Home లైఫ్ స్టైల్ మనకు ‘బోనం’.. మలయాళీలకు ‘ఓనం’

మనకు ‘బోనం’.. మలయాళీలకు ‘ఓనం’

ప్రత్యేక తెలంగాణ అనంతరం ఇతర దేశాల, రాష్ట్రాల ప్రజల పండుగలను అధికారికంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. అతిథి దేవోభవ అనే పదాన్ని నరనరాన జీర్ణించుకున్న హైదరాబాదు అన్ని ప్రాంతాల ప్రజల సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవిస్తుంది. ఆదరిస్తుంది. దాదాపు 5,6 లక్షల మంది మలయాళీలు తెలంగాణలో నివసిస్తున్నారు. కేరళ తర్వాత రెండవ ఇల్లు హైదరాబాదే అంటారు మలయాళీలు. అంతలా ఇక్కడి జీవనంలో మయేకమయ్యారు. భాషా సాంస్కృతిక శాఖ, కేరళ భారతభవన్, తెలుగు రీజియన్ మలయాళీల అసోసియేషన్, 37 కేరళ సంఘాల ఆధ్వర్యంలో ఓనం వేడుకలు ఘనంగా జరుగుతుంటాయిక్కడ. నగరంలోని రవీంద్రభారతి, శిల్పా రామంలాంటి వేదికలపై ప్రదర్శించే కేరళ సంప్రదాయ నృత్యాలు ఇ క్కడి వారిని ఆకట్టుకుంటాయి. బోనం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే, ఓనం మలయాళీల సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది.

Onam-Celebrations

చరిత్ర ప్రకారం బలిచక్రవర్తి పాలించిన కాలం కేరళకు స్వర్ణయుగం. మహాబలి చేసిన మంచి పనులకు మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న ప్రజలను ఏడాదికి ఒకసారి కలుసుకునేటట్లు విష్ణుమూర్తి అతనికి వరమిచ్చాయి. మహాబలి చక్రవర్తి ఏటా తన ప్రజలను కలుసుకునేందుకు ఆత్మరూపంలో కేరళ వస్తాడని ప్రజల విశ్వాసం. అందుకే అతడిని తమ ఇళ్లలోకి ఆహ్వానించేందుకు ఈ పండుగ జరుపుకుంటారు. ఆతం పేరుతో తొలిరోజు ప్రారంభమయ్యే ఉత్సవాలు పదో రోజున తిరుఓనం తో ఘనంగా ముగుస్తాయి. పదిరోజుల పాటు ఘనంగా జరిగే ఈ పండుగ సంబరాలు మలయాళీల ఆచారాలను, కళలను ప్రతిబింబిస్తాయి. కొత్త దుస్తులు, సంప్రదాయ వంటలు, నృత్యం, సంగీతంతోపాటు రాష్ట్రమంతటా పాటిం చే ఆచారాలు ఈ వ్యవసాయ పండుగకు చిహ్నాలు. ఓనం రోజున మగవారు చొక్కా, లుంగీ కడతారు. ఆడవారు పావడా, రవికె ధరించడం ఆచారం. మహాబలిని ఆహ్వానిస్తూ, ఇంటి ముందర పేడనీళ్లు చల్లి రంగురంగుల పూల తో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దుతారు. వీటిని పూగళమ్ అంటారు. సంప్రదాయ బంగరు అంచు కలిగిన తెల్లని చీరని ధరించి మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. వీరి నృత్యాలలో కైకొట్టికల్, తుంబితుల్లల్ ముఖ్యమైనవి. సంప్ర దాయ పడవ పందాలు, అలాగే బాల్ ఆటలు, విలువిద్యాపోటీలు, కబడ్డీ, కత్తి యుద్ధాలు వంటి ఇతర క్రీడా పోటీల్లో యువకులు తమ శక్తిసామర్థాలను ప్రదర్శిస్తారు. పెద్దవారు సైతం అనేక క్రీడల్లో పాలుపంచుకుంటారు. ఇల్లు సందడిసందడిగా ఉంటుంది. తమ ప్రాంతాన్ని మహాబలి సుభిక్షంగా పరిపాలించినందుకు కృతజ్ఞతగా మలయాళీలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ భక్తిశ్రద్ధలతో ఓనం పండుగను జరుపుకుంటారు. వేడుకల్లో టపాసులు కాల్చి, ఇళ్లను విద్యుద్దీపాలతో అలంకరించుకుంటారు. ఈ వేడుకల్లో కథాకళి నృత్యానిదే అగ్రతాంబూలం. రామాయణ, మహాభారతాల్లోని కొన్ని ఘట్టాలను విధిగా ప్రదర్శిస్తారు. పురాణాలు, చరిత్రపై పిల్లల్లో తగిన అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని మలయాళీల విశ్వాసం.
స్నేక్‌బోట్ ప్రత్యేకత : స్నేక్‌బోట్ రేస్ వేడుకలకు ఆరముల పార్థసారధి దేవాలయంతో దగ్గర సంబం ధాలున్నాయి. పాతరోజుల్లో ఈ ఆలయంలో జరిగే తిరువోనసడయ అంటే ఓనమ్ విందుకు అవసరమైన కూరగాయలు, పప్పు లు, ఇతర ఆహార పదార్థాలను పాము బోట్లలో ఊరేగింపుగా తీసుకొచ్చేవా రు. దాన్ని గుర్తుచేసేందుకు ఆరుములా వల్లంకలిని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఓనం రోజున ఏర్పాటుచేసే స్నేక్ బోట్ రేస్ కేరళలో ప్రధాన ఆకర్షణ. సుమారు వంద అడుగుల పొడవుండే పడవుల్లో దాదాపు 150 మంది యువకులు కూర్చుని ఉత్సాహభరితంగా పోటీల్లో పాల్గొంటారు. 40 కి.మీ. వరకు పడవులు దూసుకుపోతుంటాయి. పాములా మెలికలు తిరిగే ఈ పడవలను వందలాది మంది ఉత్కంఠతో వీక్షిస్తుంటారు. కేరళ రాష్ట్రంలో అలెప్పీ బోట్ రేసులకు పెట్టింది పేరు. రెగ్గట్టా, ఆరుములా వల్లంకలి (స్నేక్ బోట్ రేస్ ) అనేది సంప్రదాయబద్ధంగా జరిగే ఇక్కడి బోట్ కార్నివాల్.
పులివేషాలు : శాస్త్రీయ వాయిద్య పరికరాలను వాయిస్తుండగా పులివేషాలు ధరించిన వారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేయడం మరో ఆకర్షణ. దీనిని కేరళీయు లు పులిక్కలిగా పిలుచుకుంటారు. భారతదేశంలో అతిప్రాచీన వేడుకగా దీనికి పేరుంది. త్రిస్సూర్‌లో ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తూ, పులివేషం ధరించినవారికి బహుమానాలు అందజేస్తుంటారు.
ఊయల : ముఖ్యంగా ఓనం వేడుకల్లో గ్రామీణప్రాంతాల్లో ఊయల ఊగడం కనిపిస్తుంటుంది. యువతీయువకులు ఓనం పాటలు పాడుతూ ఊయల ఊగుతుంటారు. కేరళలోని త్రిక్కకరలోని వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. వారి వారి ఇళ్లలో వామనుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు.
గజరాజుల విన్యాసాలు : పండుగ చివరిరోజున అలంకరింపబడిన గజరాజులతో చేసే విన్యాసాలు చూపరులను అబ్బురపరుస్తాయి.
సామూహిక విందుభోజనాలు : ఓనం పండుగ చివరి రోజున తిరు ఓనం సందర్భంగా పచ్చని అరటి ఆకులో ఇరవై వంటకాలతో, పాయ సంతో కూడిన విందు భోజనాన్ని ఓనం సధ్య అంటారు. దీన్ని సామూహికంగా స్వీకరిస్తారు. సంప్రదాయక ఊరగాయలు, పిండివంటలను చాపపై కూర్చుని అరటి ఆకులో ఈ పదార్థాలను తినడం ఓనం ప్రత్యేకత. ఇందులో అంతా తప్పక పాలుపంచు కోవాలనే ఆచారం ఉంది.