Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

చిత్తశుద్ధి గల నటి, నిర్మాత

Laxmi-Rajyam

రంగస్థల నటిగా, గాయనిగా బాల్యం నుంచే గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీరాజ్యం శ్రీకృష్ణతులాభారం చిత్రంలో నళిని పాత్ర పోషించడంతో సినీ జీవితం ప్రారంభమైంది 1953లో. క్రమంగా కథానాయికగా, ద్వితీయ కథానాయికగాను నటించి, నిర్మాతగాను రంగ ప్రవేశం చేసి హరిశ్చంద్ర, నర్తనశాల వంటి చక్కని చిత్రాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుంది. కేరక్టర్ ఆర్టిస్టుగానూ రాణించింది. స్నేహితురాలైన కాంచనమాల మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఆమెను ఆరోగ్యవంతురాలు చేయడానికి, తిరిగి సినిమాల్లో నటింపజేయడానికి కృషిచేసింది. ఈ విషయంలో మాత్రం లక్ష్మీరాజ్యంకి నిరాశ ఎదురైంది.
కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల సమీపంలోని అవుకు గ్రామంలో లక్ష్మీరాజ్యం జన్మించింది 1922లో. ఆమె బాబాయి నరసింహంకి సంగీతంలో ప్రవేశం వుండడంతో ఆయన చేసే సంగీత సాధన కారణంగా చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. ఆమె మేనమావ కె.వెంకట్రామయ్యకు నాటకాలంటే ఇష్టం. నాటక ప్రదర్శనలు నిర్వహించే సంస్థలకు ఆర్థికంగా సహాయం చేసేవారు. మేనమావతో నాటకాలు చూడటానికి వెడుతూ రంగస్థల నటన మీద కూడా లక్ష్మీరాజ్యం మక్కువ పెంచుకుంది. మేనకోడలి ఆసక్తిని కాదనలేక తనకి బాగా పరిచయం వున్న రంగస్థల నటుడు పువ్వుల సూరిబాబుకి చెప్పి నటించే అవకాశాలు కల్పించాడు. సూరిబాబు బృందంతో కలిసి వివిధచోట్ల నాటక ప్రదర్శనలు ఇస్తుండేది. ఈ క్రమంలో పులిపాటి నాటక కంపెనీ వారి నాటకాల్లోనూ అవకాశాలు దక్కాయి. లక్ష్మీరాజ్యం పాడిన పాటలు, పదాలు సీతాకల్యాణం, శ్రీకృష్ణలీలలు వగైరా పేర్లతో గ్రాంఫోన్ రికార్డులుగా వెలువడి ప్రసిద్ధి చెందాయి. హాస్యగీతాలు, జానపద గీతాలు చక్కగా పాడుతుండటంతో అవికూడా రికార్డులుగా విడుదలయ్యాయి. మేనమావ బెంగుళూరు తీసుకెళ్లి రికార్డు చేయించేవారు.

కొత్త నటీనటులను పరిచయం చేసే సి.పుల్లయ్యతో కాళీఫిలింస్ వారి కోసం కలకత్తాలో శ్రీకృష్ణ తులాభారం చిత్రం తీయమని తన నాటక కంపెనీతో కొచ్చెకోట రంగారావు రాగా ఋష్యేంద్రమణిని సత్యభామగా ఎంపిక చేసి లక్ష్మీరాజ్యం నళినిగా, కాంచనమాలను మిత్రవిందగా, రేలంగిని వసుదేవుడుగా తొలిసారి సినీరంగానికి నటీనటులుగా పరిచయం చేశారు. 1935 ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదలైంది. ద్వితీయ చిత్రంగా వేల్ పిక్చర్స్ వారి శ్రీకృష్ణలీలలు చిత్రంలో రాధగా నటించింది. చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో పి.వి.దాసు నిర్మించిన ఈ చిత్రంలో వేమూరి గగ్గయ్య కంసుడుగా, రామ తిలకం యశోదగా, శ్రీరంజని దేవకీదేవిగా మాస్టర్ రాజేశ్వరరావు (తర్వాతకాలంలో ప్రముఖ సంగీతదర్శకుడుగా రాణించిన సాలూరు రాజేశ్వరరావు ) కృష్ణుడుగా నటించారు. ఈ చిత్రం 1935 జులై 1న విడుదలైంది. ఆ తరువాత వేల్ పిక్చర్స్ పతాకాన తీసిన మాయబజార్ అనే శశిరేఖాపరిణయంలో సత్యభామగా నటించింది.

ఆరోరా ఫిలింస్ పతాకాన దాసరి కోటిరత్నం నిర్మాతగా రూపొందించి 1939లో విడుదల చేసిన అమ్మ చిత్రంలో ద్వితీయ కథానాయికగా నటించింది. అమంచర్ల గోపాలరావు దర్శకత్వంలో బందా కనకలింగేశ్వరరావుకు నాయికగా కాలచక్రంలో నటించింది. ఈ చిత్రంలో సూరిబాబు కూడా నటించారు. తరువాత గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో ఇందిరా పతాకాన రూపొందిన ఇల్లాలు చిత్రంలో లక్ష్మీరాజ్యం, కాంచనమాల ఇద్దరినీ ఎంపిక చేశారు ఉమా మహేశ్వరరావు హీరో. లక్ష్మీరాజ్యంకి ఇచ్చిన పాత్ర తాను చేస్తానని కాంచనమాల అడగడంతో స్నేహితురాలి కోరికను లక్ష్మీరాజ్యం మన్నించడం, అందాల నటి అనే ఆలోచనతో రామబ్రహ్మం అంగీకరించడం జరిగింది. ఇల్లాలు చిత్రంలో నటించే వరకు తెనాలి, విజయనాథ్‌లతో వుంటూ నాటక ప్రదర్శనలలో కూడా పాల్గొనే లక్ష్మీరాజ్యం మద్రాసులో స్థిరపడే నిర్ణయం తీసుకుంది. 1940లో ఇల్లాలు విడుదలైంది. ఈ చిత్రంలో ఉమామహేశ్వరరావు హీరోగా చిన్నతనంలో జరిగిన పెళ్లిని మర్చిపోయి మరొక యువతిని పెళ్లాడినవాడిగా నటించాడు మొదటిభార్యగా కాంచనమాల. రెండవ భార్యగా లక్ష్మీరాజ్యం నటించారు.

గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో ఉమామహేశ్వరరావు హీఓగా తయారైన పంతులమ్మ చిత్రంలో నాయికగా టైటిల్ పాత్ర పోషించింది. ఈ చిత్రం 1943లో విడుదలైంది. గూడవల్లి దర్శకత్వంలో కె.ఎస్. ప్రకాశరావు హీరోగా, లక్ష్మీరాజ్యం హీరోయిన్‌గా రూపొందిన అపవాదు 1942లో విడుదలైంది. మీర్జాపురం రాజాశోభనాభల పతాకాన చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో జంధ్యాల గౌరీనాథశాస్త్రి భీష్ముడుగా టైటిల్ పాత్ర పోషించగా లక్ష్మీరాజ్యంని గంగ పాత్రలో నటింపజేశారు. ఈ చిత్రం 1945లో విడుదలై విజయం సాధించింది. కోన ప్రభాకరరావు హీరోగా నటిస్తూ నిర్మించిన మంగళసూత్రం చిత్రంలో ఆయన సరసన నాయికగా నటించింది. సి.పుల్లయ్య దర్శకత్వంలో పి.సూరిబాబు, లక్ష్మీరాజ్యం హీరోహీరోయిన్లుగా రూపొందిన నారద నారది నటిగా సూర్యకాంతంకి కూడా పేరుతెచ్చింది. ఈ రెండు చిత్రాలు 1946లో విడుదలయ్యాయి. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో కె.ఎస్. ప్రకాశరావు హీరోగా నటిస్తూ నిర్మించిన ద్రోహి చిత్రంలో జి.వరలక్ష్మి అహంకారపూరిత నాయికగా నటించగా మంచిదనం మూర్తీభవించిన సీతగా హీరోకి డాక్టర్ వృత్తిలో సాయపడే యువతిగా లక్ష్మీరాజ్యం నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఎన్.టి.రామారావు భార్యగా మంజుల పాత్రలో పిల్లలను కష్టపడి పెంచిన దానిగా ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన సంసారంలో నటించింది.

చిత్ర నిర్మాతగా ప్రస్థానం
రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేసే శ్రీధరరావుతో లక్ష్మీరాజ్యం వివాహం 1941లో జరిగింది. భర్తతో కలిసి రాజ్యం పిక్చర్స్ నిర్మాణ సంస్థను నెలకొల్పింది. తొలిచిత్రంగా రంగనాథ్ దాస్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ హీరోగా తాను టైటిల్ పాత్ర ధరిస్తూ ‘దాసి’ చిత్రంలో నటించింది. నిర్మాతగా శ్రీధర్‌రావు పేరు వుంటుంది. ఎస్.వి.రంగారావు ఇంట్లో పని మనిషిగా చేసే భార్యను చూస్తూ ‘మారాజుల చాకిరి చేసే దొరసానీ వచ్చావా…. అనే పాటలో ఎన్.టి.ఆర్‌తో చక్కని హావభావాలు పలికించింది. ఎస్.వి.రంగారావు హరిశ్చంద్రుడుగా, లక్ష్మీరాజ్యం చంద్రమతిగా, గుమ్మడి విశ్వామిత్రుడుగా మాస్టర్ గిరి లోహితాస్యుడుగా రేలంగి నక్షత్రకుడుగా నటించగా జంపన చంద్రశేఖర్‌రావు దర్శకత్వంలో ద్వితీయ చిత్రంగా హరిశ్చంద్రని రాజ్యం పిక్చర్స్ పతాకాన నిర్మించారు. ఈ చిత్రం 1956 మే 31న విడుదలై ఘన విజయం సాధించి నిర్మాతలకు పేరు ప్రతిష్ఠలు తెచ్చింది.

తరువాత సి.పుల్లయ్య దర్శకత్వంలో కృష్ణలీలలు చిత్రం ప్లాన్ చేశారు. తను ద్వితీయ చిత్రంగా నటించిన కృష్ణలీలలు చిత్రంలోని కొన్ని పాటలు, పద్యాలు ఈ చిత్రంలో పెట్టాలని దర్శకుడిని రాజ్యం కోరడంతో అలా చేయడం ఇష్టంలేని సి.పుల్లయ్య కండువా దులుపుకుని వెళ్లిపోయారు. అప్పుడు హరిశ్చంద్రకి దర్శకత్వం వహించిన జంటన దర్శకత్వంలో కృష్ణలీలలు తీశారు. లక్ష్మీరాజ్యం యశోదగా, ఎస్.వి.ఆర్, కంసుడుగా , బేబి ఉమ శ్రీకృష్ణుడుగా, గుమ్మడి వసుదేవుడుగా నటించారు. సుసర్ణ దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం చేసిన ఈ చిత్రంలోని పాటలు, పద్యాలు ఆకట్టుకున్నాయి. 1759లో ఈ చిత్రం విడుదలైంది.

ఖ్యాతి తెచ్చిన నర్తనశాల
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రాజ్యం పిక్చర్స్ పతాకాన తృతీయ చిత్రంగా నర్తనశాల నిర్మించారు. సముద్రాల మాటలు, సుసర్ణ దక్షిణామూర్తి సంగీతం, ఎం.ఎ.రెహమాన్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ లయ్యాయి. ఎన్.టి.రామారావు అర్జునుడు, బ్రహ్మన్నల పాత్రలలో, సావిత్రి ద్రౌపదిగా, ఎస్.వి.రంగారావు కీచకుడుగా, ధూళిపాళ దుర్యోధనుడుగా, శోభ న్‌బాబు అభిమన్యుడుగా, ఎల్. విజయలక్ష్మి ఉత్తరగా లక్ష్మీరాజ్యం సుభద్రగా నటించారు. 1963లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే గాక జాతీయస్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ని దక్కించుకుంది. జకర్తాలో జరిగిన ఆసియా, ఆఫ్రికా ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది. నిర్మాతలతో బాటు ఎస్.వి.ఆర్, సావిత్రి, రేలంగి ప్రభృతులు హాజరయ్యారు. ఫెస్టివల్ నిర్వాహకులు, న్యాయమూర్తులకు చిత్రం ఎంతగానో నచ్చింది. కీచకుడుగా నటించిన ఎస్.వి.రంగారావుని అభినందించమే కాక ప్రథమ బహుమతి ఇచ్చారు. కళాదర్శకత్వం వహించిన టివిఎస్ శర్మకు ప్రథమ బహుమతి ఇచ్చి గౌరవించారు.

అక్కినేని నాగేశ్వరరావు, భారతి, రాజశ్రీలతో సి.ఎస్.రావు దర్శకత్వంలో గోవుల గోపన్నను నిర్మించారు. ఈ చిత్రం కూడా చక్కని విజయం సాధించింది. ఆ తరువాత ఎన్.టి.రామారావు, మంజుల హీరో హీరోయిన్లుగా ఎస్.డి.లాల్ దర్శకత్వంలో మగాడు నిర్మించారు. ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి ప్రభృతులతో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో శకుంతల చిత్రాన్ని నిర్మించారు. 1966లో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించలేదు. అక్కినేని, కాంచన హీరో హీరోయిన్లుగా సి.ఎస్.రావు దర్శకత్వంలో రంగేళి రాజా చిత్రాన్ని నిర్మించి 1971లో విడుదల చేశారు. తెనాలిలో రాజ్యం థియేటర్‌ని నిర్మించి ఆ పట్టణం మీద, వున్న అభిమా నాన్ని చాటుకున్నారు. మర్యాద మన్నన తెలిసిన నటిగా లక్ష్మీరాజ్యంకి మంచి పేరు వుండేది. చిత్తశుద్ధి వున్న నటిగా, నిర్మాతగా గుర్తింపును పొందింది. లక్ష్మీరాజ్యం నటించిన చిత్రాలను చూసిన శ్రీశ్రీ ఒక పత్రికలో ‘ఎవరా లక్ష్మీరాజ్యం ఎందుకా నటనలో చిత్తశుద్ధి’ అని అభినందించడం విశేషం.

కె.బి.తిలక్ దర్శకత్వంలో జమున, జగ్గయ్య ప్రభృతులతో ముద్దు బిడ్డ’ చిత్రం ప్లాన్ చేశారు. జి.వరలక్ష్మిని పాత్రకు ఎంపిక చేసి కొంత షూటింగ్ చేశారు. డైలాగ్స్, సీన్స్ మార్చమని, మారిస్తే నటిస్తానని ఆమె అనడంతో ఆమెను తప్పించి లక్ష్మీరాజ్యంని ఆ పాత్రకు ఎంపిక చేశారు. స్వంత కొడుకుని పెంచమని చెబుతూ తోటి కోడలుకు ఇచ్చేసే తల్లి పాత్ర ఆమెది. ఈ చిత్రంలోని జయమంగళ గౌరీదేవి దయ చూడుము చల్లని తల్లి అని కొడుకుని చూస్తూ ఆ పాటలో చక్కని నటన ప్రదర్శించింది. సాంఘిక చిత్రంలోని పాటలో పురాణ అంశాలు జొప్పించేలా రాయించినందుకు కె.బి.తిలక్‌ని, పాట రాసిన ఆరుద్రని ప్రశంసలతో ముంచెత్తింది. చకని సినిమాలను తీయాలని, ఉదాత్తమైన పాత్రలతో మెప్పించాలని మర్యాద, మన్నన, క్రమశిక్షణ పాటించాలని నిరంతరం తలచే లక్ష్మీరాజ్యం 1987 నవంబర్ 25న మృతిచెందింది.

-వి.ఎస్. కేశవరావు,  9989235320

Comments

comments