Search
Sunday 23 September 2018
  • :
  • :

ప్రేమికులు దొంగలయ్యారు..!

Lovers

హైదరాబాద్: కష్టపడకుండా తేలిగ్గా డబ్బు సంపాదించాలనే దురాశతో ఆ ప్రేమికులు దొంగలుగా మారారు. తమ జల్సాల కోసం జ్యుయెలరీ షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే… ఇటీవల సోమాజిగూడ లలితా జ్యుయెలరీలో 66 గ్రాముల బ్యాంగిల్స్, బ్రాస్‌లెట్ దొంగలించబడిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల్ని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల్దిరూ ప్రేమికులు కావడం గమనార్హం. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన షేక్ కరిముల్లా, వాణికాంత్రి లవర్స్. ఉపాధి కోసం నగరానికి వచ్చారు. పారడైజ్ సింధి కాలనీలో హాస్టల్‌లలో ఉంటున్నారు.

ఆర్థిక సమస్యతో సతమతమవుతున్న వీరు సోమాజిగూడలోని లలితా జ్యుయెలరీలో దొంగతనానికి పాల్పడ్డారు. షాపులో రద్దీగా ఉన్న సమయం చూసి సిబ్బందిని మాటల్లో పెట్టి 66 గ్రాముల బంగారు బ్యాంగిల్స్, బ్రాస్‌లెట్ దొంగలించారు. వాటిని తమ ప్రాంతానికి తీసుకెళ్లి ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ. 1.20 లక్షలకు తాకట్టు పెట్టారు. అయితే, కేసు విచారణలో భాగంగా పోలీసులు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులైన షేక్ కరిముల్లా, వాణికాంత్రిలను అరెస్టు చేశారు. వారు తాకట్టు పెట్టిన 65 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిసిపి వెంకటేశ్వర్రావు తెలిపారు.

Comments

comments