Home జాతీయ వార్తలు లవర్ తిట్దిందని.. ఆటోలోనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం…!

లవర్ తిట్దిందని.. ఆటోలోనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం…!

Autorickshaw Fireన్యూఢిల్లీ: ప్రియురాలు తిట్టిందన్న కోపంలో డ్రైవర్ ఆటోలోనే పెట్రోల్ పోసుకొని నిప్పటించుకోవడంతో ఆ మంటలు ఇద్దరు ప్రయాణికులకు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణికులు ఇద్దరు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దేశరాజధాని ఢిల్లీలోని జ్యోతి నగర్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే… ఘజియాబాద్‌కు చెందిన శివమ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు తన బంధువైన అర్జున్‌తో కలిసి వెళ్తుండగా మార్గ మధ్యలో మరో వృద్ధుడు ఆటో ఎక్కాడు. ఆటో కొద్ది దూరం వెళ్లింది. ఇంతలో శివమ్ కోల్‌కతాలో ఉన్న తన ప్రియురాలికి ఫోన్ చేశాడు.

ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెతో గొడవకు దిగాడు. కొద్దిసేపు ఇద్దరు ఫోన్ లో వాదులాడుకున్నారు. కోపంతో ఫోన్ కట్ చేసిన శివమ్ ఆటోను రోడ్డుపై నిలిపి వేశాడు. అనంతరం పెట్రోల్ బాటిల్ తీసి ఆటోలోనే పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అసలేం జరుగుతుందో తెలిసేలోపే ఆ మంటలు ఆటోలో ఉన్న మిగిలిన ఇద్దరికి కూడా అంటుకున్నాయి. ఒక్కసారిగా ఆటోలో నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు మంటలను ఆర్పి గాయపడిన ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, శివమ్‌ శరీరం 70 శాతం కాలిపోవడంతో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ఇద్దరు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివమ్ ఆత్మహత్యాయత్నంపై దర్యాప్తు చేస్తున్నారు.

Lover Sets Himself On Fire Inside Delhi Autorickshaw