Home మెదక్ ప్రమాదవశాత్తు నివాస పూరిగుడిసెలు దగ్దం

ప్రమాదవశాత్తు నివాస పూరిగుడిసెలు దగ్దం

Huts-Burnt– ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం
– సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ మూడు కుటుంబాలు
వెల్దుర్తి : మండల పరిధిలోని మాసాయిపేట గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు నివాస పూరిగుడిసెలు పూర్తిగా దగ్దం కాగా మరో రెండు రేకుల ఇళ్ళు పాక్షికంగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో ఆయా గుడిసెల్లో నివసిస్తున్న వారు పిల్లా పాపలతో బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గుడ్డి నర్సింలుకు చెందిన నివాస పూరి గుడిసెకు మొదటగా ప్రమాద వశాత్తు నిప్పంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో నిద్రిస్తున్న నర్సింలు, భార్య నర్సమ్మ, కుమారులు శ్రీనివాస్, రమేశ్‌లు బయటకు పరుగులు తీశారు. చుట్టు పక్కల వారి సాయంతో మంటలను ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోగా కొన్ని క్షణాల్లోనే పక్కనే ఉన్న వడ్డెపల్లి బిక్షపతికి చెందిన నివాస పూరి గుడిసెతో పాటు మరో రెండు రేకుల ఇళ్ళకు మంటలు వ్యాపించాయి. బిక్షపతి గుడిసె ప్రధాన ద్వారానికి మంటలు అంటుకోగా అందులో నిద్రిస్తున్న అతని భార్య సుధ, కుమారుడు శ్రీకాంత్, కోడలు అనూషలు ఊయలలో నిద్రిస్తున్న తన మూడేళ్ళ కుమారుడిని ఎత్తుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చారు. అనంతరం బిక్షపతి ఇంట్లోని సిలిండర్‌లో గ్యాస్ లీకవడంతో మంటలు పెద్దెత్తున ఎగిసిపడ్డాయి. మొత్తంమీద అగ్ని ప్రమాదంలో నర్సింలు తన కుమారుడు శ్రీనివాస్‌లకు చెందిన రూ. 50వేల నగదు నిత్యవసర సామాగ్రి, విలువైన డాక్యుమెంట్‌లు కాలి బూడిద కాగా బిక్షపతి ఇంట్లో వస్తు సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయన్నారు.