Home దునియా గ్లామర్ రంగంలో ప్రేమ పెళ్లిళ్లు

గ్లామర్ రంగంలో ప్రేమ పెళ్లిళ్లు

Valentines Day Special

ఫిబ్రవరి 14…ప్రేమికుల దినోత్సవం….అంటే యువ ప్రపంచానికి పండగే! వాలంటైన్స్ డే ప్రేమను పంచేరోజు…ప్రేమను పెంచేవారి రోజు..పెళ్లికి పునాది ప్రేమ.. ప్రేమకు ముందు దశ క్రష్..సామాన్యుల్లానే స్టార్‌లకూ ప్రేమ కహానీలుంటాయి..కొన్ని పెళ్లి వరకూ వెళ్తే…మరికొన్ని ప్రేమలోనే కొనసాగుతుంటాయి..మరి కొన్ని పెళ్లయిన కొన్నేళ్లకు విడాకులకు దారితీస్తాయి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రేమ కథ ఉంటుంది. వాటిలో కొన్ని విజయగాథలూ  ఉంటాయి. వాటికి భిన్నమైన ప్రేమ కథ…వాలంటైన్ కథ. ప్రేమికుల కోసం వాలంటైన్ చేసిన పోరాటం. సెయింట్ వాలంటైన్ ప్రేమికుల కోసం అమరుడయ్యాడు.

ఎందుకు చేసుకుంటారంటే…
క్రీ. శ. 269 – 70 ప్రాంతంలో రోమన్ సామ్రాజ్యాన్ని రెండో క్లాడియస్ పాలించేవాడు. ఇతనికి సామ్రాజ్య విస్తరణ కాంక్ష అధికం. దీంతో రోమన్ సైన్యం నిత్యం యుద్ధాలు చేయాల్సివచ్చేది. ఏడాది పొడవునా యుద్ధభూమిలో ఉండేవారు సైనికులు. ఇంట్లో వాళ్లను విడిచి ఉండలేక యువకులు సైన్యంలో చేరేవారు కాదు. దేశంలోని యువకులు తమ ప్రియురాళ్లను, కుటుంబాన్ని విడిచి రావడానికి ఇష్టపడకపోవడమే సైనికుల కొరతకు కారణమని భావించిన క్లాడియస్ దేశంలో నిశ్చితార్థాలూ, పెళ్లిళ్లపైన ఆంక్షలు విధిస్తూ చట్టం చేశాడు. ఈ సమయంలో వాలంటైన్ అనే క్రైస్తవ మత బోధకుడు ఈ అన్యాయాన్ని ఎదిరించాడు. ఫలితంగా జైలుపాలయ్యాడు. అక్కడ అంధురాలైన జైలు అధికారి కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. ఉరికి ముందురోజు తన ప్రేమను తెలుపుతూ జైలు గోడపై లేఖ రాశాడు. చివరిగా ‘ ఫ్రమ్ యువర్ వాలంటైన్’ అని రాశాడు. అవే అతని చివరి మాటలు. అనంతరం రెండు శతాబ్దాలకు కాథలిక్ చర్చి ఆయనకు సెయింట్ బిరుదునిచ్చింది. ఆశ్యర్యమేమంటే ఆయన మరణించిన రోజు ఫిబ్రవరి 14నే వాలంటైన్స్ డేగా చేసుకుంటున్నాం. నాటి నుంచి వాలంటైన్ ప్రేమికులకు ఆరాధ్యుడయ్యాడు. ప్రేమ మనిషిన రాటుదేలేలా చేస్తుంది. ప్రేమికుడిని ఏరంగంలో అయినా విజేతగా నిలుపుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. జీవితంలో విజేతగా నిలవాలనుకునేవారికి ప్రేమరుచి తెలిసుండాలి. ఒక్కసారైనా ప్రేమలో పడుండాలి. ప్రేయసిని ఐలవ్‌యూ దాకా తీసుకెళ్లడానికి అనుసరించి మార్గాన్నే వృత్తి ఉద్యోగాల్లో లక్షసాధనకు ఉపయోగిస్తే చాలు.
ఎలాంటి బహుమతులు ఇచ్చుకుంటారంటే…
రోమన్ ప్రేమ దేవత వీనస్‌కు ఎర్రగులాబీలంటే ఇష్టం. ఆమె గుర్తుగా ఇచ్చే రోజాలు ప్రేమికుల ప్రధాన బహుమతిగా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజున ఇరవై కోట్ల గులాబీల అమ్మకాలు జరుగుతాయి. న్యూఇయర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ వాలంటైన్స్ డే. దాదాపు మూడున్నర కోట్ల హృదయాకారపు చాక్లెట్ల డబ్బాలు అమ్ముడవుతాయి. ప్రేమికుల దినోత్సవం రోజు పెళ్లి ప్రతిపాదన చేసే లేదా ఆశించే వ్యక్తుల సంఖ్య 60లక్షలకు పైనేనట.

బాలీవుడ్ సినీ హీరోయిన్లకు క్రికెట్ హీరోలకు మధ్య ప్రేమపెళ్లిళ్లు గణనీయంగా జరిగాయి. ఈ రెండు గ్లామర్ రంగాల మధ్య వాలంటైన్ వారివారిని కలిపిన సందర్భాలెన్నో…భారత క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ ఖాన్ బాలీవుడ్ నటి షర్మిలాఠాగూర్‌ను మొదటిసారిగా 1965లో ఢిల్లీలో కలిసి తొలిచూపులోనే ప్రేమించారు. పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత వచ్చింది. వాళ్లను ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టింది. చివరికి పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. పటౌడీ కోసం షర్మిల మతం మార్చుకున్నారు. షర్మిల అప్పటికే ఆరాధన, అమర్‌ప్రేమ్, దాగ్‌లాంటి సినిమాలతో హిట్ సాధించారు. ఆ సమయంలోనే నవాబ్ పటౌడీని చేసుకున్నారు. వీరి వివాహ జీవితం ఆదర్శంగా నిలిచింది. వీరి కుమారుడు నటుడు సైఫ్‌అలీఖాన్ కూడా నటి కరీనా కపూర్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.

అగ్రగటి రీనారాయ్ పాకిస్తాన్ క్రికెటర్ మోసిన్‌తో ప్రేమలో పడ్డారు. నాగిన్, కాలీచరణ్, జానీదుష్మన్, నసీబ్ సినిమాలతో హిట్‌లు కొట్టారు రీనా. 1983లో పెళ్లి చేసుకున్నారు. కానీ త్వరలోనే విడాకులు తీసుకున్నారు. 1996లో మిస్ ఇండియా సంగీతా బిజలానీని ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అజారుద్దీన్‌కి అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల మొదటి భార్యను వదులుకుని సంగీతాని చేసుకున్నారు. 2010లో 14 ఏళ్ల తర్వాత సంగీతా నుంచి కూడా విడిపోయారు. బ్యాట్స్‌మన్ రిచర్డ్‌కి అంతకుముందే పెళ్లయింది. 1980 నుంచి బాలీవుడ్ నటి నీనాగుప్తాతో సహజీవనం చేశాడు. కొంతకాలానికి విడిపోయారు. వీరికి ఒక పాప మసాబా. ఇప్పుడామె ప్రసిద్ధ డిజైనర్. టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ బాలీవుడ్ నటి హజల్‌కీచ్‌ను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. సౌరబ్‌గంగూలీ, దోనా కోల్‌కతా వాసులు. ఇద్దరూ రహస్యంగా డేటింగ్‌లో ఉండేవారు. 1996లో పెద్దలకు తెలీకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. పెద్దల సమక్షంలో రెండోసారి సంప్రదాయ వివామం చేసుకున్నారు.

వీరేంద్ర షెహ్వాగ్, ఆర్తీలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే సన్నిహితులు. ఇరు కుటుంబాలు బంధువులు. పెరిగే కొద్దీ స్నేహం ప్రేమగా మారింది. 17 ఏళ్ల స్నేహం తర్వాత 2004లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ముందు పెద్దలు ఒప్పుకోలేదు. తర్వాత అంగీకరించక తప్పలేదు. ప్రముఖ ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్, కిక్ బాక్సర్ ఐన ఆయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శిఖర్ ధావన్‌కు ఫేస్‌బుక్ ద్వారా ఆయేషా పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారింది. ఫేస్‌బుక్‌లో ఆయేషాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా ఆమె ఆమోదించింది. సీనియర్ సహచరుడైన హర్‌భజన్‌సింగ్ ఇద్దరినీ కలిపాడు. ఇతను ఇద్దరికీ ఫేస్‌బుక్ ఫ్రెండ్. శిఖర్ కంటే ఆయేషా పన్నెండేళ్లు పెద్దది. ఈ విషయంలో తన తల్లిదండ్రులను ఒప్పించడం కష్టమైంది. ఆమె అమెచ్యూర్ బాక్సర్. ఆమె తల్లి బ్రిటిష్ వనిత. తండ్రి బెంగాలీ. ఆయేషాకు బెంగాలీ బాగావచ్చు. ఆమెకు తీరిక దొరికినప్పుడల్లా శిఖర్ ధావన్ రంజి ట్రోఫీ, ఐఫిల్ ఆటలకు వెళ్తుంటుంది. ఆయేషాకు ఇది రెండో పెళ్లి. మొదటి పెళ్లి ద్వారా ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ( రియా, అలియా). శిఖర్ ఎంతో కష్టంతో తన తల్లిదండ్రులను ఒప్పించాడు. 2009లో వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయింది. కానీ శిఖర్ పెళ్లిని మూడేళ్లకు పోస్ట్‌పోన్ చేశాడు.ఇండియన్ టీమ్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుని తర్వాత చేసుకోవాలనుకున్నాడు. చివరికి అక్టోబర్ 30, 2012లో వీరి వివాహం జరిగింది. తన భార్య, ఆమె కూతుళ్లు తనకు కలిసొచ్చిన అదృష్టం అంటాడు.

సచిన్ తెండూల్కర్ ప్రముఖ పారిశ్రామిక వేత్త అశోక్‌మెహతా కుమార్తె అయిన అంజలిని చూడగానే ప్రేమించాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. అప్పుడు సచిన్ వయసు 1990 ,17. ఇంటర్నేషనల్ టూర్ నుంచి సచిన్ తిరిగి వస్తుండగా, విమానాశ్రయంలో అంజలిని చూశాడు. అమ్మను రిసీవ్ చేసుకోవడానికి అంజలి అక్కడికి వచ్చింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరూ కలుసుకున్నారు. అంజలి డాక్టర్, క్రికెట్ గురించి పెద్దగా తెలీదు. సచిన్‌తో డేటింగ్‌లో ఉండగా క్రికెట్ మ్యాచ్‌లకు వెళ్లడం మొదలెట్టింది. అంజలి సచిన్ కంటే ఆరేళ్లు పెద్ద. మే 24, 1995న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు సారా, అర్జున్. పెళ్లవగానే అంజలి తన వృత్తిని వదులుకుంది. పిల్లల్ని చూసుకుంటుంది. మహేంద్ర సింగ్ ధోని, సాక్షి ఇద్దరూ బాల్యస్నేహితులు. ఇద్దరి తండ్రులు రాంచీలో మికాన్ కంపెనీలో ఒకే చోట పనిచేసేవారు. ధోని సాక్షి ఒకే స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. సాక్షి కుటుంబం డెహ్రాడూన్‌కు వెళ్లింది. 2007లో సాక్షి ధోనిని కోల్‌కత్తాలో కలిసింది. ఇండియా పాకిస్తాన్ సిరీస్ జరుగుతున్న రోజులవి. ధోని తాజ్ బెంగాల్ హోటల్‌లో బస చేశాడు. సాక్షి అక్కడ ఇన్‌టెర్న్‌గా పనిచేసేది. అక్కడ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. జూలై 4, 2010లో పెళ్లయే వరకు తమ ప్రేమ రహస్యంగా ఉంచారిద్దరూ.

రోహిత్‌శర్మ లీడింగ్ ముంబయి బ్యాట్స్‌మన్. రితికసాజేష్ స్పోర్ట్ మేనేజర్. అలా ఇద్దరికీ పరిచయం ప్రేమగా మారింది. ఆరేళ్లు స్నేహితులుగా ఉన్నారు. డిసెంబర్13, 2015, ముంబయిలో పెళ్లి చేసుకున్నారు. ఎమ్‌ఎస్ ధోని, సచిన్‌లాంటి క్రికెట్ బృంద సభ్యులంతా పెళ్లికి హాజరయ్యారు. ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా, ప్రియాంకా చౌదరిని 2015 ఏప్రిల్ 3న ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా బాల్యస్నేహితులు. రైనా తల్లి ప్రోత్సాహంతో వీరి వివాహం జరిగింది. మనోజ్ తివారీ ఏడేళ్ల ప్రేమ తర్వాత మోడల్ అయిన సుష్మితారాయ్‌ని వివాహం చేసుకున్నాడు. ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బాల్య స్నేహితురాలైన ప్రీతినారాయణన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్‌లో ఇద్దరూ చదువుకున్నారు. తిరిగి బిటెక్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ చెన్నైలో కలిశారు. ప్రేమలో పడ్డారు. నవంబర్ 13, 2011లో పెళ్లి చేసుకున్నారు.

నటాషా జైన్, గంభీర్‌ల ప్రేమ వివాహం జరిగింది. వీరిద్దరూ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. 2011అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. క్రికెటర్ దినేష్ కార్తిక్, స్కేష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. టెన్నిస్ ధ్రువతార సానియా మిర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్‌మలిక్‌ను పెళ్లాడారు. 2010లో సానియాకు, బాల్యస్నేహితుడైన షౌరబ్ మిర్జాతో నిశ్చితార్థం జరిగింది. షోయబ్ అంతకు ముందే హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో చాలా గొడవలు జరిగాయి. హర్‌భజన్‌సింగ్, మోడెల్, నటి గీతాబస్రాతో ప్రేమ కొనసాగుతుంది. పెళ్లిచేసుకోనున్నారు. బాలీవుడ్ నటి అనుష్కాశర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీల ప్రేమ అందరికీ తెల్సిందే.

సినీ రంగంలోనూ …
సినీరంగంలోనూ విజయవంతమైన ప్రేమ పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. హీరో కృష్ణ విజయనిర్మల, అక్కినేని నాగార్జున అమలది ప్రేమపెళ్లి. నటుడు మంచు విష్ణు వర్దన్ బాబు ప్రముఖ విలక్షణ నటుడు మోహన్‌బాబు కుమారుడు. వైఎస్ రాజశేఖరరెడ్డి మేనకోడలు విరోనికా రెడ్డిని 2009లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. నటుడు అల్లుఅర్జున్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్నేహారెడ్డిని పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నాడు. నటుడు చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ, తన బాల్యస్నేహితురాలు కామినేని ఉపాసనను ప్రేమించి జూన్ 14, 2012లో వివాహం చేసుకున్నాడు.

హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు నటుడు గౌతమ్, కెమెరామెన్ శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె జ్యోత్సను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నటుడు నాని (నవీన్‌బాబు ఘంట) విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అంజనతో 2012లో ప్రేమపెళ్లి జరిగింది. మాజీ ఫెమినా మిస్ ఇండియా నమ్రతాతో మహేష్‌బాబు 2000 నుంచి డేటింగ్ చేస్తూ 2005 పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్, ఊహలకు పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు. రోషన్, మేధ, రోహన్‌లు. దివంగత సినీనటుడు శ్రీహరి డిస్కోశాంతిలది కూడా ప్రేమ పెళ్లి. ఇద్దరు పిల్లలు. తమిళ నటుడు సూర్య, నటి జ్యోతికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సమంత నాగచైతన్యల ప్రేమకు పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నిశ్చితార్థం కూడా జరిగింది. తమిళ ఇండస్ట్రీలో అజిత్, షాలినిలది విజయవంతమైన ప్రేమ వివాహం. మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గాయనీగాయకులైన హేమచంద్ర శ్రావణ భార్గవిలది ప్రేమ పెళ్లి.

– మల్లీశ్వరి వారణాసి