Home జాతీయ వార్తలు రాజకీయాల్లోకి మాధురి..బిజెపి తరఫున బరిలోకి

రాజకీయాల్లోకి మాధురి..బిజెపి తరఫున బరిలోకి

 

ముంబై: బాలీవుడ్ అందాల నటి మాధురీ దీక్షిత్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారా? అవుననే అంటున్నాయి బిజెపి వర్గాలు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని పుణె స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా మాధురీ దీక్షిత్ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీ చేపట్టిన సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా మాధురీ దీక్షిత్‌ని ముంబైలోని ఆమె నివాసంలో కలుసుకుని మోడి ప్రభుత్వ విజయాలను వివరించారు. పుణె లోక్‌సభ స్థానానికి మాధురి పేరును పరిశీలిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర సీనియర నాయకుడు ఒకరు వెల్లడించారు.

పుణె లోక్‌సభ స్థానంలో ఆమెకు విజయావకాశాలు అధికంగా ఉంటాయని ఆయన చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో పుణె లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి బిజెపి కైవశం చేసుకుంది. ఈ స్థానంలో బిజెపి అభ్యర్థి అనిల్ షిరోలె మూడు లక్షలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. మాధురీ దీక్షిత్‌ని పోటీ చేయించాలన్న పార్టీ ప్రతిపాదన గురించి బిజెపి సీనియర నాయకుడు ఒకరు వ్యాఖ్యానిస్తూ ఇలాంటి ఎత్తుగడలు ప్రధాని మోడీకి కొత్త కాదని అన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన కొత్తలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులందరినీ మార్చివేసి పార్టీకి మోడీ లబ్ధి చేకూర్చారని ఆయన గుర్తు చేశారు. 2017లో ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సిట్టింగ్ కౌన్సిలర్లు ఎవరికీ టిక్కెట్లు ఇవ్వకుండా కొత్త వారిని నిలబెట్టి విజయాన్ని దక్కించుకున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. కొత్త ముఖాలను పరిచయం చేయడం తప్పేమీ కాదని, ప్రతిపక్షం దిగ్భ్రాంతి చెందడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు.

Madhuri Dikshit To Contest Pune LS As BJP Candidate, BJP shortlists Madhuris name for Pune LS seat for 2019 polls