Search
Wednesday 21 November 2018
  • :
  • :

చట్టం డబ్బున్న వాడి చుట్టమా…?

SalmanKhan

‘అపరాధి శిక్ష నుంచి తప్పించు కోవడమంటే అది మన న్యాయ వ్యవస్థ తీరులోని లోపంగా పరిగణించాలి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు దేశంలోని అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు …. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహార్‌తోపాటు మరో న్యాయమూర్తి సి.కె.ప్రసాద్‌తో కూడిన బెంచ్ దేశం లో నేర విచారణ(ప్రాసిక్యూషన్) సాగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ కిషన్ బాయ్ కేసులో తీర్పు ఇస్తూ న్యాయమూర్తులు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
అరుదైన కృష్ణజింకలను అమానుషంగా కాల్చిచంపిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రక టిస్తూ జోథ్‌పూర్ సెషన్స్‌కోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో మరోసారి ప్రాసిక్యూషన్ తీరుపై చర్చించుకోవాల్సిన అవ సరం వచ్చింది. ఎవరైనా ఒక నేరానికి పాల్పడినప్పుడు వారిపై కేసు నమోదు చేసి, దానిపై విచారణ చేసి చివరకు కోర్టులో శిక్షపడే వరకు సాగే వ్యవహారాన్నంతా ప్రాసిక్యూషన్‌గా పిలుచు కుంటారు.
దుందుడుకు చర్యలతో ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకునే సల్మాన్‌ఖాన్ 18 సంవత్సరాల క్రితం రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్‌లో ఒక సినిమా షూటింగ్‌కు వెళ్ళి అక్కడ కృష్ణ జింకలను వేటాడటమే కాకుండా వాటిని తన వద్ద ఉన్న తుపాకితో కాల్చి చంపినట్లు అప్పట్లో మీడియా ప్రముఖంగా ప్రకటించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం మూడు కేసులు నమోదు చేయగా వాటి లో మొదటి రెండు కేసుల్లో సల్మాన్ దోషిగా తేలగా ఉన్నత న్యాయస్థానం సరైన సాక్షాలు లేవని వాటిని కొట్టేసింది. తాజాగా ఆయన వాడిన ఆయుధాల కాలపరిమితిపై ఆయుధాల చట్టం కింద పెట్టిన మూడో కేసును సరైన సాక్షాధారాలు లేని కారణంగా సెషన్స్ కోర్టు కొట్టేసింది.
ఈ తీర్పు చూశాక చాలామంది ఎప్పటిలాగే మన న్యాయవ్యవస్థపై విమర్శలు ఎక్కుపెడుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ వీరాభిమానులు మాత్రం సంబరాల్లో మునిగి తేలారు. అది వేరే విషయం. ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు ఈ తరహా తీర్పులు వచ్చినప్పుడు చట్టం డబ్బున్న వాడి చుట్టమని పెదవులు విరిచిన వారు లేకపోలేదు.
చాలామంది పొరపడుతున్నట్లుగా క్రిమినల్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడకపోవడానికి న్యాయస్థానాలు ఎంతమాత్రం కారణం కాదు. బ్రిటిష్ కాలం నుంచి అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మన పోలీస్ వ్యవస్థ కారణం. కేసులు నమోదు చేయడంలో చూపుతున్న ఉత్సాహాన్ని పోలీసులు ఆ తర్వాత ప్రాసిక్యూషన్‌లో చూపకపోవడంవల్లే నూటికి 70 శాతం కేసులు కింది స్థాయి కోర్టుల్లోనే వీగిపోతున్నాయి.
సల్మాన్ కేసులో కూడా జరిగింది. ఇదే..సరైన సాక్షాధారాలు లేని కారణంతోనే కోర్టు ఈ కేసు కొట్టేసింది. కేసు నమోదు చేసిన తర్వాత విచారణ పూర్తి కావడానికి ఎంత లేదన్నా మూడు సంవత్సరాలు పడుతుంది. ఈలోగా ఆ కేసును విచారించే అధికారి ఎక్కడికో బదిలీ అవుతాడు. అతను ఎక్కడున్నా సాక్షం చెప్పడానికి కోర్టుకు రావాల్సిందే. పదే పదే కోర్టుల చుట్టూ తిరగడం ఇష్టంలేని సదరు అధికారి కావాలని బలహీనమైన సాక్షం చెప్పి కేసును నీరుకారుస్తాడు. చార్జ్‌షీట్‌లో సాక్షులను ఎడాపెడా చేర్చడంలో అత్యు త్సాహం చూపే పోలీసులు వారిని సాక్షానికి తీసుకు రావ డంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాసిక్యూషన్‌లో పోలీసులు చేసే తప్పుల వల్ల ఎంతోమంది నిర్దోషులుగా బయటపడుతున్నారు. ఒకవేళ కోర్టు వరకు కేసు వచ్చినా సాక్షులతో లాలూచీ పడి సెటిల్ మెంట్లు చేసే కోర్టు కానిస్టేబుళ్లు ఎలాగూ ఉన్నారు. మరో వైపు ఎటువంటి తప్పులు చేయకపోయినా అక్రమ కేసుల వల్ల ఏళ్ల తరబడి జైళ్ళలో మగ్గుతూ తమ విలువైన జీవి తాలు కోల్పోతున్నారు. ఒకవేళ కేసులనుండి వారు నిర్దోషు లుగా బయటపడినా చేయని తప్పులకు అండర్ ట్రైల్స్‌గా శిక్షలు మాత్రం అనుభవిస్తున్నారు. మన ప్రాసిక్యూషన్ విధానంలో అడుగడుగునా లోపాలున్నట్లు 2005లోనే గుర్తించిన సుప్రీంకోర్టు ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పట్లోనే ఆదేశాలు జారీచేసింది. చాలా ఆదేశాల మాదిరిగానే ఇవి కూడా ఎక్కడో మూలన పడ్డాయి. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇస్తూ పోలీ సుల విచారణ తీరును తీవ్రంగా తప్పు పట్టింది. ప్రాసి క్యూషన్‌పై పోలీసుశాఖకు సరైన అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచనలు చేసింది.
ప్రాసిక్యూషన్ విభాగం గతంలో పోలీస్ శాఖ పర్య వేక్షణలో ఉండేది. దీనివల్ల పోలీసులకు, పోలీస్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు మధ్య అవగాహన ఉండేది. 1973లో సివిల్ ప్రొసీజర్ కోడ్‌కు సవరణ తీసుకు రావడం ద్వారా ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్ విభాగం ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలు ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్లంతా ఈ డైరక్టరేట్ అజమాయిషీలో పని చేస్తున్నారు. వీరిలో నేరుగా ఎంపికై ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగేవారు కొందరైతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా తాత్కాలిక నియామకాల ద్వారా ఎంపి కయ్యేవారు మరి కొంతమంది. తాత్కాలిక ప్రాతిపదికన ఎంపిక చేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జాబితాలు పేరుకు జిల్లా న్యాయమూర్తుల ద్వారా వెళుతున్నా అంతిమంగా నిర్ణయం తీసుకునేది ప్రభుత్వాలే.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలలో అనుభవాన్ని తుంగలో తొక్కి కేవలం పార్టీ సానుభూతి పరులకో, తమ కులా నికి చెందిన వారికో లేదంటే బంధుగణానికో అప్పచెప్పు తున్నారనే విమర్శలు చాలాకాలంనుంచి ఉన్నాయి.
ప్రాసిక్యూషన్ కేసులు వీగిపోవడానికి పోలీసులు ఎంత కారణ మో ఎటువంటి అనుభవం లేని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా అంతే కారణమని చెప్పాలి. కసబ్ లాంటి నరరూప రాక్షసులను ఉరికంబం ఎక్కించిన ఉజ్వల్ నిగం లాంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చాలా అరుదుగా కన్పిస్తారు.
చట్టానికి కళ్ళు ఉండవు కేవలం చెవులు మాత్రమే ఉంటాయని చెప్పడానికి ప్రధాన కారణం కూడా అదే. సాక్షాధారాలు సక్రమంగా ఉంటేనే నేరం చేసిన వారిని శిక్షించే అధికారం కోర్టుకు ఉంటుంది. కేవలం కేసులు పెట్టి తమ పనైనట్లు చేతులు దులుపుకోవడం కాకుండా పోలీసులు చివరి దాకా ప్రాసిక్యూషన్‌ను సక్రమంగా కొనసాగిస్తేనే ఇది సాధ్యపడుతుంది.

– చెన్నూరి గణేశ్,
8897300975

Comments

comments