Home జోగులాంబ గద్వాల్ రసవత్తరం..రాజకీయం..!

రసవత్తరం..రాజకీయం..!

All-party-logos

ఉమ్మడి జిల్లాలో భారీగా కొనసాగుతున్న వలసలు  బలం పుంజుకుంటున్న కాంగ్రెస్  ప్రతిపక్షాలే టార్గెట్‌గా టిఆర్‌ఎస్ అడుగులు మోడీ పథకాలతో ముందుకెళ్తున్న బిజెపి నానాటికి కనుమరుగవుతున్న టిడిపి

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ రాష్ట్రం సిద్ధించి టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి ఏకపక్షంగా సాగిన ఉమ్మడి మహ బూబ్‌నగర్ జిల్లా రాజకీయాలు గత కొన్ని రోజులు కొనసాగుతు న్న నేతల వలసల కారణంగా రసవత్తరంగా మారాయి. ఇన్నా ళ్లు అధికార పార్టీలోకి మాత్రమే వలసలు కొనసాగగా తాజా గా కాంగ్రెస్, బిజెపిలోకి సైతం వలసల పర్వం మొదలైంది. 2019 ఎన్నికలే టార్గెట్‌గా ఆయా పార్టీలకు చెందిన బడా నాయకులు పార్టీ బలోపేతంపై దృష్టి సారిం చారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రానున్న ఎన్నికల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీల నేతలు అసంతృప్తులకు గాలం వేసే పనిలో నిమగ్న మయ్యారు. ఇన్నాళ్లుగా టిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో అధికార పార్టీలోకి భారీగా వలసలు కొనసాగాయి. సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారమే లక్షంగా ఆయా పార్టీలు సైతం వలసల పర్వానికి తెరలేపాయి.దీంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

మొన్నటి వరకు ఒకపార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు వేరే పార్టీలో చేరుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన బడా నేతలు సైతం వలసలు, చేరికల కార్యక్రమాలతో బిజీ బిజీగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తు న్నారు.పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిని సారించి అధిష్టానం సైతం ఉమ్మడి జిల్లా నాయకులకు పూర్తిస్థాయిలో పార్టీ ఫిరాయింలకు సహకరిస్తుంది. దీంతో ఉమ్మడి జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తాజా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎక్కడ చూసిన ఆయా పార్టీల కు చెందిన నేతలు పార్టీలు మారుతున్నారనే చర్చే ప్రధానంగా వినిపిస్తుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా ఉమ్మడి జిల్లాలో మాత్రం అయా పార్టీలు ఎన్నికల ప్రణాళికలను రచిస్తున్నారు. అందులో భాగం గానే పార్టీలను పటిష్టవంతం చేసేందుకు వలసలను ప్రోత్సహిస్తూ వివిధ పార్టీల కు చెందిన కార్యకర్తలను తమ పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.

ఓ వైపు వేరే పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాలమేస్తూనే మరో వైపు తమ పార్టీలోకి కార్యకర్తలు జంప్ కాకుండా పక్కా ప్రణాళిక లు అమలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల స్థితిగతులు మారిపోతున్నాయి. మారు తున్న రాజకీయ పరిణామాలతో ఉమ్మడి జిల్లాలోని గ్రా మాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం సంతరించు కుంది. పోటాపోటీగా ఆయా పార్టీల్లోకి చేరికలు జరిగిపోతున్నాయి.

దీంతో ఉమ్మడి జిల్లా రాజకీయా లు రసవత్తరంగా మారాయి. ప్రధానం అధికార టిఆ ర్‌ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ల మధ్య పోటీ అధికంగా కనిపిస్తుంది. రెండు పార్టీలకు చెందిన నేతలు పార్టీ బలోపేతానికి గ్రామీణస్థాయి నుంచి ప్ర త్యేక శ్రద్ధను ఉంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు. కార్యక ర్తల స్థాయి నుంచి బడా నాయకుల వరకు పార్టీలు మారుతు న్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు నడుస్తుండడంతో అసం తృప్త్తి నేతలను ప్రసన్నం చేసుకుని వారిని పార్టీలో చేర్చుకునేందుకు టిఆర్ ఎస్, కాంగ్రెస్ జిల్లా స్థాయి నేతలు పావులు కదుపుతున్నారు.

బలం పుంజుకుంటున్న కాంగ్రెస్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ చాపకింద నీరుగా రోజు రోజుకు తన ఊనికి చాటుకుంటుంది. గ్రామీణస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు టిఆర్‌ఎస్ అసం తృప్తులకు, టిడిపి కార్యకర్తలకు గాలం వేస్తూ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గ ఎంఎల్‌ఎ, టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జిల్లా కాంగ్రెస్‌కు మరింత బలం చేకూంది. రాష్ట్రస్థా యిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చకున్న రేవంత్‌రెడ్డికి జిల్లాలో సైతం మంచి పేరుంది. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతు న్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న రేవంత్‌రెడ్డి అనుచరులు, అభిమానులు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, టిడిపికి చెందిన కార్యకర్తలు, పలువురు నాయకులు సైతం రేవంత్‌బాటలో నడిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి అనుచరులు, అభిమానులే కాక, టిఆర్‌ఎస్‌లో అసంతృప్త నేతలు, మొదటి నుంచి పార్టీలో ఉంటూ ఉద్యమంలో పనిచేసి గుర్తింపు లేని కార్యకర్తలు, ఉద్యమ కారులు కాం గ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ బలం పుంజు కుంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగు తుందని, పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని, భవిష్యత్‌లో ఇంకా చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరనున్నట్లు, జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షాలే టార్గెట్‌గా టిఆర్‌ఎస్ అడుగులు
ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిపక్షాలను లేకుండా చేసి మరోసారి రానున్న ఎన్ని కల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే దిశగా టిఆర్‌ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. కాంగ్రెస్, బిజెపి, టిడిపి నాయకులు, కార్యకర్తలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ జిల్లాలో తమ ఊనికిని చాటుకుంనేందుకు వలసల పర్వాన్ని ప్రోత్సహిస్తుంది. జిల్లా రాజకీయాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్షాలను పూర్తిగా నిర్విర్యం చేయాలనే తలంపుతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు గాలమేస్తుంది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆయా పార్టీల కార్యకర్తలను టిఆర్‌ఎస్‌లో చేర్చకుంటూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అతిపె ద్ద పార్టీగా అవతరించాలని భావిస్తుంది.

సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన బడా నాయకులను, కార్యకర్తలను భారీగా తమ పార్టీలో చేర్చుకున్న టిఆర్‌ఎస్ తాజాగా మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. రేవంత్‌రెడ్డి అనుచరులే టార్గెట్‌గా టిఆర్‌ఎస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. కొడంగల్ నియోజకవర్గంలో తమ పార్టీని బలోపేతం చేసి ఉపఎన్నిక వస్తే ఆ సీటును కూడ తమ ఖాతా లో వేసుకుని రేవంత్‌రెడ్డికి ఝలక్ ఇవ్వాలనే లక్షంతో ప్రణాళికలు రచిస్తోంది. టిడిపిని సైతం ఖాళీ చేయాలని ఆ పార్టీకి చెందిన నాయ కులు, కార్యకర్తలను తమ పార్టీలో చేర్చుకునేందుకు టిఆర్‌ఎస్ జిల్లాస్థా యి నేతలు పావులు కదుపుతున్నారు.

మోడీ పథకాలతో ముందుకెళ్తున్న బిజెపి

కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను గ్రామీణస్థాయిలో ప్రజల్లోకి తీసుకె ళ్తూ, మోడీ ఛరిష్మాను ఉపయోగించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తమ పార్టీని బలోపేతం చేసే దిశగా బిజెపి ముందుకు సాగుతుంది. తెలంగాణ ప్రభు త్వం ఆవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు నిరసనలు, ఆందో ళనలు నిర్వహిస్తూ, రైతుల పక్షాన పోరాడుతూ జిల్లాలో బిజెపి తనదైన ముద్ర వేసు కుని జిల్లాలో పార్టీని పటిష్టంగా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి పార్టీలోకి సైతం జిల్లాలో వలసలు కొనసాగుతున్నాయి. టిడిపి, టిఆర్‌ఎస్‌లకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరుతున్నారు. గ్రామీణస్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున యువకులను పార్టీలోకి చేర్చుకునేందుకు బిజెపి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బిజెపి పూర్వ వైభవం తీసుకువచ్చి రానున్న ఎన్నికల్లో ఎంఎల్‌ఎ, ఎంపీ స్థానాలను కైవసం చేసు కుని తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తమ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా కార్యకర్తలు, యువకులు ముందుకు వస్తున్నా రని, పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, త్వరలోనే మరింత ఎక్కువగా చేరికలు ఉంటాయని బిజెపి నేతలు చెబుతున్నారు.

నానాటికి కనుమరుగవుతున్న టిడిపి

తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీ నానాటికి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. టిడిపి పార్టీకి పెద్దదిక్కులా పనిచేసిన బడా నాయకులు ఇప్పటికే వేరే పార్టీలోకి జంప్ కావడంతో కార్య కర్తల పరిస్థితి అయోమయంలో పడింది. టిడిపిలో ఉంటే తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి అధికార టిఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపిలో చేరేందుకు జిల్లాలోని టిడిపి కేడర్ మొగ్గుచూపుతున్నారు. రేవంత్‌రెడ్డి టిడిపిని వీడడంతో మరింత బలహీనంగా పార్టీ తయారైంది. రేవంత్‌రెడ్డి పార్టీలో ఉన్నంతకాలం కొంత ఆశతో ఉన్న కార్యకర్తలు ఆయన పార్టీ మారడంతో తమ దారి తాము చూసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. పార్టీలో తమకు భరోస ఇచ్చే వాళ్లు లేరని కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. జిల్లాలో మిగిలిపోయిన బడానాయకులు కార్యకర్తలకు అండగా ఉండి పార్టీని బలోపేతం చేసే దిశగా తీసు కెళ్లడంతో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో టిడిపి దాదాపుగా తుడిచిపెట్టుకుపో యే పరిస్థితి కనిపిస్తుంది.

టిడిపిలో కొందరు రేవంత్‌రెడ్డి బాటలో నడుస్తూ కాంగ్రెస్ లో చేరగా, మరికొందరు అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరితే భవిష్యత్ బాగుటుందని భావించి ఆ పార్టీలో చేరుతున్నారు. జిల్లాలో మిగిలిపోయిన టిడిపి కేడర్ సైతం ఆయోమయంలో పడిపోయింది. తాము పార్టీలో ఉంటే తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, తమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో టిడిపి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కొంత మంది టిడిపి నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా ఆశించినస్థాయిలో ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. గ్రామస్థాయిలోని కార్యకర్తలు టిడిపి పార్టీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. వలసలను నివారించాలని ప్రయత్నించిన ఫలితం మాత్రం శూన్యం. దీంతో కొంతమంది బడానాయకులు సైతం వేరే పార్టీలో చేరేందుకు తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు సమాచారం.