Home ఆఫ్ బీట్ కాలేయానికీ పొంచి ఉంది ముప్పు..

కాలేయానికీ పొంచి ఉంది ముప్పు..

liver-disease-symptoms

ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అవగాహన సరిగా లేకపోవడంతో వ్యాధి ఎక్కువై ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కాలేయ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ రకాల వ్యాధులు కాలేయాన్ని చుట్టుముడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కాలేయం మారిస్తే తప్ప రోగి బతికే పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రేటర్ పరిధిలో వారంలో నాలుగు నుంచి ఐదు వరకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతుండటం గమనార్హం. సుమారు రెండు వేల మంది వరకు బాధితులు ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.

కాలేయ ఆరోగ్యానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు:
కాలేయ జబ్బులు.. హెపటైటిస్ బి తో పాటు ఆల్కహాల్ కారణంగా, పుట్టుకతో లివర్‌కు వ్యాధులు సోకుతున్నాయి. లివర్ క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్, కొన్ని మందుల్ని అతిగా తీసుకోవడం, అధికబరువు వల్ల ఫ్యాటీలీవర్ లాంటి వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. బై గ్లిజరైడ్ ఫాట్, సిర్రోసిస్ వంటివి సైతం కాలేయాన్ని చుట్టుముడుతున్నట్లు వివరించారు. లివర్ జబ్బులు పురుషుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఆల్కహాల్ ఎక్కువగా తాగడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మొదట్లోనే గుర్తిస్తే..: కాలేయం జబ్బులను ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చునని వైద్యులు తెలిపారు. లివర్ ఫంక్షన్ పరీక్షలు, హెపటైటిస్, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి వ్యాధిని గుర్తిస్తామని, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సలు చేయాల్సి ఉంటుందన్నారు. హెపటైసిస్- బి వ్యాధి వల్ల వచ్చే లివర్ జబ్బును మందుల వల్ల తగ్గించడానికి ఆస్కారముందని వైద్యులు చెప్పారు. లివర్ కేన్సర్‌ను కూడా ఆపరేషన్ ద్వారా నయం చేసి జీవిత కాలాన్ని పెంచుకోవడానికి అవకాశముందని వివరిస్తున్నారు.
కారణాలు ..
*ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఎక్కువగా పాడైపోయే ప్రమాదముంది.
*వైరస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల కూడా లివర్ దెబ్బతినే అవకాశాలున్నాయి.
*జాండిస్ వస్తే కాలేయం పనితీరు మందగించినట్లుగా భావించాలి.
*ఫ్యాటీలివర్ కారణంగా, అధిక బరువు వల్ల పేరుకుపోయిన కొవ్వు వల్ల కాలేయం దెబ్బతింటోంది.
కొన్ని రకాల మందుల కారణంగా కూడా కాలేయం పనితీరు మందగించి జబ్బులకు దారి తీస్తుంది.
తిరిగి పూర్వస్థితికి.. కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగు తున్నా.. ఆ స్థాయిలో కాలేయ దానం చేసేందుకు ముందుకు రావడంలేదు. కాలేయం దానం చేస్తే ఆరోగ్యానికి హానికరమన్న భావనలో ఉండటంతో ఎవరూ ముందుకు రావడం లేదు. జీవితాంతం శరీరంలో పెరిగే ఏకైక అవయం కాలేయం. 30 శాతం లివర్ ఉన్న వ్యక్తి తన పనులన్నింటినీ స్వయంగా చేసుకోగలిగే సమర్థత ఉంటుందన్నారు. కాలేయం తనకే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడే అవయం. కాలేయంలో 60 శాతం దానం చేసినా ఆరోగ్యంగా బతకవచ్చు. రెండు మూడు నెలల్లో కాలేయం పూర్వ స్థితికి చేరుకుంటుంది. సరైన అవగాహన లేక చాలా మంది లివర్‌కు సంబంధించిన సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మరొకరికి ఉపయోగపడే ఈ అవయవాన్ని ఆధునిక జీవన శైలి అలవాట్లతో నష్టం కల్గిస్తున్నారు. 18 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైనా కాలేయంలో కొంత భాగం దానం చేయవచ్చు.
* కాలేయ దానం చేసిన వారికి 3 నుంచి 6 నెలల్లో కాలేయం తిరిగి పూర్వస్థితికి వస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
*పెద్దవారిలో 42 నుంచి 55 వయసు ఉన్న వారికి కాలేయ జబ్బులు వస్తున్నాయి. పిల్లల్లో 1, 2 సంవత్సరాల వారికి పుట్టుకతో కాలేయ జబ్బులు వస్తున్నాయి.
*కడుపులో నొప్పి, రక్తం వాంతులు, కామెర్లు, మలవిసర్జనలో రక్తం పడడం, కడుపులో నీరు చేరడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే లివర్ క్యాన్సర్‌గా అనుమానించాలి.
*కాలేయం వ్యాధుల్ని మొదటి దశలోనే గుర్తించి చికిత్సపొందడంతో కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
*ఆల్కహాల్, డ్రగ్ లాంటి అలవాట్లను వదులుకుంటే లివర్ సిర్రోసిస్ కు దూరంగా ఉండవచ్చు.
*వైరల్ ఇన్‌ఫెక్షన్, అపరిశుభ్రత నీరు, ఆహారం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
*పొట్టప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకోకుండా జా గ్రత్త పడడం వల్ల ఫ్యాటీ లివర్‌ను నియంత్రించవచ్చు.
*లివర్‌లో ఇన్‌ఫెక్షన్ కారణంగా వచ్చే నీటిబుడగలను ల్యాప్రొస్కోపిక్ లేకపోతే ఓపెన్ సర్జరీ ద్వారా చేయడానికి వీలుంది.
*కాలేయంలో వచ్చే సాధారణ కణతలు, క్యాన్సర్ కారక కణతలను ఆపరేషన్ ద్వారా తొలగించే వీలుంది.
*క్యాన్సర్ కణతలను ల్యాప్రోస్కొపిక్ సర్జరీ ద్వారా తొలగించి రోగికి పూర్తిగా స్వస్థత చేకూర్చవచ్చు.
పిల్లల్లో వచ్చే కాలేయ జబ్బులకు మూడు నెలల్ల్లో ఆపరేషన్ చేసి సాధారణ స్థితికి తీసుకురావడానికి అవకాశముంది.
*ఒకరి కాలేయం ఇద్దరు రోగులకూ ఏర్పాటు చేసే వీలుంటుంది. ఎవరికి ఎంత శాతం అవసరమో అంతే అమర్చవచ్చు.
*క్షయ, కీళ్ల వాతం సమస్యలకు వాడే మందుల ప్రభావం వల్ల కూడా కాలేయ వ్యాధులు రావొచ్చు. అలాగే కాలేయంలో కొవ్వు పేరుకున్నా కాలేయ వ్యాధిగా పరిమణించవచ్చు.

liver disease symptoms

Telangana News