Home తాజా వార్తలు పచ్చదనం వాపస్

పచ్చదనం వాపస్

Lost greenness and environment must come back

కోల్పోయిన పచ్చదనం, పర్యావరణం తిరిగి రావాలి

అడవుల నాశనం వల్ల అనర్థాలు జరిగాయి, ఆ నష్టం పూడ్చాలి
హరితహారానికి ఉపాధిహామీ నిధులు వినియోగించుకోవాలి
వ్యవసాయ కూలీలను ఉపయోగించాలి                                                                                                                25% పండ్ల మొక్కలుండాలి
గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలి : ప్రగతి భవన్ సమీక్షలో సిఎం కెసిఆర్ 

మన తెలంగాణ / హైదరాబాద్ : ‘అడవులు, చెట్లు పోవడం వల్ల గ్రామాల్లో కోల్పోయిన పచ్చదనం, పర్యావరణం తిరిగి రావాలి. పచ్చదనానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి. అడవులు నాశనం కావడం వల్ల అనేక అనర్థాలు కలిగాయి. మానవ జీవితం కల్లోలమైంది. అడవిలో పండ్లు తిని బతికే కోతులు ఊళ్లమీద పడ్డాయి. పంటలను నాశనం చేస్తున్నా యి. వంటింట్లోకి కూడా చొరబడి మన తిండినీ ఎత్తుకుపోతున్నాయి. ఇలాంటి పరిణామాలకు అడవులు, చెట్లు లేకపోవడమే కారణం. హరితహా రం కార్యక్రమం ద్వారా అడవుల పునరుద్ధరణ జరగాలి. గ్రామాల్లో కూడా విరివిగా చెట్లు ఉండాలి. పండ్ల చెట్ల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. నర్సరీ ల్లో పెంచే మొక్కల్లో కనీసం 25% పండ్ల మొక్కలుండాలి. కోతులు, పక్షులు, ఇతర అడవి జీవులు తినే తునికి, ఎలక్కాయ, మొర్రి, నేరెడు, సీతాఫల, జామ తదితర పండ్ల మొక్కలను పెద్ద సంఖ్యలో సిద్ధం చేసి పంపిణీ చేయాలి. అడవుల్లో, పొలాల దగ్గర, ఖాళీ ప్రదేశాల్లో వాటిని పెంచాలి. దీనివల్ల కోతులు, ఇతర అడవి జీవులు జనావాసాల మీద పడకుండా ఉంటాయి. మనుషులు తినే పండ్ల మొక్కలను కూడా సిద్ధం చేస్తే, అందరూ తమ ఇండ్లలో వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్‌లో ఆదివారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను వినియోగించుకోవాలని, నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనుల మొదలు వాటిని కాపాడే వరకు ప్రతీ దశలోనూ మానవ శ్రమే కీలకం కాబట్టి వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేయించే విధంగా తగిన కార్యాచరణను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దీనికి సం బంధించి సమగ్ర నివేదిక (డిపిఆర్)ను రూపొందించాలని ఆదేశించారు. ‘కొత్త గా ఏర్పాటు చేసుకున్న వాటితో కలిపి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి.ఒక్కో గ్రామాన్ని ఒక్కో యూనిట్ గా తీసుకోవాలి. ప్రతీ గ్రామంలో నర్సరీ పెంచాలి. నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయ డం, వాటిని పంపిణీ చేయడం, గుంతలు తీయడం, నీళ్లు పోయ డం లాంటి పనులన్నీ మానవ శ్రమతో కూడుకున్నవే. కాబట్టి వ్యవసాయ కూలీలను ఈ పనులకు ఉపయోగించే అవకాశం ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిబంధనలు కూడా ఉపాధి కల్పించే పనులు చేపట్టాలని ఖచ్చితంగా చెప్తున్నాయి. అందువల్ల ఉపాధి హామీ నిధులను తెలంగాణ ‘హరితహారం’ కార్యక్రమం కోసం వినియోగించడం సముచితంగా, ఉభయ తారకంగా ఉంటుంది. రాష్ట్రంలో చేపడుతున్న హరితహారం కార్యక్రమం కోసం ఈ నిధులను వాడుకోవడానికి కార్యాచరణ రూపొందించాలి.పనులకు సం బంధించిన డిపిఆర్‌ను సిద్ధం చేయాలి.ఎంత వ్యయం అవుతుందో అంచ నా వేయాలి’ అని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు సూచించారు.