివేతకు గురయితీరతాయి. ప్రజల భాషకాని ఇంగ్లీషుని నెత్తిన బెట్టుకుని ఇంకా ఊరేగుతూండటంతో మైనారిటీ ప్రజల భాషలు మరింత నిర్లక్షానికి గురయి అడుగంటి పోతున్నాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణగా తమిళ నాడు రాష్ట్రంలో వుంటున్న తెలుగువారిని పేర్కొనవచ్చు. మధ్యయుగాల రాచరికాల కాలంనుండి రాజ్య విస్తరణ, మతవిస్తరణ, బతుకు తెరువుకై వలసలు పోవటం మొదలైన ఆర్థికరాజకీయ కారణాల వలన తమిళ తెలుగు ప్రాంతాల ప్రజలు యితర ప్రాంతాలలో స్థిరపడటమన్నది విరామమెరగని ప్రక్రియగా కొన సాగుతూ వస్తోంది. కర్నాటక సంగీత మూల విరాట్టు లలో ఒకడైన త్యాగయ్య తంజాపూరు ప్రాంత వాసియై కూడా తన కీర్తనలన్నీ తెలుగులో మాత్రమే రాశాడు. తమిళ ప్రజానీకంతో సహా కర్నాటక సంగీతకారు లందరూ నేటికీ ఆ తెలుగు కృతులనే గానం చేస్తూం డటం మనకందరకూ తెలుసు.

రాచరికయుగంలోనూ, బ్రిటిషు వలసపాలనా కాలంలో కూడా రానంత తీవ్రంగా స్వాతంత్య్రానంతర కాలంలో, ప్రజా స్వామిక యుగంలో ప్రజలభాషలకు తిప్పలు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం తమిళనాడులో వుంటున్న తెలుగు కుటుంబాల పిల్లలు తెలుగులో చదువుకుంటున్న వారి లో సుమారు 10 వేల మంది ఎస్.ఎస్.ఎల్.సి (11వ తరగతి) పబ్లిక్ పరీక్షలలో తమిళభాషను మొదటిగా పరిగ ణించి , నూరు మార్కులకు జవాబిచ్చి ఉత్తీర్ణులైన వారే పై తరగతుల చదువులకు అర్హులవుతారు అనే ఆదేశాన్ని తమ పాలిట పిడుగులా భావిస్తున్నారు. ఎందుకంటే తమిళనాడులో దేశమంతటా అమలవు తున్న త్రిభాషా సూత్రాన్ని పాటించటం లేదు. అక్కడ ద్విభాషాసూత్రమే అమలవుతోంది.ఈ సందర్భంగా మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన ముఖ్యాంశ మేమంటే 1951 జనాభాలెక్కల ప్రకారం 41 శాతం మంది తెలుగువారు వున్నారు. అందులో ముఖ్యంగా సరిహద్దు జిల్లాలయిన కృష్ణగిరి, ఆర్కాటు, చెంగల్పట్టు లతో పాటు మదరాసు నగరంలో అత్యధికులుండి పోయారు. బహుశా మరే యితర రాష్ట్రాలలోనూ, తమిళనాట తెలుగువారున్నంత అత్యధిక శాతం రెండో భాషలవారు లేకపోవచ్చు.

రాష్ట్రాల విభజన కాలంలో భాషా రాష్ట్రాల సరిహద్దు జిల్లాలలోని ప్రజలను ఏ రాష్ట్రంలో కలపాలనే సమస్య వచ్చినప్పుడు, ఆనాటి ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్టుపార్టీ సరిహద్దు జిల్లాలవారీ ప్రాతిపదికన కాకుండా, ఆయా జిల్లాల లోని గ్రామాల ప్రాతిపదికగా మెజారిటీ ప్రజలు ఏ భాషీ యులో ఆ రాష్ట్రాల లోనికి చేర్చాలని కోరినప్పటికీ జిల్లాల ప్రాతిపదికను మాత్రమే తీసుకున్నారు. అయిన ప్పటికీ నాటికి నూటికి 90 మంది తెలుగువారుండే కృష్ణగిరిలాంటి (ఇది బెంగుళూరు నగరానికి అనుకుని వుండే తెలుగు ప్రాంతం. కానీ తమిళనాడు రాష్ట్రానికి చెందినది) జిల్లాను కూడా తమిళనాడులోనే చేర్చారు. అందుకొక ముఖ్యకారణం నాటి ప్రముఖ రాజకీయవేత్త అయిన చక్రవర్తి రాజగోపాలాచారి స్వగ్రామం హోసూరు సమీప గ్రామమయి వుండటంగా చెప్పుకుం టారు. ఇప్పుడాకృష్ణగిరి జిల్లాలోనే సుమారు 5000 మంది తెలుగు విద్యార్థులు ఆకస్మికంగా తమిళం పరీక్షను ఎదుర్కొంటున్నారు.

2005 దాకా తమిళనాడులోని తెలుగు విద్యార్థినీ , విద్యార్థులు తెలుగులో చదువుకునే అవకాశాలుండేవి. 2006వ సంవత్సరంలో కరుణానిధి ప్రభుతం 1వ తరగతి నుండి 12వ తరగతి దాకా తమిళాన్ని తప్పని సరిగా చదవాలి అనే ఆదేశాలను (13/2006) చట్టం గా జారీ చేసింది. అవసరమనుకున్నవారు తమ మాతృ భాషను ఐచ్ఛిక (ఆప్షనల్) భాషగా చదువుకోవచ్చునని చెప్పారు. తమిళనాట తెలుగువారే కాక కన్నడం, ఉర్దూ, మళయాళం, హిందీ మాతృభాషగా గలవారు కూడా వున్నారు. వీరందరూ భాషేతర పాఠ్యాంశాలైన గణితము, విజ్ఞానశాస్త్రము, సామాజిక శాస్త్రాలను ఏ భాషామాధ్యంలో చదుకుకోవాలో నిర్దేశితం కాలేదు. ఒకటవ తరగతి నుండి తమిళంలోనే తప్పనిసరిగా చదవాల్సివస్తే, తెలుగు అ..ఆ..ఇ లు కూడా రాయటం నేర్వకుంటే, ఇతర పాఠ్యాంశాలను తెలుగు మాధ్యమం లో చదువుకునే అవకాశమే వుండదు. దీనిని ఉర్దూ మాధ్యమంవారు ప్రశ్నిస్తే పై ఆదేశాలను సవరిస్తూ (జి.వో.44) కొత్త ఆదేశాలు జారీచేశారు.

దాని ప్రకారం భాషా అల్పసంఖ్యాకులు తమిళంలో 50% తమ మాతృభాషలో 50% మార్కుల ప్రశ్నలకు జవాబిచ్చే విధంగా భాషా పాఠ్యాంశాన్ని చదువుకోవచ్చునని ఆదేశించారు. అయినా తగినంత మంది తమిళ ఉపాధ్యాయులను నియమించలేదు. మిగిలిన పాఠ్యాం శాల సంగతి తేల్చలేదు. దానితో దేన్ని అమలుపరచాలో అధికారులకే బోధపడక పాతవిధానాలనే కొనసాగిం చారు. మాతృభాషల్లో చదువు కొనసాగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఉన్నట్టుండి 2016వ సంవత్సరం మార్చిలో 11వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయవలసిన వారందరూ తప్పనిసరిగా తమిళభాషా పాఠ్యాంశంలో 100 మార్కుల ప్రశ్నపత్రానికి జవాబునిచ్చి ఉత్తీర్ణు లయితేనే ఆపై విద్య అనే ఆదేశాన్ని తిరిగి జారీ చేశారు.

గత సంవత్సరం భాషా అల్పసంఖ్యాకుల కమిషన్ నివేదిక ప్రకారం తమిళనాట తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు 57వేల మంది దాకా వున్నారు. కనీసం 10వేల మంది,2016లో పబ్లిక్ పరీక్షలకు హాజరవాల్సివుంటుంది. ఇప్పటివరకు తెలుగులో మాత్రమే చదువుకున్న వీరందరికీ ఈ సరికొత్త ఆదేశం పిడుగుపాటులా వుండి ఆందోళన కలిగిస్తోంది. తక్షణమే ఈ మెడమీద కత్తిని తొలగింప చేయమని ఉభయ తెలుగుప్రభుత్వాలకు, ప్రజలకు తెలియపరిచేవిధంగా ఈ సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర ధర్నా నిర్వహిం చారు. కృష్ణగిరి జిల్లా నుండి ఒక వ్యాన్‌లో వచ్చిన తెలుగు సాహిత్య పరిషత్తువారు ఈ శిబిరంలో పాల్గొ న్నారు. వారికి సంఘీభావంగా స్థానిక తెలుగు సేన కార్యకర్తలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, కొందరిని సమీక రించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్ చక్రపాణి,సి.పి.ఐ నాయకుడు నారాయణ, సినీ రంగానికి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ, జనసాహితి తరపున నేను ఆందోళన కారులనుద్దేశించి మాట్లాడాము. ఉభయ తెలుగు రాష్ట్రప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సినిమారంగము కూడా జోకం చేసుకోవా లని, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడి సమస్యను సామరస్యముగా పరిషరించాలనీ పెద్దలు చెప్పారు.

ఈ సందర్భంగా భాష-జాతులుకి సంబంధించిన విద్యామాధ్యమం గురించిన ముఖ్యాంశాలు కొన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. 1953లో ఐక్యరాజ్యసమితి వారి విద్యా, విజ్ఞాన శాస్త్రాల సాంస్కృతిక సంస్థ(యునెస్కో) విద్యా విధా నంలో దేశీయ భాషలవాడుకను, మాతృభాష లో విద్యాబోధనను గరపవలసిందిగా ప్రపంచ దేశా లకు చేసిన సూచనను ముఖ్యంగా గమనంలో వుంచుకోవాలి. మనకంటే ఆలస్యంగా బ్రిటీషు సామ్రాజ్య వాదుల ప్రత్యక్ష వలస పాలన నుంచి బయటపడిన మలేషియా దేశంలో నూటికి 6గురు మాత్రమే తమిళలున్నా వారికి తమిళ భాషలోనే విద్యను మాధ్యమంగా నేర్పుతున్న విషయాన్ని మనమూ, తమిళసోదరులు కూడా గ్రహించాలి. శ్రీలంకలో నూటికి 18 మంది తమిళులు మాత్రమే వున్నారు. (అందులో మూడవ వంతు దాకా తెలుగువారుంటారు కానీ వారు కూడా తమిళులు గానే పరిగణింపబడతారు) ఆ దేశంలో 1956లో సింహళ భాషను మాత్రమే ఏకైక జాతీయ భాషగా గుర్తించినప్పుడు కాల్విన్ డిసిల్వా అనే కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యుడన్న మాట జ్ఞాపకం చేసుకోవటం అవసరం. “ మనం రెండు జాతీయ భాషలను గుర్తించినట్లయితే ఒకే సింహళజాతి అభివృద్ధి చెందటానికి అవకాశం వుండేది. ఇప్పుడు ఒకే జాతీయ భాషను గుర్తించటం వల్ల రెండు జాతు లు దేశంలో పొడసూపే అవకాశాన్ని పెంచినవార మవుతున్నాము.” సింహళ జాతీయుడైన ఆ కమ్యూ నిస్టు ప్రతినిధి పేర్కొన్న రెండవ భాష తమిళమే. తదనంతరకాలం నుంచి ఇటీవలిదాకా సంభవించిన ఉద్యమాలు, అణచివేతల పరిణామాలు డిసిల్వా హెచ్చరికనే రుజువు పర్చాయి.

మనం రాజ్యాంగంలో ఎన్ని రాసుకున్న సొంత భాషా ప్రజలనే అణచివేస్తూ ఇంగ్లీషు దాస్యానికి పూనుకుంటున్న ప్రభుత్వాలనిప్పుడు చూస్తున్నాము. ప్రాథమిక విద్యలో చేరిన వెయ్యిమందిలో ఏ ఒక్కరో అమెరికా లాంటి దేశాలకు వెడుతుంటే, వారికోసమే అన్నట్టు మిగిలినవారందరికీ చిన్న తరగతుల నుండీ ఇంగ్లీషు మాధ్యమంలో బోధనలు చేయటం నేర పూరిత విధానం తప్ప మరొకటికాదు. ఐక్యరాజ్య సమితి నిర్ణయాల ప్రకారమైనా ఇతర దేశాల అనుభ వాలు చూచినా అదే మనకు అర్థమవుతుంది. ఫ్రాన్స్, జర్మనీలాంటి ఐరోపాదేశాలూ, రష్యా, చైనాలాంటి ఒకనాటి సామ్యవాద దేశాలూ, జపాను, దక్షిణ కొరియాల్లాంటి ఆసియా దేశాలూ, తమతమ మాతృభాషల్లోనే విద్యను మాధ్యంగా బోధించి శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాలను కూడా బాగా అభివృద్ధిపరుకున్నాయి.

ఆసియా నుంచి ఉత్తమ విశ్వవిద్యాలయాలుగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మొదటి 40లో, భారతదేశపు విశ్వవిద్యా లయం ఒక్కటి కూడా ఎందుకు లేదు? ఇంగ్లీషు మాధ్యమం చదువులు భారతీయుల మేథోసంపత్తిని పెంచినట్లా తుంచినట్లా? పై 40 విశ్వవిద్యాల యాల్లో ఒక్కటైన ఇంగ్లీషు మాధ్యంలో బోధిస్తు న్నాయా? ఇంగ్లీషు భాషను బాగా నేర్వాలన్నా అది మాతృభాష ద్వారానే సాధ్యమనే కనీస అవగాహన కోల్పోయిన ఫలితంగా, దేశీయ భాషలను, సోదర భాషలను తృణీకరిస్తుండటం. ఇప్పటికైనా పునరా లోచన చేసుకోవాల్సిన విషయం. ప్రస్తుత తమిళ ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో తెలుగువారు కేవలం 4శాతం మాత్రమే వున్నారని ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. అదే నిజమన కున్నా 60 సంవత్సరాల క్రితం నూటికి 40 మందికి పైగా గల తెలుగువాళ్లు నలుగురికి పడిపోయారంటే అంతకంటే భాషల అణచివేతకు మరొక నిదర్శనమే ముంటుంది?

కనుక తక్షణమే: తమిళనాట పబ్లిక్ పరీక్షలు రాయవలసిన తెలుగు విద్యార్థులకు, తెలుగు మాధ్యమంలోనే రాసే అవకాశం కల్పించమని ఆ రాష్ట్రం ప్రభుత్వం పై రాజకీయ ఒత్తిడి పెంచాల్సిన అవసరం వుంది. ఆ రాష్ట్రపు ప్రజల భాషలైన తమిళం, తెలుగు తదితర మాధ్యమాలలోనే ఆయా విద్యార్థులకు బోధనను కొనసాగిస్తూ, ఇంగ్లీషుని తక్షణమే వది లించు కోలేని పరిస్థితులలో తెలుగు తదితరులకు తమిళమూ, తమిళులకు తెలుగు లాంటిదీ ఐచ్ఛిక భాషగా, 3వ భాషగా నిర్ణయిం చటం మంచిది. తమిళనాట తెలుగువారి విద్య, సాంసృృతిక, ప్రజాస్వామిక ప్రాతినిధ్యహక్కులకు భంగం కలుగ కుండా తమిళనాట రాష్ట్ర ప్రభుత్వాలు పూచీ వహి స్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే టట్లు ప్రకటిస్తూ వుండాలి. ఇది కేవలం రెండు రాష్ట్రల, జాతుల భాషా సమస్యలాగా వున్న కేంద్ర ప్రభుత్వం అన్ని జాతుల మాతృభాషల ప్రజల హక్కును పరిరక్షించే చర్యలు గైకొనాలి. తెలుగులూ, తమిళులూ, ఇంగ్లీషు భాషా మాధ్యమపు బరువుని వదిలించుకునే క్రమం ప్రారంభం కావాలి.