Home హైదరాబాద్ ఓటరు జాబితాలో ముందస్తు తనిఖీలు

ఓటరు జాబితాలో ముందస్తు తనిఖీలు

 List of voters in Hyderabad district

ఓటరు మహాశయా…! జాబితాలో మీపేరు ఉందో..లేదో..! చూసుకోండి8నూతన ప్రచారానికి జిహెచ్‌ఎంసి శ్రీకారం
ఆస్తిపన్ను చెల్లింపుదారుల ఫోన్‌లకు సమాచారం
నగరంలో వీరి సంఖ్య 10.36 లక్షలు 8జాబితా ప్రక్షాళనకు ఇంటింటి తనిఖీలు875,654 మంది ఓటర్ల డూప్లికేషన్
2014 నుంచి నేటికి మరణించిన వారు 1.22 లక్షల మంది
చిరునామా మారినవారు 11,974

మన తెలంగాణ/సిటీబ్యూరో
ఓటరు జాబితా లో తమతమ ఓట్లు ఉన్నవా..? లే వా..? అనేది తెలుసుకోండి. మీ ఫోన్‌లకు సంక్షిప్త సమాచారం పంపించాం’ అంటూ జిహెచ్‌ఎంసి నగరంలోని ఓటర్లను చైతన్యం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ముందుగా నగరంలో ప్రస్తుతం ఆస్తిపన్ను చెల్లింపుదారులుగా ఉన్న 10.36 లక్షల మందికి ఈ సమాచారాన్ని జిహెచ్‌ఎంసి చేరవేసింది. అనంతరం నగరంలోని ట్రేడ్ లైసెన్స్‌లు కలిగిన వారికి ఈ విధంగానే సమాచారాన్ని చేరవేసి ఓట్లు లేని వారు నమోదు చేసుకోవడం, చిరునామాలు మారినవారు తిరిగి సరిచేసుకోవడం, పేర్లలోని అక్షరదోషాలను సరిచేసుకునేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి చర్యలు చేపట్టింది. ఈపాటికే ఓటరుగా నమోదైన వారిని అప్రమత్తం చేయడం, ఓటు నమోదు చేయని వారిలో ఓటు హక్కుపై అవగాహన కల్పించడంపై జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలుచేపట్టింది. అందులో భాగంగానే ఓటరు జాబితా ప్రక్షాళనపైదృష్టిసారించింది. ఈ మేరకు మంగళవారం రెవెన్యూ, గ్రేటర్ అధికారులు కలిసి సమావేశమై వాస్తవమైన ఓటరు జాబితాను రూపొందించడంపై సమగ్రంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా 75,654 రెండుమార్లుగా నమోదైన ఓట్లు, 2014 నుంచి ఇప్పటి వరకు మరణించిన 1.22 లక్షల మంది ఓట్లు, 11,974 మంది చిరునామా మారినవారివి క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ వివరాలను ముఖ్యంగా జిహెచ్‌ఎంసి సిబ్బంది, బూత్ స్థాయి అధికారులకు అందజేశారు. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు జిహెచ్‌ఎంసి నుండి 200 మంది, రెవెన్యూ విభాగం నుండి 125 మంది అధికారులు పనిచేయనున్నారు. నగర పరిధిలోని 15 శాసన సభ నియోజకవర్గాల పరిధిలోని 3826 పోలింగ్ కేంద్రాలున్నాయి.
5 బూత్‌లకు ఒక అధికారి : నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిగణలోకి తీసుకున్న జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్ ప్రతి ఐదు పోలింగ్ కేంద్రాలకు ఒక పర్యవేక్షణాధికారిని నియామకం చేశారు. ఓటరు జాబితాపై వస్తున్న దరఖాస్తులను పరిశీలించడం, జాబితాలో దొర్లిన పొరపాట్లు, బదిలీ వంటి విషయాలను సరిచేసేందుకు ఈ పర్యవేక్షణాధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి జాబితాలో నమోదైన వివరాలను ప్రక్షాళన చేయడాన్ని మొదలుపెట్టారు. బూత్‌స్థాయి అధికారులు, పర్యవేక్షణాధికారులు మరణించిన వారి పేర్లను, రెండుమార్లు నమోదై ఉన్నవారి ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియలోనే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదుచేయడం జరుగుతుంది. వీటితో పాటు ప్రతి నియోజకవర్గంలో కనీసం 1000 మంది ప్రముఖుల ఓట్లను ఓటరు జాబితాలో ఉన్నవా..? లేవా..? అనేది కూడా తనిఖీలు చేపట్టనున్నారు.
రంగంలోకి రెవెన్యూ అధికారులు : హైదరాబాద్ జిల్లాలోని ఓటరు జాబితా సవరణను మరింత పకడ్బందీగా చేపట్టడానికి మొట్టమొదటిసారిగా రెవెన్యూ విభాగపు అధికారులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించి బాధ్యతలను అప్పగించింది. రెవెన్యూ అధికారులకు ఓటరు జాబితాను నియోజకవర్గాల వారిగా అందజేసింది. వీరంతా జాబితాలోని ఓటరు ఒకే పోలింగ్ పరిధిలో, నియోజకవర్గంలో, ఇతర జిల్లాల పరిధిలో ఓటరుగా నమోదు అయిన విషయాన్ని తేలికగా గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్థానపు వ్యవస్థను వినియోగించనున్నారు. బహుళ ఓటరుగా నమోదుకాబడిన వారికి తగిన నోటీసులు అందజేసి కోరుకున్న పరిధిలోనే వారికి ఒకే ఓటు ఉండేవిధంగా చర్యలు తీసుకోనున్నారు. రెండుఓట్లున్న వారిని గుర్తించేందుకు ఎన్నికల సంఘం అందించిన ఇఆర్‌ఓ నెట్ 2.5 వ్యవస్థను వినియోగించాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది.
పకడ్బందీగా ప్రక్షాళన : జిహెచ్‌ఎంసి కమిషనర్ దానికిషోర్
హైదరాబాద్ జిల్లాలోని ఓటర్ల జాబితాను మరింత పకడ్బందీగా రూపొందించడానికి ప్రత్యేకంగా నియమించిన 7 మంది డిప్యూటీ కలెక్టర్లు, 15 మంది తహాశీల్దార్లు, 100 మంది విఆర్‌ఓలతో పాటు జిహెచ్‌ఎంసి అధికారులు 200 మంది పనిచేస్తున్నట్టు జిహెచ్‌ఎంసి కమిషనర్, డిఇఓ దానకిషోర్ తెలిపారు. ప్రక్షాళన చేపట్టే అధికారులు జాబితాలోని ఓటరు ఫోటో, పేరు, చిరునామాల్లో తేడాలను గుర్తించడం ద్వారా కచ్చితమైన సమగ్రమైన వివరాలతో కూడిన జాబితా సిద్దమవుతుందని దానకిషోర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ జయరాజ్ కెన్నెడి, జాయింట్ కమిషనర్ పంకజ తదితరులు పాల్గొన్నారు.