Home ఎడిటోరియల్ మతతత్త్వ ప్రమాదం : తగ్గిన లెఫ్ట్ చురుకుదనం

మతతత్త్వ ప్రమాదం : తగ్గిన లెఫ్ట్ చురుకుదనం

leftదేశంలో మతతత్త్వ ప్రమాదం వేగంగా వ్యాపి స్తుండగా వామపక్షాలనుంచి అందుకు తగిన స్థాయిలో స్పందనలు కనిపించకపోవటం ఆశ్చర్య కరంగా, ఆందోళనకరంగా కూడా ఉంది. ఢిల్లీస్థాయి లో కొద్దిగా కదలికలు ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల లో మాత్రం దాదాపు శూన్యం. ఇందుకు కారణమేమిటో తెలియదు.
తాజాగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పెద్దవార్తగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని బిషాదా గ్రామ ఘటనను గమనించండి. అక్కడ అఖ్లాక్ అనే వ్యక్తిని ఆవుమాంసం తిన్నాడనే నెపంతో (అది ఆవుమాంసం కాదని ఆయన కుటుంబసభ్యులు నిరాకరించగా, తర్వాత పోలీసులు చేయించిన లేబరేటరీ పరీక్ష లోనూ అదే తేలింది). దాడిచేసి ప్రాణం తీయటం తెలిసిందే. ఇది ఎక్కడో ఉత్తరదేశాన ఒక చిన్న గ్రామంలో ఒకే ఒక వ్యక్తి మరణమే కావచ్చు. కాని ఇది ఒక వాతావరణంలో, ఒక ఘటనా పరంపరలో భాగంగా జరిగింది. ఇటువంటిది ఒక పది పదిహేనేళ్ల క్రితం చోటుచేసుకుని ఉంటే వామపక్షాలు ఏమి చేసి ఉండేవి. జాతీయస్థాయిలోనే కాదు, దేశ వ్యాప్తంగా ప్రతిరాష్ట్రంలో ఇందుకు సమాధానం తెలియనివారు లేరు. మతతత్తాన్ని కేవలం మొక్కుబడి ప్రకటనలతో ఖండించటం కాదు. విలేఖరుల సమావేశాలు, సభలు, ప్రదర్శనలతో, ఇంకొంతవెనుకకు వెళ్లినకాలంలోనైతే గోడలపై నినాదాల రాతలతో నగరం హోరెత్తి ఉండేది.
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు అన్నట్లు, వామపక్షాలు ఈ సంప్రదాయాన్ని రాష్ట్రాల స్థాయిలో మరచిపోయి, లేదా గణనీయంగా బలహీనపడి కనీసం ఒక దశాబ్దం గడచిపోయింది. ఇందుకు కారణం బహుశా ఒకటి అయి ఉంటుంది. లోగడ యథాతథంగానే సెక్యులరిజం ఒక బలమైన విలువగా ఉండేది. ఇతరత్రా రాజకీయాలు, అధికారాలతో నిమిత్తం లేకుండా మతతత్త వ్యతి రేకత ఒక నిబద్ధాంశం అయేది. కాని క్రమంగా పరిస్థితులు మారుతూ రెండింటికి సంబంధం ఏర్పడుతూ పోయింది. అధికార రాజకీయాల వత్తిళ్లలో సెక్యులరిజపు నిబద్ధతకు అగ్రప్రాధాన్యత పోయి, అటువంటి రాజకీయాలతో సమానమైన లేదా ద్వితీయ ప్రాధాన్యత లభించసాగింది. మత తత్త వ్యతిరేక సెక్యులర్ కార్యకలాపాలు నెమ్మదిగా మందగించటానికి ఇంతకన్న మరొక కారణం కనిపించదు. ఈ భావన కేవలం అపోహ కాదని, అందుకు ఆధారాలు ఇవీ అని 1-2-3 పద్ధతిలో చెప్పటం తేలిక కాకపోవచ్చు. కాని విషయాలను చిరకాలంగా గమనిస్తున్న మీదట కలిగే అభిప్రాయ మిది. అందువల్ల వామపక్షాలు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో, దీనిపై సమీక్షించు కోవటం మంచిది కావచ్చు. ఆ పనిచేయదలచు కుంటే, దేశంలో ప్రమాదకరంగా విస్తరిస్తున్న లేదా విస్తరింపచేసేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వ బాధ్యులు, సంఘ్‌పరివారీయులు ఒక పద్దతి ప్రకారం చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేయటాన్ని ఈ పార్టీలు అగ్రప్రాధాన్యంగా తీసు కోవాలి. ఇందులో ఎంత జాప్యం చేస్తే అంత హాని కలుగుతుంది. బిషాదా గ్రామఘటన ఇపుడు అంతరా ్జతీయ వార్తగా మారి నరేంద్రమోడీ ప్రభు త్వాన్ని, సంఘ్ పరివార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కాని అంతకన్న ముఖ్యంగా వారు మరొక స్థాయిలో దానిని లెక్క చేయకుండా తమ ధోరణిలో ముందుకు సాగటం గమనించదగ్గది. ఆ ఘటనవల్ల అంతర్జా తీయంగా దేశప్రతిష్ట దెబ్బతింటున్నదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం నాడు అమెరికాలో ఆందోళన చెందారు. మత సామరస్యాన్ని అందరూ పాటించా లంటూ అదే రోజు ఢిల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కోరారు. అదే రోజు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి మన్మోహన్ వైద్య, తమను ఆ వివాదంలోకి లాగవద్దని, అందుకు బాధ్యులైనవారిని శిక్షించాలని అన్నారు. ఇంతకన్న గమనించదగ్గది ఏమంటే, గతనెల 30వ తేదీనుంచి వారంరోజులుగా దేశ విదేశా లలో ఈ విషయమై ఇంత చర్చ జరుగుతున్నా ప్రధానమంత్రి మోడీ ఏ వ్యాఖ్య చేయలేదు. జైట్లీ, రాజ్‌నాథ్, వైద్య మాట్లాడిన రోజునే బిజెపి ఎంపి సాక్షి మహరాజ్ ఢిల్లీలో మాట్లాడుతూ, ఎవరైనా గోవు ను చంపేందుకు ప్రయత్నిస్తే తాము వారిని చంపేందుకైనా, చావటానికైనా సిద్ధమని ప్రకటిం చారు. ఇటువంటి వ్యాఖ్యలకు ఇప్పటికే పేరుపడిన సాక్షి మహరాజ్‌కు ఇఖ్లాక్ నివాసంలో లభించిన మాంసం ఆవుది కానట్లు లేబరేటరీ పరీక్షలో తేలిన సంగతి తెలియదనుకోగలమా? అయిన్పప్పటికీ తన స్వరంలో ఆ గుర్తింపుగాని, సంయమనంగాని, ఇఖ్లాక్‌పై దాడిపట్ల విచారంగాని కనిపించదు.
నరేంద్రమోడీ మౌనానికి అర్ధం ఆయన జైట్లీ, రాజ్‌నాథ్‌ల కోవలోని వ్యక్తా, లేక సాక్షి మహరాజ్ కోవలోకి వస్తారా? వాస్తవానికి జైట్లీ, రాజ్‌నాథ్, సాక్షి మహరాజ్, మోడీలలో ఒకరికొకరు తేడా లేదు. అందరి అజెండా హిందూ మతతత్తాన్ని ముందుకు తీసుకుపోవటం, అధికార సాధన. అందుకోసం రక ర కాల పాత్రాభినయాలు చేస్తారు. తేడా అదొక్కటే, ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి వేర్వేరు విధా లైన మతతత్త ఘటనలు అంతకు ముందుకన్నా పెరిగినట్లు కేంద్ర హోంశాఖ రిపోర్టు స్వయంగా పేర్కొన్నది. బయట కనిపిస్తున్న పరిస్థితు ల గురించి అయితే చెప్పనక్కరలేదు. అయినప్పటికీ దృశ్యం మారటం లేదు సరికదా మరింత క్షీణిస్తు న్నది. సెక్యులర్ విలువలుగల వారిపై దాడులు, హత్య లకు కన్నడ రచయిత కల్బర్గి హత్య తాజా ఉదాహరణ.
ప్రధాని మోడీ ఇటువంటి ధోరణిని ఆపేందుకు ఏమీ చేయరు. ఆయన ఎక్కడో ఉత్తరప్రదేశ్ మారు మూల గ్రామపు ఘటనను ఆపేందుకు ఏమి చేయ గలరని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కాని ఇటువంటివి జరుగు తున్నది ఒక వాతావరణంలో. ఆ వాతా వరణం సృష్టికి సాక్షి మహరాజ్ వంటి తన పార్టీ నాయకులు, బిష్వారా ఘటన “ప్రమాద వశాత్తు” జరిగింది మాత్రమే నన్న ఆయన క్యాబినెట్ మంత్రి మహేశ్‌శర్మ వంటివారు నిరంతరం ప్రయత్ని స్తున్నారు. వీరిని నిలువరించటం ఎంతమాత్రం అసా ధ్యం కాదు. అయినప్పటికీ, ఆ దిశలో జరుగు తున్న ది కనిపించదు. నిర్దిష్టమైన ఘటనలు, వ్యక్తులు, ధోర ణుల విషయమై ఏమీ చేయని ప్రధానమంత్రి, అన్ని మతా ల వారు తనకు సమానమని, దేశంలో అంద రికీ సమానమైన హక్కులూ స్వేచ్ఛా ఉన్నాయని అపుడపుడు గంభీరమైన ప్రకటనలు మాత్రం చేస్తుం టారు.
ఇందుకు ప్రతిగా, సెక్యులరిస్టులమనే వారు ఏమి చేస్తున్నారన్నది ప్రశ్న. సెక్యులరిస్టులమని చెప్పుకునేవారికి కొరతేమీ లేదు. వామపక్షాలే కాదు (విప్లవకారులు సహా), ఇతర పార్టీలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సంస్థలు, సంఘాలు న్నాయి. ప్రజాస్వామికులున్నారు. అనేక వందల మంది రచయితలు, కళాకారులు, మేధావులు ఉన్నారు. ఇఖ్లాక్ ఉదంతంపై కవులు కవిత్వాలు రాయటం బహుశా ఇప్పటికే మొదలై ఉంటుంది. కాని, మతతత్త విస్తరణకు, చర్యలకు వ్యతిరేకంగా ప్రచారాలకు, ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు జరుగుతున్న దేమీ కన్పించదు – కల్బుర్గి తరహా ఘటనలపై ఒకటిరెండు సభలు మినహా.
సమస్య సరిగా ఇక్కడనే ఉంది. సెక్యులరిజం కోసం మొక్కుబడిగా ఒకటిరెండు కార్యక్రమాలు మినహా ఒక పద్ధతిప్రకారం, తరచు జరిగే కార్య క్రమాలు గతంలోవలె లేకుండా పోయాయి. అంత కన్న ముఖ్యంగా, అసలు సెక్యులరిజం ఎందుకు బల హీనపడుతున్నది, దానిని శక్తివంతం చేయటం ఎట్లా, మతతత్తపు పలుకుబడి నిరోధానికి చేయవలసింది ఏమిటనే ఆలోచనలు లోతుగా జరగటమే లేదు. లాంఛనప్రాయపు ఖండనలు, దాని తో బాధ్యత ముగిసిపోయిం దన్నట్లు చేతులు దులుపుకోవటం తప్ప. హిందూత్వ అజెండాపట్ల వారి కున్న నిబద్ధత, సెక్యులరిజంపట్ల వీరికి లేదు. సెక్యులరిజపు నిర్వ చనాలు సైతం ఎవరివి వారు చెప్పుకుంటు న్నారు. దానిని ఎవరి అవసరాలకు వారు ఉపయోగించు కుంటున్నారు. అందుకు అనుగుణంగా ఎవరి వ్యూహాలు, ఎత్తుగడలు వారివవు తున్నాయి. మతతత్త విస్తరణకు, సెక్యులరిజం బలహీనతకు ఇంతకుమించిన అనువైన పరిస్థితులు ఏముం టాయి?
– 9848191767