Home జాతీయ వార్తలు కమలదళంలో జోష్

కమలదళంలో జోష్

 

యాత్ర చేసినట్లుగా ఉంది
 లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై ప్రధాని వ్యాఖ్య
 కేంద్ర మంత్రులకు మోడీ కృతజ్ఞతలు
 ఎన్‌డిఎ పక్షాలకు అమిత్ షా విందు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.ఈ నేపథ్యంలో ఎన్‌డిఎ పార్టీల అగ్ర నేతలకు బిజెపి అధ్యక్షుడ అమిత్ షా మంగళవారం రాత్రి విందు ఇచ్చారు. ఈ విందుకు ముందు బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ తమ పార్టీ, ఇతర మిత్ర పక్షాలకు చెందిన కేంద్ర మంత్రులతో సమావేశమై కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని ఈ లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రచారాన్ని ఒక తీర్థయాత్రతో పోల్చారు. ఇది మిగతా ఎన్నికలకంటే భిన్నమైందని, ఎందుకంటే ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఒక్కటే కాదు, ప్రజలు కూడా పోరాడారని ఆయన అన్నట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ బీడియా ప్రతినిధులకు చెప్పారు.‘ నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఈ ఎన్నికలు రాజకీయాలకన్నా అతీతమైనవి. ఎందుంటే ఈ ఎన్నికల్లో ప్రజలు పోరాడారు. నేను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశాను. వివిధ ఎన్నికల్లో పార్టీ కోసం రాజకీయ పర్యటనలు చేశా. ఈ ఎన్నికల్లో నేను పర్యటిస్తున్నప్పుడు ఒక యాత్ర చేస్తున్నట్లు అనిపించింది’ అని ప్రధాని ఆ సమావేశంలో అన్నారు. కాగా దేశం కోసం అయిదేళ్లుగా కేంద్ర మంత్రులు చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణం చేయడానికి వీలుగా గురువారం లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘ఆభార్ మిలన్’ (కృతజ్ఞతా సమావేశం) పేరిట అమిత్ షా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిజెపి, మిత్ర పక్షాల నేతలకు ఆయన రాత్రి విందు కూడా ఇస్తున్నారు.‘ గత అయిదేళ్ల కాలంలో కష్టపడి పని చేసిన, సాధించిన అద్భుతమైన విజయాలకు గాను నేను మోడీ సర్కార్ టీమ్‌ను అభినందిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక నవ భారత నిర్మాణం కోసం మనం ఈ ఊపును ఇలాగే కొనసాగిద్దాం’ అని అనంతరం చేసిన ఒక ట్వీట్‌లో అమిత్ షా పేర్కొన్నారు. ఈ విందుకు బిజెపినుంచి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, జెపి నడ్డా తదితరులతో పాటుగా మిత్ర పక్షాలకు చెందిన రాంవిలాస్ పాశ్వాన్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, అనుప్రియ పటేల్ తదితరులు హాజరయ్యారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, జెడి(యు) అధ్యక్షుడు, బిహార్ సిఎం నితీశ్ కుమార్ తో పాటు ఇతర బిజెపి మిత్రపక్షాలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు.

Lok Sabha Polls 2019: Modi appreciate to Central ministers