Home కలం పల్లెల్లో సాహితీ సేవకుడు కూరెళ్ల

పల్లెల్లో సాహితీ సేవకుడు కూరెళ్ల

KURELLA

పల్లె పట్టులను అక్షరాలకు ఆటపట్టులు చేయాలన్న పోరాటం చేస్తున్న సాహితీ సమర యోధులు, పల్లె సీమల్లో సాహితీ సుగంధాలు వెదజల్లాలని  అనుక్షణం తపించే స్వాప్నికులు  అస్ప్రశ్యతా నివారణ , అక్షరాస్యత, కవిత్వ, తెలంగాణ, గ్రంథాలయ, మొదలగు ఉద్యమాలకు తన కలం ద్వారా బలాన్ని చేకూర్చి ముందుకు  నడిపించిన మహోద్యమ కవితా మూర్తి, 80 ఏళ్ళ వయస్సులో  తనకున్న ఏకైక ఆస్తి సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చి, వేల గ్రంథాలను కూర్చి లోకార్పణం చేసిన త్యాగధనులు,  ఆచార్య కూరెళ్ళ, ఎందరో పరిశోధకులకు విద్యార్థులకు, ఉద్యోగార్థులకు కల్పవృక్షమై నిలుస్తున్న అభినవ పోతన అక్షర కళా  సామ్రాట్ , కవితా శ్రీ, సాహితీ ప్రపూర్ణ, కవి భూషణ, గ్రంథాలయ నిర్మాత డా॥ కూరెళ్ళ విఠలాచార్య” గారితో ఆత్మీయ సంభాషణ.

ప్రశ్న: తెలుగు సారస్వత లోకంలో ఒక రచయిత తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి సమాజానికి అంకితం చేయడం ఇంతకు ముందెన్నడూ లేదు. వెల్లంకి ప్రాత నల్లగొండ ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా మారుమూల పల్లెలో మీరు ఈ కార్యానికి పూనుకోవడానికి ప్రత్యేక కారణం ఏమిటి?
జవాబు: “పల్లియలోనె పుట్టితిని పల్లియ యేనని పెంచె, పల్లియే
ఇల్లును వాకిలిన్ కలిమి నిచ్చె బతుక్కు మెఱంగు పెట్టె, యా
పల్లియె ‘అమ్మ’ ‘ఆవ’నుచు పల్కులు పల్కగ నేరిపించె, నా, పల్లియే నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠ్ఠలేశ్వరా!”
పల్లెను ప్రాణప్రదంగా ప్రేమించేవాణ్ణి. కాబట్టి నా ‘విఠ్ఠలేశ్వర శతకంలో పల్లె గురించి ఇలా చెప్పుకున్నాను. పల్లె పట్టున ఉండి ఎదిగిన వాణ్ణి కనుక నేను పల్లెల్లోనే విజ్ఞాన వీచికలు వెదజల్లాలనేదే నా లక్షం.
ప్రశ్న: మీరు హైదరాబాద్ లాంటి నగరంలో ఉంటే వృత్తి రీత్యా ఎన్నో మంచి అవకాశాలు , ప్రవృత్తి రీత్యా ఎన్నో అవార్డులు అంది పుచ్చుకునే వారు. కాని ఈ మారుమూల పల్లె లో ఉండటానికి గల కారణం?
జవాబు : నా ఉద్దేశంలో తల్లిని, మాతృభాషను, మాతృభూమిని మరచిన వాడు సమాజంలో అపరాధము చేసిన వాడిగా నేను భావిస్తాను. నా జీవితంలో మిక్కిలి దైన్యమయిన జీవితం గడిపిన వాణ్ణి. పల్లె నుండి ఎదిగిన వాణ్ణి. అందుకే పల్లెలోనే జీవించడానికి నేను ఇష్టపడతాను.
ప్రశ్న: సాహిత్య ప్రచారానికి పల్లెను ఎంచుకోవడానికి కారణం?
జవాబు: నిజమైన సాహిత్యం పల్లెల్లోనే దాగి వుంది. ఒక పాటకయినా, కథకయినా, నవల కయినా పల్లె మంచి వస్తువు. ఎందరో కవులు పల్లె నేపథ్యంగా రచనలు చేసి పురస్కారాలు అందుకుంటున్నారు. కాని పల్లెను చిన్న చూపు చూస్తున్నారు. ఇది చాలా బాధాకరం. పల్లెలోని జానపద సాహిత్యం అసలైన సాహిత్యం. పల్లెలో సాహిత్యం అభ్యసించిన వాడిని కనుక పల్లెల్లో సాహిత్యాన్ని వ్యాపింప చేయడమే నా జీవిత లక్షం. ఇప్పటికీ నేను రాసిన ఏ గ్రంథమూ నగరాలలో ఆవిష్కరించుకోలేదు.
ప్రశ్న: పల్లెల్లో విద్యా ప్రచారానికి మీరెన్నుకున్న మార్గమేమిటి?
జవాబు: పల్లెలను సాహిత్య, సాంస్కృతిక, విద్య, ఆధ్యాత్మిక, సామాజికంగా చైతన్య పరచాలి. దీని కోసం ప్రభుత్వం ప్రారంభించక ముందే 1960లో వడాయి గూడెం అనే చిన్న ఊరిలో అక్షరాస్యతా ఉద్యమం ప్రారంభించాను. ఇల్లిల్లూ తిరిగి పెద్దలకు కనీసం సంతకం చేయగలిగే వరకు విద్య నేర్పాను. రాత్రింబగళ్ళూ పెద్దలకు, పిల్లలకు విద్య నేర్పడానికి కృషి చేసాను. పెద్దలను విద్యావంతులను చేయడం వలన పిల్లలను బడికి పంపారు. ఆనాటి యువకుల సహకారంతో బడి కట్టాము. వారికోసం ‘సింగి-సింగడు’ అనే నాటిక రాసాను. సమాజంలో విద్యా ప్రచారం చేయడం కోసం అలాగే నా శిష్యులకు ఉపాధి కల్పించడం కోసం ఎటువంటి లాభాపేక్షలేని విద్యాలయాలు స్థాపించాం. రామన్న పేటలో ఎ.వి.యం హైస్కూలు, వెల్లంకిలో మైత్రీ విద్యాలయం, సిరిపురంలో రామకృష్ణ విద్యాలయం ,చిట్యాలలో శ్రీశ్రీ విద్యాలయం, చౌటుప్పల్‌లో విశాల భారతి ఇంకా విద్యాభారతి, విజ్ఞాన వర్థిని , ఆల్ఫా హై స్కూల్ మొదలయినవి ఈ విద్యాల యాల్లో కొన్ని.
ప్రశ్న: పల్లెల్లో కవితోద్యమం చేసిన వారిగా మీరు పేరుగాంచారు. దీని కోసం మీరు చేసిన ప్రయత్నం ఏమిటి?
జవాబు: ‘ఊరూరికో పోతన’ అనే పేరిట ఉద్యమం నడిపా ను. పల్లెలో ఉండి కవిత్వ సేద్యం చేసి న పోతన నాకు ఆరా ధ్యుడు. అలా గే పల్లెలో ఉన్న సృజన కారు లను ప్రోత్స హించే దిశగా ప్రయ త్నం చేసాను. దీని ద్వారా ఎంతో మంది కవులు వెలుగు లో నికి వచ్చారు. కవులు తాము రాసిన గ్రంథా లు తమ ఊరిలో నే ఆవిష్కరిం చేలా ప్రోత్స హించాను. ఆ కాలం నుండి బాలల చేత కవి త్వం రాయించే వాణ్ణి. వారికోసం ప్రతికలూ నడిపాను. బాపు భార తి, మా తెలుగు తల్లి. వలివెలుగు, మన పురోగమనం, చిరం జీవి, ప్రియం వద, ముచికుంద లేఖిని మొదలయిన పత్రికల ద్వారా బాల బాలికలలో సృజనను వెలికి తీసే ప్రయత్నం చేసాను. భావి భారత పౌరులను తీర్చిదిద్దడానికి నేను ఎంచుకున్న మార్గమిది.
ప్రశ్న: అనేక సాహితీ సంస్థలను స్థాపించారు. అన్నీ పల్లెల్లోనే పురుడు పోసుకున్నాయి కదా!
జవాబు: పల్లెల్లో ఎక్కడ అవకాశం దొరికినా ‘భారతి’ సంస్థలు స్థాపించడానికి పూనుకున్నాను. ‘భారతి’ అంటే సరస్వతి మన దేశం అనే విధంగా ప్రజల్లో దైవభక్తి, దేశభక్తి పాదుకొల్పే ఉద్దేశంతో ఈ పేరు నిర్ణయించాను. యువతలో సృజన శక్తి, రచనాసక్తిని కలిగించడానికి ఈ భారతులు నిర్వహించాను. ఈ పరుగులో నల్లగొండలో ‘మిత్ర భారతి’ భువనగిరిలో ‘భువన భారతి’ మోత్కూరులో ‘ప్రజాభారతి’ చౌటుప్పల్‌లో ‘అక్షర భారతి’, దేవరకొండలో ‘మల్లెల భారతి’, వలిగొండలో ‘కళా భారతి’, నార్కట్‌పల్లిలో ‘జన భారతి’ స్థాపించాను. ప్రత్యేకంగా రామన్నపేటలో ‘బాలభారతి’ స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాను. తద్వారా బాలలలో సృజనను వెలికితీస్తే భావికవులను తయారు చేసుకోగలమని నా అభిప్రాయం.
ప్రశ్న: మీ రచనా వ్యాసంగం ఏఏ ప్రక్రియలలో సాగింది?
జవాబు: పద్యం, వచన కవిత, మినీ కవిత , శతకం, వ్యాసం, నాటికలు, బుర్ర కథలూ రాసాను. అక్షరాస్యతా ఉద్యమంలో ‘మన కథ’ అనే బుర్ర కథ రాసాను. బాల్యంలో నాటకాలలో నటించాను కూడా! నీరు నెములలో భక్త కన్నప్ప పాత్ర పోషించాను. సిరిపురం లంకాదహనం యక్షగానంలో ఆంజనేయుని పాత్ర, ‘గురుదక్షిణ’ నాటకంలో ఏకలవ్యుని పాత్ర పోషించాను.
ప్రశ్న: గ్రంథాలయం స్థాపించాలనే ఆలోచనకు బీజం ఏమిటి?
జవాబు: నేను చిన్నప్పటి నుండి కూడా చదివిన ప్రతి కాగితం, రాసిన ప్రతి కాగితం దాచిపెట్టుకొనే అలవాటు కలిగి ఉన్నాను. మొదట నా యింటిలో నేను గ్రంథాలయం ‘శ్రీలక్ష్మీ గ్రంథాలయం’ ఏర్పాటు చేసుకున్న. నా ఆప్తమిత్రుడు ఆ కెళ్ళ నరసింహమూర్తి గారిచే ప్రారంభించాము. దీనికి ముందే 1954లో నేను ఎనిమిదవ తరగతి చదివే కాలంలోనే మా స్నేహితు లందరినీ కూర్చుకొని ఇల్లిల్లూ తిరిగి గ్రంథాలు సేకరించి ‘శ్రీ శంభు లింగే శ్వర గ్రంథాలయం’ స్థాపించాను. ఆనాటి మా గ్రామ దేశ్‌ముఖ్ శ్రీఅనుముల లక్ష్మీనరసింహారావు గారు ఆ గ్రంథాలయం ప్రారంభించారు. నేను చదువు కునే రోజులలో భువనగిరి గ్రంథాలయం నాకెంతో తోడ్పడింది. పఠనం పట్ల నాకు ప్రత్యేకమైన ఆసక్తి. నేను చదివే రోజుల్లో భోజనానికి కూడా ఇబ్బంది పడ్డాం. పుస్తకాలు కొనే తాహతులేదు. హాస్టల్‌లో ఉండే వాడిని. తెలుగురాని ఉర్దూ వకీళ్ళకు తెలుగు నేర్పుతూ వారిచ్చిన ఫీజులతో చదువుకునే వాణ్ణి. తోటి మిత్రులు, నిద్రపోయిన తరువాత నేను వారి పుస్తకాలతో చదువుకునే వాణ్ణి. వాళ్ళు లేచేసరికి వారి పుస్తకాలు వారికి ఇచ్చేవాణ్ణి ఈ అను భవమే గ్రంథాలయ స్థాపనకు ఊతమైంది. పేద పిల్లలకు పుస్తకాలు కొనలేని లోటు తీర్చడం, విద్యార్థులలో మంచి ఆలోచనలు పెంచడం, యువత పెడదో వ పట్ట కుండా విజ్ఞాన వంతులుగా మార్చడం నా ఆశయం. పల్లెల్లో అన్నీ పుస్తకాలు ఒకచోట దొరకడం దాదాపు అసాధ్యం. అందుకే పల్లెల్లోని విద్యార్థులు, యు వకుల ప్రతిభను వెలికితీయడం కోసమే ఇక్కడ గ్రంథాలయం స్థాపించాను.
ప్రశ్న: ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం ఎప్పుడు స్థాపించారు? దీని నేపథ్యం ఏమిటి?
జవాబు: గ్రంథాలయం 13.02.2014న నాటి జిల్లా కలెక్టర్ శ్రీ.టి. చిరంజీవులు గారి చేతుల మీదుగా ప్రారంభించి సమాజానికి అంకితం చేసాను. మా వివాహ దినోత్సవం సందర్భంగా గ్రంథాలయం ప్రారంభిం చాలనే మా పిల్లల కోరిక మేరకు ఆ రోజున ప్రారంభించాను. అదే రోజు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. గ్రంథాలయ స్థాపన కోసం స్థలం వెతికాను. ఎక్కడా దొరకలేదు. నా ఇంటినే గ్రంథాలయంగా చేసి సమా జానికి ఇవ్వాలనుకున్నాను. సంకల్పబలం ఉన్నప్పుడు ఏదైనా సఫలీకృతమే అవుతుంది కదా!

ఇంటర్వూ : నర్రా ప్రవీణ్ రెడ్డి
8886300550
(నేడు ‘ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం వార్షికోత్సవం)