Home జగిత్యాల బ్యాలెట్ బాక్స్‌లో సిఎంకు లేఖ

బ్యాలెట్ బాక్స్‌లో సిఎంకు లేఖ

CM-KCRరాయికల్: తమ గ్రామ రోడ్డు గుంతలమయంగా మారిందని, ప్రయాణానికి వీలు లేకుండా ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాసిన లేఖను బ్యాలెట్ బాక్స్‌లో వేసిన గ్రామస్తుల కథనం ఇది. రాయికల్ మండలం మూటపెల్లి గ్రామస్తులు 68వ పోలింగ్‌బూత్ పెట్టెలో ఈ లేఖను వేసి తమ రోడ్డు బాగు కోసం నిధులు అందించాలని ఈ లేఖ ద్వారా సిఎంను వేడుకున్నారు. భూపతిపూర్ ఎక్స్ రోడ్డు నుండి మూటపెల్లి గ్రామం వరకు పంచాయతీ రాజ్ బిటి రోడ్డు గుంతలమయంగా మారి ఏళ్లు గడుస్తున్న పట్టించుకునే నాథుడే లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో ఈ గ్రామస్తులు రాయికల్‌కు రావడమంటేనే జంకే పరిస్థితి నెలకొంది. కొత్తపేట, వివిరావుపేట, జగన్నాథ్‌పూర్, మూటపెల్లి గ్రామాల ప్రజలకు రాయికల్, జగిత్యాల రావాలంటే ఈ గుంతల రోడ్డే దిక్కు. అందుకే గ్రామస్తులు ఎంపిటిసి ఎన్నికలను కేంద్రంగా చేసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తమ రోడ్డు దుస్థితిని తెలియజేయడానికి లేఖను బ్యాలెట్ బాక్స్‌లో వేసి తమ వినతిని తెలియజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ రోడ్డు బాగుకోసం తరలితే గ్రామస్తుల కోరిక నెరవేరినట్లేనని పలువురు భావిస్తున్నారు.

Letter to CM KCR in Ballot Box