Home మెదక్ రైల్వే స్టేషన్‌లో ప్రేమజంట ఆత్మహత్య

రైల్వే స్టేషన్‌లో ప్రేమజంట ఆత్మహత్య

Mission

మన తెలంగాణ/తూప్రాన్:మెదక్ జిల్లా, తూప్రాన్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి శివారులో రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలో సంచలనం రేపుతుంది. ఘటన స్థలంలో లభించిన ఆధారల ప్రకారం… మృతులు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన ఒంటెద్దు కాశిరాం, జయేంద్రలుగా పోలీసులు గుర్తించారు. వీరి మరణానికి వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని మృతుల బంధువులు తెలియజేస్తున్నారు. రైల్లో గురువారం ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ వైపు వెళ్తుండగా బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి జయేంద్ర యొక్క పది నెలల చిన్నారిని స్టేషన్‌లో ఉంచి వీరిరువురు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దృవీకరించారు. ఒంటెద్దు కాశిరాం మేనత్త కూతురైన జయేంద్రతో ఇతనికి వివాహేతర సంబంధం ఉందని వీరిరువురి బంధువర్గాలు తెలియజేస్తున్నాయి.

గత ఐదు సంవత్సరాల క్రితమే మృతురాలు జయేంద్రకు మరొకరితో వివాహం జరిగింది.వీరికి ఒక కుమారుడు, కూతు రు ఉన్నారు. కుమారుడిని హాస్టల్‌లో చేర్పించడం తో చిన్నపాప తన వెంటే ఉంది. భర్త బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లడంతో బావా మరదళ్ల వద్ద వివాహేతర సంబంధం ఉన్నట్లుగా సమాచారం. ఈ విషయమైన వీరిరువురి బంధువర్గాల్లో ఇప్పటికే గొడవలు కూడా జరిగాయి. దీంతో వీరిరువురు కూడా కుటుంబ సభ్యులతో తరచు గొడవపడి చివరకు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

కామారెడ్డి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీరిది ఆత్మహత్యా లేదా హత్యా అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారి వెంట ఉన్న 10నెలల చిన్నారిని స్టేషన్ ముందు వదిలివేయడంతో చిన్నారి ఒంటరిగా మిగిలింది. చిన్నారి రాత్రంతా బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీయగా స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో మృతువులకు సంబంధించిన ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డులు లభించాయి. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కామారెడ్డి రైల్వే ఆసుపత్రికి తరలించారు. తల్లి మరణంతో పది నెలల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయిన చిన్నారిని స్థానికులు ఐసిడిఎస్ అధికారులకు అప్పజెప్పారు.