Home కలం సాహితీ విమర్శ పరామర్శ

సాహితీ విమర్శ పరామర్శ

Books-Study

చదువుదాం, చదివిద్దాం! రాద్దాం, రాయిద్దాం! ఇదీ రేపటి తరానికి అందాల్సిన నినాదం. కవులకు, రచయితలకు నిత్య నూతన విషయాలు తెలియడం ఎంత అవసరమో, పాత విషయాలు కూడా తెలియడం అంతే అవసరముంది. చరిత్ర, సాహిత్య చరిత్ర తెలిసిన ఒక కవి కలం నుండి జాలువారే ఒక్కో పదం కవితకు అలంకార భరితంగా ఉంటుంది. ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. తెలుసుకోవాలన్న జిజ్ఞాసను పాఠకుడిలో కలిగిస్తుంది. పాతకొత్తల తరాజుల్లో కొలువబడుతున్న బాట్లు కవులైతే, కొలుస్తున్న వస్తువు ‘సంఘం’. ఇంత అంత అని చెప్పలేనంత చైతన్య దీప్తులను ప్రసరించే సాహితీ వేత్తలు కవన కదన రంగంలో విజేతలవ్వాలంటే సాహిత్య విమర్శపై దృష్టి సారించాల్సిందే.
తెలుగు సాహిత్యంలో విమర్శ విపులంగా వచ్చింది కందుకూరి వీరేశలింగం వివేకవర్ధనితో (1876) అనే అభిప్రాయముంది. ‘విగ్రహతంత్ర విమర్శనం’ మొదటి విమర్శ రచనగా పేర్కొంటారు.
ఒక రచనను చదివి బాగుంది అన్నంత మాత్రాన ఆ రచన పూర్తిగా తెలిసినట్లు కాదు. అప్పుడు అందులోని ‘బాగు’ ఏమిటి? బాగా లేదనడానికి కారణాలేమిటి? ఈ కారణాలు చెప్పడం మామూలు మాటల్లో చెప్పడమా? విశిష్టమైన మాటల్లో చెప్పడమా? బాగుంటే, అది ఎక్కడ ఎట్లా బాగుంది, ఎట్లా బహిర్గతం చేస్తుంది? విడదీసి చూపగలమా? పాలలో వెన్నలాగా మొత్తంగా వ్యాపించి ఉందా? సజీవంగా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ చెప్పే సమాధానమే విమర్శ! 19వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్తకొత్త, సాహితీ ప్రక్రియలు ఆవిర్భవించాయి. ప్రాచీన సాహిత్యం ముద్రణకు నోచుకుంది. ముద్రణా సౌకర్యాలు రావడం, పత్రికలు వెలువడడం మరొక పరిణామం. పాశ్చాత్య సాహిత్య పరిచయాలు పరిశోధకులకు, విమర్శకులకు పునాదులయ్యాయి.
కట్టమంచి రామలింగారెడ్డి “కవిత్వతత్వ విచారం” 1914లో రచించారు. ఆధునిక సాహిత్య విమర్శ దీనితోనే ప్రారంభమైందని చాలా మంది అభిప్రాయపడినారు. నిష్పక్షపాతమైన విమర్శ రామలింగారెడ్డి పుస్తకంలో చోటు చేసుకుంది. వీరి వచన, రచన కూడా సూటిగా స్పష్టంగా ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ “విమర్శన పంథాలో గొప్ప దృక్పథం కలిగించి నవ్య సాహిత్యానికి కొత్త బోదెలు తవ్వారు” అని రామలింగారెడ్డి ప్రశంసించారు. ‘నన్నయ గారి ప్రసన్న కథా కవితార్థయుక్తి” “ఒకడు నాచన సోమన” అల్లసానివారి అల్లిక “జిగిబిగి”, శాకుంతలము యొక్క అభిజ్ఞానత” వంటి విశ్వనాథ విమర్శనా గ్రంథాలు వారి ప్రతిభను ప్రదర్శించాయి.
రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, దువ్వూరి రామిరెడ్డి, కట్టమంచి, నోరి నర్సింహ శాస్త్రి, కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకర శాస్త్రి, ఖండవల్లి లక్ష్మీరంజనం, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, దివాకర్ల వెంకటావధాని, కేతవరపు రామకోటి శాస్త్రి, బూర్గుల రామకృష్ణారావు వంటి వారు తెలుగు సాహిత్య విమర్శనా చరిత్రలో మైలురాళ్లు. ఆధునికుల్లో గుంటూరు శేషేంద్ర శర్మ, బుచ్చిబాబు, డా॥ సి.నారాయణ రెడ్డి, కోవెల సంపత్కుమారాచార్య, చేకూరి రామారావు వంటి వారు సుప్రసిద్ధులు.
ఆధునిక విమర్శకుల్లో పాశ్చాత్య రీతులను మేళవించి సాహిత్య విమర్శ చేసిన వారిలో ఆర్.కె. సుందరం ముఖ్యులు. విమర్శలో నిజాయితీ, సహృదయత ముఖ్యమని చెప్పిన వీరి పంథాలోనే విమర్శలు చేసిన జి.వి. సుబ్రహ్మణ్యం సాహితీ విమర్శనా వికాసానికి ఎనలేని కృషి చేశారు. ‘భారతీయత’ ‘దేశీయత’ నేపథ్యంలోనే సాహితీ విమర్శ ఉండాలనీ, విమర్శకుడికి ‘నిబద్ధత’ కంటే పరిస్థితుల ప్రాంత విశిష్టత అవసరమనీ చెప్పారు. జి. నాగయ్య, తూమాటి దోణప్ప, నాయని కృష్ణకుమారి, తిరుమల రామచంద్ర వంటివారు సాహిత్య విమర్శనా వ్యాసాలు ప్రకటించిన వారిలో ప్రముఖులు.
అభ్యుదయ దృకథంలో, మార్కిస్టు అవగాహనతో కొడవటిగంటి కుటుంబరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి, ఎస్వీ సత్యనారాయణ, అద్దేపల్లి రామ్మోహన్ రావు, కె.వి. రమణారెడ్డి వంటి వారు సాహితీ విమర్శను చేపట్టిన వారిలో ముఖ్యులు. అంతేకాదు కాత్యాయినీ విద్మహే, మృణాళిని, కొలుకలూరి ఇనాక్, ఓల్గా, వరవరరావు, అఫ్సర్, ముదిగంటి సుజాతా రెడ్డి మున్నగువారు రాసిన విమర్శలు మౌలికమైన అంశాలపై సాహిత్య చర్చ జరిగేందుకు కారణాలయ్యాయి. అల్లం నారాయణ, జయధీర్ తిరుమల్ రావు, ఏనుగు నర్సింహారెడ్డి, ఎం.నారాయణ శర్మ, కె.శ్రీనివాస్ వంటి ప్రముఖుల సాహితీ విమర్శలు ప్రామాణికతను సంతరించుకున్నాయి.
విమర్శకులు, వ్యవహారిక భాషా ఉద్యమాలను, వాటిపై వచ్చిన పరిశోధనలను ఆకళింపు చేసుకోవాలి. మాండలిక భాషా సోయగాలను తెలుసుకుంటూ, భాష యాసలకు సముచిత స్థానాలిస్తూ పది కాలాల పాటు నిలిచే రచనలను ప్రోత్సహించాలి. అప్పుడే చక్కని, చిక్కని సాహితీ గుభాళింపులు వెల్లివిరుస్తాయి.