Home తాజా వార్తలు కమిషనరేట్‌కు తొమ్మిది జిల్లాల పంచాయతీ రిజర్వేషన్ల జాబితా

కమిషనరేట్‌కు తొమ్మిది జిల్లాల పంచాయతీ రిజర్వేషన్ల జాబితా

Gram Panchayatనేడు సిఎస్ కార్యాలయానికి, నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్దమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారంనాటికి రిజర్వేషన్ల పర్వాన్ని పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు భావించినా కేవలం తొమ్మిది జిల్లాల రిజర్వేషన్ల జాబితా మాత్రమే అందింది. మిగిలిన ఇరవై ఒక జిల్లాలకు సంబంధించిన సమాచారం సరైన ఫార్మెట్‌లో అందకపోవడంతో సవరించి పంపాల్సిందిగా తిప్పి పంపారు. సోమవారం మధ్యాహ్నంకల్లా అన్ని జిల్లాల రిజర్వేషన్ల జాబితాను సిద్ధంచేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషికి అందజేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాయమత్తమవుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని జిల్లాల నుంచి వీలైనంత త్వరగా జాబితాను తెప్పించి అంతే వేగంతో క్రోడీకరించిన జాబితాను సిద్ధం చేసేలా పంచాయతీరాజ్ సిబ్బందిని ఆ శాఖ ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.

ఆదివారం సెలవుదినమైప్పటికీ ఆ శాఖలోని ఎన్నికల సిబ్బంది ముమ్మరంగా పనిచేశారు. పంచాయతీరాజ్ శాఖలో ఎన్నికల విధులు నిర్వహించే వారికి ఆదివారం కూడా సెలవును రద్దు చేస్తూ మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు. తగినంత సమయం లేనందువల్లనే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను వేగంగా చేయించేలా ఉన్నతాధికారులు హడావిడి పడుతున్నారు. జిల్లాల్లో కూడా ఆ శాఖ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం కమిషనరేట్‌కు వచ్చిన రిజర్వేషన్ల జాబితాలో మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భద్రాద్రి, జగిత్యాల, మహబుబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన పంచాయతీలు, వార్డుల వారీ రిజర్వేషన్ల జాబితాలు కమిషనరేట్‌కు చేరుకున్నాయి. అయితే రిజర్వేషన్ల ఖరారు జాబితా అన్ని జిల్లాల నుంచి ఒకే మాదిరిగా పంపించాలని కోరుతూ ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మాను రూపొందించి జిల్లాలకు పంపించారు.

ఒకే పేజీలో పంచాయతీ, వార్డులకు సంబంధించి అన్ని కేటగిరిల రిజర్వేషన్లు ఉండేలా ఈ ప్రొఫార్మాను రూపొందించారు. అప్పటికే ఆయా జిల్లాల్లో వారికి అర్థమయ్యే రీతిలో రిజర్వేషన్ల జాబితాలు సిద్ధం చేసుకోగా కమిషనరేట్ నుంచి వచ్చిన ప్రొఫార్మా ప్రకారం తిరిగి జాబితా రూపొందించడంలో కొంత జాప్యం జరిగిందని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. అయితే వందశాతం ఎస్‌టిలు ఉన్న పంచాయతీలలో ఎస్‌టి మహిళలు, పురుషుల క్యాటగిరి, నాన్ షెడ్యూల్ ఏరియాలో ఎస్‌టి మహిళలు, పురుషుల క్యాటగిరిలో ఎంపికలో చాలా జిల్లాల్లో తప్పులు దొర్లాయి. వందశాతం గిరిజనులు, ఏజెన్సీ ఏరియాల్లోనూ ఎస్‌టిలకు కేటాయించిన రిజర్వేషన్లను పూర్తి స్థాయి రిజర్వేషన్లలో కలపడం వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో నాన్ షెడ్యూల్ ఏరియాలో కొన్ని కేటగిరిలకు రిజర్వేషన్లనే కేటాయించకుండా నిల్ చూయించారు. వీటిని గుర్తించిన పంచాయతీరాజ్ కమిషనరేట్ అధికారులు వెంటనే ఆయా జిల్లా డిపిఓలతో ఫోన్‌లో మాట్లాడి వివరించి ఆమేరకు కరెక్షన్స్ చేయించి ఫైనల్ జాబితాను సిద్ధం చేయించారు.

మొత్తం మీద వార్డుల వారీగా రిజర్వేషన్ల పూర్తి జాబితా పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు సోమవారం మద్యాహ్నాం వరకే చేరుకుంటుందని పంచాయతీరాజ్ అధికారి ఒకరు తెలిపారు. వాటిని సరిచూసుకుని తప్పులు లేకుండా సరిదిద్ధి సాయంత్రం వరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి అందిస్తామన్నారు. అక్కడి నుంచి రిజర్వేషన్ల జాబితా ఎన్నికల సంఘానికి పంపిస్తారు. రిజర్వేషన్ల జాబితా అందిన వెంటనే తదుపరి ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. రెండు రకాల షెడ్యూళ్లను సిద్ధం చేసి పెట్టుకున్నట్లు సమాచారం. జనవరి నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలా ఈ షెడ్యూళ్లను రూపొందించినట్లు తెలిసింది.

List of 9 Districts Panchayat Reservation to the Commissionerate