Home రాష్ట్ర వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల నిరసనలు

lyrs

 హైదరాబాద్‌లో హైకోర్టు నుంచి చార్మినార్ వరకు ఊరేగింపు 

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైకోర్టుకు పూర్తికాలం ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తుల ఖాళీ పోస్టులను వెంటనే నియమించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించి, నిరసనకార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని హైకోర్టు నుంచి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు చార్మినార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు జెల్లి కనకయ్య, జనార్ధన్‌గౌడ్, శ్రీగోవర్దన్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, అనంతచారిలు మాట్లాడుతూ..ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఉన్నారని అతని స్థానంలో పూర్తి కాలం ప్రధాన న్యాయమూర్తిని నియమించాలన్నారు. అలాగే వివిధ కోర్టులలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఇక హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాడం ద్వారా న్యాయవాదులకు వెసులుబాటు కలుగుతుందన్నారు. నేర విచారణ చట్టం 41 సిఆర్‌సిపి చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారన్నారు. 41 సిఆర్‌పిసి చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల బహిష్కరణ కొనసాగనున్నట్లు తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు, రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టుతో పాటు ఆయా జిల్లాల పరిధిలోని న్యాయస్థానాల వద్ద న్యాయవాదులు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు.