Home ఆఫ్ బీట్ వాలిపోయే గూడు వదిలి…ఎగిరిపోతే!!

వాలిపోయే గూడు వదిలి…ఎగిరిపోతే!!

Gender-sensitaisesan

ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటాను. వాట్ విమెన్ వాంట్ అనే సినిమా వచ్చింది. అందులో కధానాయకుడు ఆడవాళ్ళ మనసులో ఆలోచనలను వింటుంటాడు. దాని ఆధారంగా ‘నైకి బ్రా’ కు అడ్వర్టైస్మెంట్ చేస్తాడు. ఆ ఆడ్ లో ఒక క్రీడాకారిణి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూంటుంది. ఒక ధ్యానం లా…. ఆమె పరిగెడుతూనే ఉంటుంది. ఆ వెనుకే వ్యాఖ్యానం- నువ్వు అద్దం ముందు నిలబడి ఉన్నప్పుడు నీ దారికి నువ్వు నచ్చవా అని ఆలోచించవు. సెక్సీ గా ఉంటే పరిగెట్టడం ఇంకాస్త కష్టం. నీ దారి నువ్వు లిప్స్టిక్ వేసుకున్నావా అని పరీక్షించదు. ఎవరు చూసారూ… ఏమన్నారూ అనవసరం. నీ లక్ష్యం నీకు తెలుసు. అది పూర్తిగా నీకు, నీ దారికి మాత్రమే సంబంధించినది…. ఆమె దారి ఆమెను కోరుకునేదొక్కటే. అప్పుడప్పుడూ ఆమె తనను పరుగుతో పలకరిస్తే బావుందనుకుంటుంది. , నైకి- నో గేమ్స్, ఓన్లీ స్పోరట్స్. నాకెందుకో ఆ రోజు నుంచి ఆ వాక్యాలు చాల ఇష్టంగా మనసులోపల దాచుకున్నాను. అందాన్ని మించి, తీర్పుల కావల ఉన్న బాట మన కోసమే. ఒకే రకమైన బట్టలు వేసుకునే లక్ష్యం లో తేడాలు. పొలాల్లో పని చేసుకునే ఆడవాళ్ళ కాళ్ళ దగ్గరనుంచీ, జిల్లాస్థాయి పోటీల్లో పరుగు పందెం, కబడ్డీ క్రీడలకు చెడ్డీలలో పాల్గొనే అమ్మాయిలదాకా ఉండే నిబ్బరాన్ని చూసినప్పుడు…అరిపాదాల పగుళ్ళను దాచని, మోకాలి మచ్చలను మతించని ఆ నిబ్బర సౌందర్యాన్ని చూసినప్పుడు కాస్త సిగ్గేస్తుంది. నిజమే జీవితంలో కావలసింది మన ఆలోచన పట్ల స్పష్టత మరికాస్త విశ్వాసము. అదే మనకు కావలసింది.

అసలు మనకు మనపట్ల సహనం లేదు, మన అవసరాల పట్ల అవగాహన కూడా లేదు. నమ్మే విలువలు నిరూపించడం కోసం ఎంతకైనా తెగిస్తాము. అసహనం వ్యక్తం చేస్తాము. ఒక కంఫర్ట్ జోన్ లోకి ఒదిగిపోయి కుళ్ళి కృశించి విలువల బోధన చేస్తాము. మనలా అందరూ ఎందుకుండరని వాపోతాము. కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నవారు నిబ్బరంగా సాగిపోతారు. మీమాంస- ఎప్పుడూ చేతగానివీరుల చేతిలో విల్లులా ఒదిగిపోతుంది.
రెండు వారాల క్రితం నేను ప్రస్తావించిన లైంగికత గురించి మరికాస్త పొడిగించి జెండర్ సెన్సిటైసెషన్ గురించి చెప్తాను. ‘జెండర్ సెన్సిటైసెషన్’ అనే పదం ఈ మధ్య చాలా మెదులుతోంది ఈ మధ్య. సరే, ఈ వారం దీని గురించి మాటలాడదాము అనుకున్నాను కదా, తెలుగులో రాస్తున్నప్పుడు మళ్ళీ ఇంగ్లీషు పదాలు ఎందుకని తెలుగు డిక్షనరీ లో చూస్తే దానికి సరిపోయే అర్ధమే లేదు. జెండర్ అంటే ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నవారికే అర్ధం తెలియదు, ఇంకా సెన్సిటైస్ అంటే ఇక ఏం తెలుస్తుంది? ‘సున్నితము చేయు’ అనే అర్ధం ఇచ్చారు ఇంటర్నెట్ లో. సున్నితము చేయు…ఈ మాట బావుంది. కానీ వివక్షను సంస్కృతిగా స్తుతిస్తున్న మనకు ‘సున్నితము చేయు’ ఆలోచనలు ఎలా వస్తాయి. ఒక అమ్మ అంటుంది. నువ్వు బట్టల్లో చూపించే ఆధునికత నీ నడత లో చూపించు అని. డ్రెస్ మాడెస్ట్, యు విల్ హావ్ లెస్ ప్రాబ్లంస్ అంటుంది స్నేహితురాలు తన కూతురుతో…అసలు మీకెందుకమ్మ మగ పిల్లలతో స్నేహాలు అంటారు కొందరు. అరిటాకు ముల్లు సామెత పాతబడింది, ఇప్పుడు పులి మేక సామెత చెబుతారు కొందరు. మొన్నే రిలీజ్ అయిన పింక్ సినిమా ను ఇంట్లో అలిసిపోయిన భార్య ఇచ్చిన కాఫీని తాగుతూ పొగుడుతూంటారు ఇంకొందరు. అప్లికేషన్ ఫారాల్లో సెక్స్(లింగము) అనేది మన స్ధితి(స్త్రీ లేదా పురుషుడిగా విభజించగలిగే నిర్మాణ సూచనాపదం) అనీ జెండర్ అంటే దానికి ఆపాదించే లక్షణాలనీ, సెక్స్ ‘బయోలాజికల్’ అయితే జెండర్ ‘సోషల్’ అనీ కొందరికే తెలుసు. ‘మాన్ ఇస్ ఎ సివిలైసడ్ ఆనిమల్’, అంటారు. జంతువులలో ఈ జెండర్ వివక్ష ఉండదు. ఇటువంటి విలువల తీర్పులు ఇస్తారని కూడా అనుకోను. వాడో జంతువు! ఇటువంటి మాటలని పాపం జంతువులను ఎందుకు అవమానిస్తారో అర్థం కాదు. ‘ది మిస్టీరియస్ స్ట్రేంజర్’ అనే నవలలో మార్క్టె్వయిన్ అంటాడు- అమానుషం అనకండి. మీరు చేసే ప్రతి ఆకృత్యమూ మానుషమే. మనుషులలో మాత్రమే ఇటువంటి ఘోరమైన ఆలోచనలు వస్తాయి. జంతువులు సాటి జంతు వులని ఈ విధంగా ఎప్పుడూ హింసించవు. కానీ ఫ్రెండ్స్…..ఈ పులి-మేక, జంతువు- నరుడు, మగ- ఆడ; సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆప్ లు, పెప్పర్ స్ప్రే లు దాటి, అబ్బాయిలకు ‘ఆడవారిని బస్సుల్లో వారి సీట్లలో కూర్చోనివ్వడమే గౌరవం’ అన్న ఆలోచనకు మించి కాస్త ఇంగితం ఇవ్వలేమా… ఎవరి గూట్లోనో వాలిపోక, నింగికి ఎగిరిపోయే అమ్మాయిలను సృష్టించలేమా? అమ్మాయిలూ….వంటింటి పోపులకావల, బ్యూటీపార్లర్లను దాటి మనకేం కావాలో తెలుసుకోలేమా? ఎగిరిపోలేవూ…??

అపర్ణ తోట