న్యూయార్క్: స్పెయిన్ బుల్గా పేరొందిన రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. ఇప్పటికే 14 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన నాదల్‌ను ఫ్రాన్స్‌కు చెందిన 22 ఏళ్ల లూకాస్ పొయిలీ చేతిలో ఓటమి చవిచూశాడు. ప్రపంచ 24వ ర్యాంకర్ అయిన పొయిలీ 6-1, 2-6, 6-4, 3-6, 7-6 (8-6) తేడాతో నాలుగో సీడ్ నాదల్‌ను ఇంటికి పంపాడు. ఫ్రెంచి ఓపెన్ మూడో రౌండులోనే మణికట్టు గాయంతో వెనుదిరిగిన నాదల్.. వింబుల్డన్‌లో కూడా ఈ గాయం వల్లే దూరంగా ఉన్నాడు. రెండేళ్ల క్రితం చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత నాదల్ ఆడిన ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోవడం గమనార్హం. కాగా, ఈ మ్యాచ్‌లో మొదటి నాలుగు సెట్లలో నువ్వా నేనా అన్నట్లుగా పోరాటం సాగడంతో ఇద్దరికీ తలో రెండు సెట్లు గెలిచారు. అత్యంత కీలకమైన, నిర్ణాయాత్మకమైన ఐదో సెట్లో బాగా వెనకబడి ఉన్నప్పుడు నాదల్ వరుసగా మూడు మ్యాచ్ పాయింట్లు సాధించి టై బ్రేకర్ వరకు తీసుకొచ్చాడు. కానీ, బేస్‌లైన్ వద్ద అతడు చేసిన పొరపాట్ల వల్ల పొయిలీ అనూహ్యమైన విజయం సాధించాడు.