Home ఎడిటోరియల్ సంచారుల విముక్తి దిశగా…

సంచారుల విముక్తి దిశగా…

ed

వీళ్లు తరతరాల సాంస్కృతిక సందుక / చరిత్రను పుక్కిట్లో దాచిన సంచార కంఠమది/చేతిలో కర్ర, జబ్బకు సంచి / నెత్తిన గంపే సకల సంపదల గుమ్మి /సంకల బిడ్డ నెత్తిన మూట/మట్టిని పునీతం చేస్తున్న ఆ తల్లుల అడుగులే / ముల్లోకాలు, ముక్కాలాలు/సంచారమే కదా కొత్త ప్రపం చం /వీళ్లే మూలవాసులు, ఆదివాసులు /నదులు దాటిన దేహాలు/అడవుల పైన పాదముద్రలు/వీళ్లు సంచారులు, నీటిసంచారులు /భూసంచారులు, జ్ఞానసంచారులు/ సంచారం కొలంబస్ అయితేనే/ కొత్త ప్రపంచం కనిపెట్టబడుతుంది /సంచారం ఒక విశ్వజ్ఞానవీధి / వాళ్ల రాగిముద్దలే జ్ఞానముద్దలు /సృష్టి రహస్యాలను/ చిన్న పటంలో పెట్టుకుని వాళ్లు వూరూరా తిరిగి/చైతన్యానికి పురుడు పోస్తారు /దశావతారాలు వాడి పంటలోనే నిక్షిప్తం /వాళ్ల రుంజ మీది కొలిమి రాజుకుని/కుంపట్ల సంగీత మంటలు లేస్తాయి.
తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత అన్ని రంగాలలో పునర్నిర్మాణం జరుగుతున్నట్లుగానే బహుజన బతుకుల పునర్నిర్మాణం మొదలయ్యింది. ఇందులో భాగంగా సమగ్రంగా బిసిల జీవన విధానంపై అధ్యయనం చేయటానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిసి కమిషన్‌ను నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సూత్రాలను అమలు చేసే దిశగానే అధ్యయనం కొనసాగించాలని, సమాజంలో సగభాగమైన బిసిల బతుకు చిత్రం మార్చటానికి అధ్యయనమే తొలిపునాది అని ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ కమిషన్ నియామకం తర్వాత సుదర్ఘీంగా ఐదుసార్లు సమావేశాలు జరిపి కమిషన్‌కు దిశానిర్దేశం చేయటం జరిగింది. బిసి(ఇ) గ్రూపులోని ముస్లిం జీవన విధానాన్ని అధ్యయనం చేయాల్సిందిగా బిసి కమిషన్‌ను ఆదేశించారు. ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందివ్వగానే ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను సిఫారసు చేస్తూ అసెంబ్లీ తీర్మానించి కేంద్రానికి పంపడం జరిగింది. అదే రోజు ఎస్‌టిలకు 6నుంచి 10శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ చేత తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించటం జరిగింది.
బిసిల జీవన విధానం అధ్యయనంలో భాగంగా అన్ని కోణాల నుంచి కమిషన్ నిరంతరం కృషిచేస్తూనే ఉంది. ప్రధానంగా బిసిలలోని సంచారజాతులపై ప్రత్యేక దృష్టిని పెట్టి అధ్యయనం కొనసాగించటం జరిగింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు బిసిలకు సంబంధించి, సంచారజాతులకు సంబంధించిన విషయాలను దినపత్రికల్లో వ్యాసాలుగా రాయటం జరిగింది. అందులో భాగంగా బిసిలలో అట్టడుగున వున్న వారి జీవితాలను తెలుసుకునే అవకాశం కలిగింది. ఇలా రాసిన వ్యాసాలన్నింటిని ఒక దగ్గరకు తెచ్చి “బిసి కులాలు, సంచారజాతులు” అన్న ఒక పుస్తకం అచ్చువేశారు. ఈ పుస్తకాన్ని రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్, జర్నలిస్టు మిత్రులు సిఎం సిఆర్‌ఒలు జ్వాలా నర్సింహారావు, గరిక విజయ్‌కుమార్‌లతో కలిసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రగతిభవన్‌లో ఆవిష్కరించటం జరిగింది. ఆ పుస్తకావిష్కరణ సందర్భంగా కనీసం కులసర్టిఫికేట్లకు నోచుకోకుండా ఉన్న సంచాజాతులను బిసి కులా ల్లో చేర్చాల్చి వుంది. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు కనీసం కుల సర్టిఫికేట్లు కూడా లేవు. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకవస్తున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చెప్పటం జరిగింది.
ఆయన వెంటనే స్పందించిన తీరుతో అది సంచారజాతులకు విముక్తదినంగా మారింది. 70 ఏళ్ల పాలకులు చేయలేని పనిని ఆయన చేసేశారు. పక్కన్నే ఉన్న రాజ్యసభ సభ్యులు కె.కేశవరావుకు ఈ విషయం క్షుణ్ణంగా పరిశీలించమని కోరారు. సంచారజాతులను బిసి కులాల్లో కలిపే విషయంపై చీఫ్ సెక్రటరీ బాధ్యతలు తీసుకోవలసిందిగా పని మొదలు పెట్టవలసిందిగా చెప్పారు. ముఖ్యమంత్రి అంతరంగాన్ని విప్పి మాట్లాడిన ఆ సందర్భం మొత్తం సంచారజాతుల బాధలకు విముక్తి కల్గించినట్లయ్యింది. ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఈ ప్రకటన మరువలేనిది చారిత్రాత్మకమైనది. కెసిఆర్ ఏ విషయాన్నయినా లోతుగా అధ్యయనం చేయటం, దాని లోతుపాతులను అంచనావేసి అడుగులు వేయటం చేస్తారు. అది ఉద్యమకాలం నుంచి ఆయన్ను దగ్గరగా చూసిన వాళ్లకు బాగా తెలుసు. ఒక విషయాన్ని తెలుసుకోవటానికి పుస్తక పఠనం ఉండాలి. క్షేత్రస్థాయి అధ్యయన అనుభవం ఉండాలి. ఈ రెండూ కెసిఆర్‌లో ఉన్నాయి.
బిసి కులాల్లో చేర్చాల్సిన వారి కులాల పట్టికను ఇవ్వగానే ఆ కాగితం చూసి వీళ్లంతా సంచారజాతుల వాళ్లే అన్నారు. పఠనం, అవగాహన, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి సంచారజాతులను బిసి కులాలలో చేర్చే విషయాన్ని అధ్యయనం చేసే విషయానికి ఆదేశించటం తరతరాల అణచివేత కులాలకు అది విముక్త దినంగానే నిలిచిపోతుంది. ఇప్పటి వరకు బిసి కమిషన్ దృష్టికి వచ్చినవి, అలాగే సంబంధిత కులాల వాళ్ళు నివేదించుకున్న సమాచారాన్ని బట్టి గుర్తింపుకు నోచుకోని సంచారకులాలు, తక్కువ జనాభా కలిగిన ఇతర కులాలను బిసి కులాలలో చేర్చవలసి ఉంది. ఇందుకు క్షేత్రస్థాయిలో తిరిగి మరింత అధ్యయనం చేయవలసి ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఏర్పడిన అనంతరామన్ కమిషన్ దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకు ఈ సంచారజాతులను గుర్తించక పోవటం జరిగింది. ఇది చాలా బాధాకరమైనది. రాష్ట్ర అవతరణ తర్వాత తొలిసారిగా ఏర్పడిన బిసి కమిషన్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంచారజాతులపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి సంచారజాతులపై ఇంతలోతుగా మాట్లాడలేదు. ఆగష్టు 15న జెండా ఎగురవేసి రాష్ట్ర పురోభివృద్ధిపై సి.ఎం. కెసిఆర్ మాట్లాడుతున్న ప్రతిసారీ బిసి, ఎంబిసిలతోపాటుగా సంచారజాతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా పేర్కొన్నారు. అందుకు సంబంధించి వారికి ప్రత్యేకంగా నిధులు అందించాలని అధికారులకు సూచించారు.
గుర్తింపుకు నోచుకోని సంచారకులాలివే:
1.కాకిపడగట, 2.మందెచ్చుల, 3.సన్నాయోల్లు, బత్తిన, 4. కుల్లకడగి, 5.బైలుకమ్మర, 6.బాగోతుల, 7.బొప్పల, తోలుబొమ్మలాట వాళ్లు, 8. శ్రీ క్షత్రియ రామబోగి, 9. గౌడజెట్టి, 10. గుర్రపువారు, 11. అద్దపువారు, 12. కడారి సైదరోల్లు, 13. సరగాని, 14. ఓడ్, 15. మాసమయ్యలు, పటంవారు, గంజికూటివారు, 16.సాధనా శూరులు, 17. రుంజు, 18.పనస, 19.పెక్కర, 20. పాండవుల వారు, 21. ఆదికొడుకులు, 22. తెరచీరలు
తక్కువ జనాభా కలిగిన ఇతర కులాలు:
1.సారోళ్లు, 2. అరవకోమటి, 3.అహీరయాదవ్, 4.గొవిలి.
సంచారజాతులుగావున్న సంచార, అర్థసంచార, భిక్షాటన, విముక్త కులాలకు సంబంధించిన విషయాలపై కమిషన్ అధ్యయనం కొనసాగించింది. ప్రధానంగా ఈ సంచారజాతులకు రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతతో తీసుకున్న నిర్ణయం వల్ల త్వరలో ఇవి విముక్త జాతులు కాబోతున్నాయి. ఇది మొత్తం సంచారజాతుల ప్రపంచం పరవశం చెందుతుంది. మాకు విముక్తి కలిగించి, మా పిల్లలకు విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన మా జాతులకు మరువరాని మనిషి అని సంచారజాతుల పెద్దలు అభివర్ణిస్తున్నారు. ఆయన మా జాతులకు ప్రభుత్వపరంగా చేస్తున్న సేవలను మా మనసుల నుంచి చెరిగిపోదని కెసిఆర్‌ను దీవిస్తున్నారు.
సంచారజాతుల వాళ్లు ఇప్పటిదాకా అనుభవించిన బాధలు అలవికానివి. వీళ్లది ఏ కులమో బిసి కులపట్టికలో లేకపోవటంతో ఏ రెవిన్యూ అధికారి వీళ్లకు కుల సర్టిఫికేట్లు ఇచ్చేవారు కాదు. ఎంఆర్‌ఒల దగ్గరకు పోతే కులపట్టికలో మీ పేరు లేదనేవారు. బళ్లల్లో, హాస్టళ్లల్లో చేర్చుకునేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. వీళ్లకు రుణాలు పొందే సౌకర్యాలలో అవకాశాలు ఉండేవి కావు. విద్య, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు వీటన్నింటిని నుంచి విముక్తి కలగబోతుంది.
సంచారజాతుల వాళ్ల పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఈ విశ్వమంతా తిరిగి వచ్చే జ్ఞానులుగా వర్ధిల్లాలి. పటం కథలు చెప్పుకుంటూ తిరిగే వారి పిల్లలు ఖగోళ శాస్త్ర రంగంలోకి అడుగులు మోపాలి. తరతరాలుగా మన చారిత్రక సాంస్కృతిక, సామాజిక చరిత్రను మోస్తున్న, గానం చేస్తున్న సంచారజాతుల భవిష్యత్తును కెసిఆర్ తన భుజస్కంధాలపై వేసుకుని వాళ్ల విముక్తికి చారిత్రక సంతకం చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందంటే సంచారజాతుల బహుజనానికి విముక్తి లభిస్తుందన్నది ఆచరణలో నిజం అవుతుంది.

జూలూరు గౌరీశంకర్
(తెలంగాణ రాష్ట్ర బిసి
కమిషన్ సభ్యులు)