Home రాష్ట్ర వార్తలు రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య

రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య

succide1

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట శివారులో ఘటన 

మన తెలంగాణ / రామన్నపేట: కులాలు వేరు కావడంతో తమ ప్రేమను ఇరువురి కుటుంబ సభ్యులూ ఇక ఒప్పుకోరని కలిసి జీవించే కంటే చనిపోవడం మేలని భావించి మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన చిర్రబోయిన అయిలయ్య, ధనమ్మల ఏకైక కుమారుడు గణేష్(22) అదే గ్రామానికి చెందిన బొంత శంకరయ్య-, లక్ష్మిల కుమార్తె పూజితలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పూజిత ప్రస్తుతం అమ్మనబోలు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. గణేష్ ఇంటర్ పూర్తి చేసి తండ్రికి పనిలో సహాయంగా ఉంటూ కొత్త లారీని కొనుగోలు చేసి పనులు చేయిస్తున్నాడు. వారి ఇంటికి ఎదురుగానే బొంత శంకరయ్య కుటుంబం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నిర్వహణకు అయిలయ్య బోరును వినియోగిస్తున్నాడు. దసరా పండుగకు కొద్ది రోజుల ముందు గణేష్, -పూజితల ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసింది. కులాలు వేరు కావడం ఇద్దరు మైనర్లు కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు మందలించారు. ఒకరి వద్దకు మరొకరు వెళ్ళకూడదని హెచ్చిరించారు. ఈ నెల 9 న పూజిత పాఠశాలకు వెళ్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరగా గణేష్ లారీ వద్దకు వెళ్తానని తల్లికి చెప్పి బయటకు వెళ్ళాడు. పూజిత పాఠశాలకు వెళ్ళలేదని తెలుసుకున్న తల్లి లక్ష్మీ ఆమె కోసం వెతికింది. బంధువులు స్నేహితుల ఇండ్లల్లో వెతికినా ఆచూకి లభించక పోవడంతో నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో తన కూతురిని కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. విషయాన్ని గణేష్ తల్లి ధనమ్మ తన భర్తకు తెలియజేసింది. వారి ఆచూకీ కోసం ఇరువురి కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చిట్యాల మండలం వట్టిమర్తి శివారులోని సాయిబాబ గుడి సమీపంలో ఉన్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఇద్దరు అక్కడే తమ వెంట ఉన్న బ్యాగును, ద్విచక్రవాహనాన్ని వదిలివెళ్ళారు.తమ కోసం ఇరువురి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారని తెలుసుకున్న పూజిత- గణేష్‌లు రామన్నపేట మండలానికి చేరుకున్నారు. జేపీ గార్డెన్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ మీద శుక్రవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.ఉదయం 6.10 నిమిషాలకు సికింద్రాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్ గార్డ్ స్థానిక స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాడు.విషయం చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలకు పాకింది. పూజిత, -గణేష్‌ల కోసం వెతుకుతున్న బంధువులకు సమాచారం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గుర్తించారు. స్థానిక ఎస్.ఐ బి.నాగన్న సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.స్టేషన్ మాస్టర్ రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వేశాఖ ఎస్‌ఐ అచ్యుతం తెలిపారు.స్థానిక ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.