Home అంతర్జాతీయ వార్తలు గుహ నుంచి ఆరుగురికి విముక్తి

గుహ నుంచి ఆరుగురికి విముక్తి

మిగిలిన వారి కోసం థాయ్‌లో ముమ్మర యత్నాలు 

Protection-s

మేసాయ్: థాయిలాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకు పోయిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురిని సహాయక బృందాలు ఆదివారం కాపాడాయి. జూనియర్ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన వీరితో పాటు కోచ్ కూడా గత 15 రోజులుగా గుహలోనే చిక్కుపడిన విషయం విదితమే. వీరిని బయటికి తీసుకురావడానికి థాయిలాండ్ ప్రభుత్వంతో పాటు గా పలు విదేశీ ఏజన్సీలు కూడా కృషి చేస్తు న్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా గుహ అంతా నీటితో నిండిపోవడంతో పాటు , చిక్కుపడిన చిన్నారుల్లో ఎవరికీ ఈత రాకపోవడం, వీరు ఉన్న ప్రాంతం గుహ ముఖద్వారానికి నాలుగు కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండడం, గుహలోపలి మార్గం కూడా ఇరుకుగా, చాలా ప్రమాదకరంగా ఉండడంతో వీరిని బయటికి తీసుకు రావడం అత్యంత సంక్లిష్టంగా మారింది. అయితే రాబోయే రోజుల్లో గుహ ప్రాంతంలో మరోసారి భారీ వర్షాలు కురవవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలో ప్రమాదకరమని తెలిసినప్పటికీ చిన్నారులను కాపాడే చర్యలను ఆదివారం ముమ్మరం చేశారు. వాతావరణం కూడా కాస్త తెరపినివ్వడం అనుకూలించింది. ఫలితంగా ఆదివారం నాడు ఆరుగురు చిన్నారులను గుహలోంచి బయటికి తీసుకు వచ్చారు. దీంతో మిగతా వారిని కూడా సురక్షితంగా తీసుకు వస్తారన్న ఆశలు చిగురించాయి.‘ఆరుగురు బాలురు బయటికి వచ్చారు. ప్రస్తుతం వారికి వైద్య సేవలు అందించడానికి గుహ వద్ద ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆప్పత్రికి తరలించాం’ అని చియాంగ్ రే హెల్త్ డిపార్ట్ మెంట్ చీఫ్ బూనతోంగ్ తెలిపారు. ఆరుగురు బైటికి వచ్చిన విషయాన్ని రక్షణ శాఖకు చెందిన పేరు వెల్లడించని ఓ అధికారికూడా ధ్రువీకరించారు. చీకటి పడడానికి గంట ముందు ఇద్దరు బాలురు మొదట గుహలోంచి బయటికి వచ్చారు. అ తర్వాత కొద్ది సేపటికి మరో నలుగురు కూడా బైటికి రావడంతో వందల సంఖ్యలో గుహవద్ద వేచి ఉన్న దేశ విదేశీ మీడియా ప్రతినిధులు, అధికారులు, సహాయక బృందాల సంంతోషానికి పట్టపగ్గాలు లేక పోయాయి.
భారీ ఆపరేషన్ : గుహలోపల వరదనీరు పెరుగుతుండడంతో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయన్న భయాల కారణంగా ఈ చిన్నారులను ఎలాగైనా కాపాడడానికి గత రెండు మూడు రోజులుగా సహాయక చర్యలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. గుహలోపల అంతా చీకటిగా ఉండడంతో బాలురు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి గుహకు వందకు పైగా రంధ్రాలు పెట్టారు. అయితే 400 మీటర్లు తవ్వినప్పటికీ చిన్నారుల జాడ తెలియక పోవడంతో అందరిలోను అందోళన మొదలైంది. దీంతో ఆదివారం ప్రమాదకరమని తెలిసినప్పటికీ వారిని బయటికి తీసుకు వచ్చేందుకు గట్టి ప్రయత్నం మొదలు పెట్టారు.
‘ ఈ రోజు మాకు చివరి రోజు. బాలురు ఎలాంటి చాలెంజ్‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు’ అని ఆదివారం ఉదయం గుహ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ రెస్కూబృందం చీఫ్ నరోంగ్‌సక్ ఒసట్టనకోర్న్ చెప్పారు. 13 మంది విదేశీ డైవర్లు, అయిదుగురు థాయిలాండ్ నేవీకి చెందిన గజ ఈతగాళ్లు ఈ రెస్కూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. చీకటి పడే సమయానికి ఆరుగురు చిన్నారులు అత్యంత క్లిఫ్టమైన ఇరుకైన మార్గం గుండా నాలుగు కిలోమీటర్లు నడిచి గుహ బైటికి వచ్చారు. ఈ ఆరుగురు మొదటి బృందంలోని సభ్యులని, మిగతా వారు కూడా తాము చిక్కుబడిన చాంబర్‌నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించారని రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న మరో అధికారి చెప్పారు. ఆపరేషన్ పూర్తి కావడానికి చాలా రోజులు పట్టవచ్చని ఆదివారం ఉదయం కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇంత త్వరగా ఆరుగురు చిన్నారులు బైటపడ్డం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మిగతా వారిని కూడా రెండు మూడు రోజుల్లోనూ బయిటికి తీసుకు వస్తామన్న నమ్మకాన్ని రెస్కూ ఆపరేషన్‌లో పాల్గొన్న వారు వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం తిరిగి రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తామని వారు చెప్పారు. ఈ చిన్నారులు తమగురించి ఆందోళన చెందవద్దంటూ తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు రాసిన లేఖలను శనివారం థాయిలాండ్ నేవీ ప్రత్యేక బృందం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. వీటిని చూసిన ఎంతటివారికైనా కళ్లు చెమర్చక మానవనడంలో అతిశయోక్తి లేదు.