Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సన్న బియ్యంతో భోజనం

Lunch with rice in government schools

మనతెలంగాణ/సిద్దిపేట: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సిఎం కెసిఆర్ ప్రభుత్వ విద్యాలయాలలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలోని రంగధాంపల్లి శివారులో గల రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో జరిగిన టిఆర్‌ఎస్వీ శిక్షణా తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో మెరుగైన విద్య అందించడానికి 570 గురుకులాలను సిఎం కెసిఆర్ ఏర్పాటు చేశారన్నారు. అదే విధంగా 52 మహిళా రెసిడెన్షియల్ కళాశాలలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం గ్రాంట్ నిధుల ద్వారా 20 లక్షలను అందిస్తూ విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. 50 శాతం మెస్‌చార్జీలను పెంచి కడుపునిండా ప్రతి విద్యార్థికీ భోజనాన్ని అందివ్వడంతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3.5 కోట్లతో ఇంటర్మీడియట్ కళాశాలల పక్కా భవనాలను నిర్మిస్తున్నామన్నారు. విద్యా రంగంలో అనేక మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వ విద్యాలయాలలో కార్పొరేటుకు దీటుగా విద్యను అందిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా విద్యాలయాలకు ఖిల్లాగా మారిందన్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు అనేక కళాశాలలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. దేశంలోనే సిద్దిపేట అనేక రంగాలలో ఆదర్శంగా నిలుస్తూ వస్తుందన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సిద్దిపేట వేదికగా నిలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని టిఆర్‌ఎస్వీ నేతలే ప్రతి గడపగడపకూ తీసుకెళ్లాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్వీ ఎంతగానో క్రీయాశీలకంగా పనిచేసిందని అదే స్ఫూర్తిని బంగారు నిర్మాణం సైతం కొనసాగించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా వివిధ రంగాలలో సిద్దిపేటలో ఉచితంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి వారికి భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది 10వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలన్నారు. మొక్కలునాటడంతో పాటు చెట్ల పెంపకంలో ప్రతి విద్యార్థ్ధి క్రీయాశీలక పాత్ర పోషించాలన్నారు. ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సెన్, సిఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టిఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గల్లు శ్రీనివాస్, జిల్లా సమన్వయకర్త మేర్గు మహేశ్ తదితరులు మాట్లాడారు. అంతకు ముందు రంగాధాంపల్లి చౌరస్తాలో ఉన్న అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి, టిఆర్‌ఎస్వీ జెండాను ఆవిష్కరించారు. దేశపతి శ్రీనివాస్ పాటలు, విద్యార్థ్ధుల కేరింతలతో సభ ప్రాంగణం దద్దరిల్లింది. సభప్రాంగణంలో అమరులను సంస్మరించుకొని ఒక్క నిమిషం మౌనం పాటించారు. ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్, టిఆర్‌ఎస్వీ నాయకులు కడవేర్గు రాజనర్సు, వేలేటి రాధాకిషన్ శర్మ, మారెడ్డి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

comments