Home వికారాబాద్ అంగన్ వాడీలో వెలుగులు

అంగన్ వాడీలో వెలుగులు

Light in Anganwadi

అవకతవకలపై తక్షణ స్పందన
ఫిర్యాదులకై హెల్ప్‌లైన్ నెంబరు 15439
మహిళలపై అఘాయిత్యాలు జరిగితే
డయల్ చేయాల్సిన నెంబర్ 181
విజయవంతం అవుతున్న
బాలామృతం, ఆరోగ్యలక్ష్మీ
15 నుంచి 18 లోపు యువతులకు కిషోరశక్తి యోజన పథకం

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా: మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారిపోయాయి. చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. వికలాంగులకూ చేయూతనిస్తున్నారు. వారి వివాహాలకు తగిన ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్ల తీరు ఎంతగానో మెరుగుపడింది. ఒకప్పుడు కేంద్రాలు తెరిచేందుకు కూడా సిబ్బంది ఇష్టపడేవారు కాదు. వారిని పర్యవేక్షించాల్సిన సిడిపివోలు కూడా నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతుండేవారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడా పరిస్థితికి దాదాపు చరమగీతం పాడుతున్నారు. సిడిపివోల, సూపర్‌వైజర్ల ఆట కట్టించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఓ ఆర్గనైజర్‌ను నియమించింది.  రాజకీయ నేపథ్యం గల వారికి నామినేటెడ్ పోస్టు ద్వారా భర్తీ చేశారు. వారు ప్రతి సెంటర్‌లను చుట్టేసి లోటు పాట్లను సరి చేశారు. మాటవినని అధికారులపై ఉన్నతస్థాయిలో ముకుతాడు వేయడంతో కిందిస్థాయి అధికారులు కూడా దారికి వచ్చారు. రెగ్యులర్‌గా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. వికారాబాద్ జిల్లాలో నూటికి 90 శాతం అంగన్వాడీ కేంద్రాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. వార్షిక బడ్జెట్ రూ.25 కోట్లను వెచ్చించి వివిధ పథకాలను అమలు చేస్తున్నారు. జిల్లాలో 1,121 అంగన్వాడీ సెంటర్లు పని చేస్తున్నాయి.  వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మర్పల్లి క్లస్టర్ల పరిధిలో కేంద్రాలు నడుస్తున్నాయి.  జిల్లా వ్యాప్తంగా బాలమృతం పథకం కింద 31,151 మంది చిన్నారులకు ఆహారం అందజేస్తున్నారు. 7 మాసల నుంచి మూడేళ్ల వయసు గల చిన్నారులకు పౌష్టికాహారం ఇస్తున్నారు. 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 16,358 మంది ఉన్నారు. వారిని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. ఆరోగ్యలక్ష్మి కింద 3899 మంది గర్భిణీలు, 3443 మంది బాలింతలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. నిత్యం ప్రతి ఒక్కరికి రూ.24 ఖర్చు పెడుతున్నారు. ప్రతి చిన్నారికి నెలకు 16 గుడ్లు, రెండున్నర కిలోల ఆహార పొట్లాలు ఇస్తున్నారు. అంతేకాకుండా చిన్నారులకు పౌష్టికాహారం ఇచ్చే పొడి అందజేస్తున్నారు. దీన్ని తల్లులు, పిల్లలకు వినియోగిస్తున్నారు.  జిల్లా వ్యాప్తంగా 959 పెద్ద కేంద్రాలు, 138 చిన్న కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే, సూపర్‌వైజర్ల కొరత నెలకొంది. జిల్లా మొత్తానికి 23 మంది సూపర్‌వైజర్లు మాత్రమే పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. 969 మంది టీచర్లు, మరో 900 మంది సహాయకులు పనిచేస్తున్నారు.  పరిగిలో చిల్డ్రన్‌హోమ్ నిర్వహిస్తున్నారు. 10వ తరగతి వరకు విద్యాభ్యాసం అందజేస్తున్నారు. బజారులో వదిలేసిన పసికందులను, ఆనాధ పిల్లలను చేరదీసేందుకు తాండూరులో శిశుగృహ కొనసాగుతున్నది. వారిని పెంచి పెద్ద చేసి ఎవరైనా దత్తత తీసుకునేందుకు వస్తే నిబంధనల ప్రకారం ఇవ్వనున్నారు. లేనిపక్షంలో ఆ చిన్నారుల చదవుల నిమిత్తం పరిగి చిల్డ్రన్‌హోమ్‌కు తరలిస్తారు.
కిషోరశక్తి యోజన
కిషోరశక్తి యోజన పథకం యువతుల ఉపాధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అర్థంతరంగా చదువులు మానేసిన 15 నుంచి 18 ఏళ్ల లోపు యువతులకు శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి కల్పించనున్నారు. త్వరలో తాండూరు, మర్పల్లి పట్టణాలలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. బ్యూటీషియన్, టైలరింగ్ విభాగాలలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి యువతిపై రూ.3 వేలను ఖర్చు చేయనున్నారు. దరఖాస్తు ఇతర వివరాలను వెల్లడిస్తామని జిల్లా అధికారిణి జోత్స వెల్లడించారు.
హెల్ప్‌లైన్
అంగన్వాడీ సెంటర్ల పనితీరు మెరుగ్గా లేకున్నా, చిన్నారులకు పౌష్టికాహరం లభించకున్నా ఎవరైనా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనికోసం 15439 నెంబరుకు డయల్ చేస్తే రాష్ట్ర డైరెక్టరేట్‌కు, ఇతర ఉన్నతాధికారుల వరకు చేరుతుంది. సరకుల సరఫరా సరిగ్గా లేకున్నా ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోనున్నారు. బాధ్యులైన వారిపైనా శాఖపరమైన చర్యలు ఉంటాయి. నాణ్యమైన సరకులు సరఫరా జరిగే విధంగా దృష్టి సారించారు. ప్రతి వ్యవహారం పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటు సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, గృహహింస, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ తదితర సంఘటనలపైనా 181 హెల్స్‌లైన్‌కు సమాచారం చేరవేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కాల్‌ను వెంటనే సమీప పోలీసుస్టేషన్‌కు, సమీప ఆసుప్రతులకు అనుసంధానం చేయనున్నారు. సకాలంలో స్పందించి చర్యలు తీసుకునే విధంగా హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు.
వికలాంగులకు ప్రోత్సాహకాలు
వికలాంగులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అందజేయనున్నది. రూ.లక్ష మ్యారేజ్ ఇన్‌సెంటివ్ ఇవ్వనున్నారు. వికలాంగులైన అమ్మాయిలను వివాహం చేసుకునే (అన్ని అవయవాలు బాగా వున్నవారు) వారికి రూ.లక్ష అందజేయనున్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు  పొందినా లక్ష రూపాయల ఇన్‌సెంటివ్ అందజేస్తామని అధికారులు తెలిపారు. ఇలాంటి పథకం గతంలో ఎన్నడూ లేకపోవడం గమనార్హం. వృద్దాప్య, వికలాంగుల సంరక్షణ బాధ్యతలు కూడా ఈ శాఖకు అప్పగించారు. ఏడు, ఎనిమిదవ తరగతి విద్యార్థుళకు స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నారు. 75 శాతం వైకల్యం ఉన్నవారు సదరమ్ సర్టిఫికేట్లు సమర్పించాలి. ఐదు నుంచి పదవ తరగతి విద్యార్థులకు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వాహనాలు, ట్రైసైకిళ్లు, పరికరాలను అందజేయనున్నారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ట్రైసైకిళుల అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ఉచిత శిక్షణ కూడా ఇప్పించనున్నారు.
బూజు దులిపిన ఆర్గనైజర్లు
యేటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పైగా చిన్నారులకు, బాలింతలు, గర్భిణీలకు చేరాల్సిన పౌష్టికాహారం నల్లబజారుకు తరలిస్తున్నారనే సమాచారం ఉంది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సిఎం కేసీఆర్ సంకల్పించారు. యేటా కోట్లు ఖర్చు చేస్తున్నా సిడిపివోలు, సూపర్‌వైజర్లు, టీచర్లు, ఆయాలు, స్థానిక రాజకీయ నాయకులు సైతం దుర్వినియోగం చేస్తున్నట్లు సిఎం దృష్టికి వచ్చింది. దాంతో రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వారిని నామినేటెడ్ పదవి ద్వారా భర్తీ చేసి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని భావించారు. గతేడాది క్రితమే మహిళా శిశుసంక్షేమశాఖ చైర్‌పర్సన్ పరిధిలో ప్రతి జిల్లాకు ఆర్గనైజర్లను నియమించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆర్గనైజర్‌గా తాండూరుకు చెందిన ఆరూర్ వీరమణి నియామకమైనారు. నెలసరి గౌరవ వేతనం రూ.50 వేలు, రవాణా భత్యం కింద రూ.40 వేలను చెల్లించి ఆర్గనైజర్‌ను నియమించారు. దాంతో వ్యవస్థలో ప్రక్షాళన మొదలైంది. ఆకస్మిక తనిఖీలు చేయడం, సెంటర్ల తీరుపై ఆర్గనైజర్ వీరమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. యేడాది కాలంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని దాదాపు అన్ని కేంద్రాలను రెండేసి దఫాలు పర్యవేక్షించారు. మూతపడిన సెంటర్ల వద్ద ఆమె స్వయంగా వెళ్లి చీపురు పట్టుకుని శుభ్రం చేయడం సీఎం దృష్టికి వెళ్లింది. సిడిపివోల అవినీతికి అడ్డుకట్ట వేయగలిగారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతగా అమలు చేయాలని ఆమె పదేపదే అధికారుల, సిబ్బందిని ఆదేశించారు. ఏళ్ల తరబడిన దుస్థితికి చేరిన ఈ వ్యవస్థ బూజు దులిపారు. నిత్యం ఏదో ఓ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. దాంతో అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అయితే, జిల్లా అధికారి జోత్స సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలోనూ నిజాయితీగా పనిచేశారనే పేరుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆమెను వికారాబాద్‌కు బదిలీ చేశారు. ఇక్కడ కొంతమంది సిడిపివోలు రాజకీయ, కులం రంగు పులుముకుని ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేశారు. అయితే, ఆర్గనైజర్‌గా వీరమణి బాధ్యలు చేపట్టిన తర్వాత ఇలాంటి అధికారుల ఆటకట్టించారు. నేరుగా మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌కే వారి పనితీరు గురించి ఫిర్యాదు చేశారు. దాంతో జిల్లాలో అధికారులు దారికి రావడమే కాకుండా సెంటర్లు మెరుగ్గా పనిచేస్తున్నాయి.