Home ఎడిటోరియల్ రైతును ముంచిన మధ్యప్రదేశ్ పథకం

రైతును ముంచిన మధ్యప్రదేశ్ పథకం

frmr

రైతుల రక్షణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భావాంతర్ భుగ్తాన్ యోజన’ పథకంపై రైతులు ఎదురు తిరుగుతున్నారు. ఈ పథకం వచ్చాక వ్యాపారులు ధరలను పడగొడుతున్నారని వారు ఆరోపిస్తు న్నారు. పంటల ధరలు పడిపోకుండా రైతులను కాపాడడం ఆ పథకం అసలు ఉద్దేశం. కానీ అమలు ప్రారంభం నుంచీ పథకం తడబడుతోందనే చెప్పాలి. వ్యాపారులు కూటములుగా ఏర్పడి కృత్రిమ పద్ధతులలో ధరలను అణచి ఉంచడాని కి ఆ పథకం వీలు కల్పిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సోయాబీన్ వంటి పంటల ధరలను పడిపోయేలా వ్యాపారులు కుమక్కు అవుతున్నారన్నది వారి ఆరోపణ.గడచిన జూన్‌లో పడిపోతున్న ధరలపట్ల రైతుల నిరసనలకు తలొగ్గి మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ నిరసనలు హింసారూపంధరించి, అయిదుగురు మరణించడంతో ప్రభుత్వం ఆందోళన చెందింది. రాజకీయంగా పరిస్థితి చేయిజారుతోందని భావించిన రాష్ట్రప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. గోధుమ, వరి పంటలను భారీ స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలుచేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మునుపు సరఫరా చేసేవారు. అప్పటిదాకా అన్ని ఇతర రాష్ట్రాలవలె ఖరీఫ్, రబీ సీజన్లో పండించే 25రకాల పంటలకు కేంద్రం ప్రకటించే మద్దతు ధరపైనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆధారపడి ఉండేది. ధరలు పడిపోతున్నాయని రైతులు ఆందోళన చెందితే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆ పంటలను కనీస మద్దతు ధరకు వారు అమ్ముకోవచ్చు.
ప్రభుత్వ ఏజెన్సీలు సాగించే పంటల సేకరణ ఆరోపణలు, వివాదాల్లో కూరుకొని కుంటుబడింది. ఈ లోపాలను పూడ్చాలని ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకొని కొత్త పథకాన్ని తెచ్చింది. ఆరంభంలో 8 పంటలకు దానిని వర్తింపజేసింది. ఈ పథకం క్రింద కనీస మద్దతు ధరను మార్గదర్శక సూత్రంలా ప్రభుత్వం భావిస్తోంది. అయితే రైతు నుంచి అది నేరుగా పంటను కొనుగోలు చేయదు. కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని పూడ్చడానికి రైతుకు పరిహారం చెల్లిస్తుంది. మధ్యప్రదేశ్‌లో, మరి రెండు ఇతర పొరుగు రాష్ట్రాలలో ఏదైనా పంట సగటు అమ్మకం ధర ఆధారంగా ఈ మొత్తాన్ని ఆ పంట సీజన్ చివర్లో లెక్కగడుతుంది. ‘భావాంతర్..’పథకం వర్తించే 8 పంటలలో అయిదింటికి ‘అమ్మకాల విండో’ను గత నెల 16 న తెరిచారు. అది వచ్చే నెల 15 లేదా 31 దాకా తెరిచి ఉంటుంది.ఈ పథకం కోసం రైతులు నమోదు కావలసి ఉంది. రిజిస్టరైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లలోనే తమ పంటలను వారు అమ్మాలి. ఈ పథకం వర్తించే కీలక పంటలలో సోయాబీన్ కూడా ఉంది. దేశంలో ఆ పంట ను అత్యధికంగా పండించే రాష్ట్రం మధ్యప్రదేశ్. కానీ రైతులు తాము పండించిన సోయాబీన్‌ను మార్కెట్‌కు తీసుకుపోయేసరికి ధరల పతనం, అరాచకం ఎదురవుతోంది. ధరలు పడిపోయేలా చేయడానికి కొత్త పథకం వ్యాపారులకు బాగా ఉపయోగపడుతోందని రైతులు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. ఆ పథకాన్ని ప్రకటించినపుడే ఆ భయాలు ఉన్నా యి. రైతు నమోదు పత్రాలను చూపించగానే వ్యాపారులు వేలం పాటలో తమ ధరను బాగా తగ్గించి రూ.200, రూ.300గా చాటుతారు.అక్టోబర్ నుంచి వ్యవసాయ మార్కెట్లలో కృత్రిమంగా ధరలను పడగొట్టే పద్ధతులు అమలవుతున్నట్లు ప్రాంతీయ మీడియా ప్రకటించడం మొదలుపెట్టింది.ఆ తరువాత మళ్లీ సోయాబీన్ రైతుల నిరసనలు మిన్నంటాయి. వ్యాపారుల కుమ్మక్కును ప్రభుత్వం తప్ప ఇతరులు ఎవరూ నిరూపించలేరు. రాజకీయ సంబంధాల దన్నుతోనే వ్యాపారులు ఆ కుమ్మక్కు వ్యవహారాలు సాగిస్తారు కనుక అవి ఎన్నటికీ బయటపడవు. వ్యాపారులు కూటమి కట్టడమే సోయాబీన్ ధర పతనానికి కారణమని పేరు చెప్పడానికి ఇష్టపడని మధ్యప్రదేశ్ సీనియర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి ఒకరు చెప్పారు. మొత్తం సోయాబీన్‌ను చమురుగా మార్చే కర్మాగారాల సొంతదార్లు ఆ రాష్ట్రం అంతటా ఏడుగురు ఉన్నారు. సోయాబీన్ మార్కెట్‌లో సగం వారి నియంత్రణలో ఉంటుంది. వారు తమకు అనుకులంగా ఆ పంట మార్కెట్ ధరను మాయ పద్ధతుల్లో నిర్ణయిస్తారు. మధ్యప్రదేశ్ అనాజ్ తిల్హాన్ వ్యాపారీ మహాసంఘ్ కార్యదర్శి గోపాల్ దాస్ ఈ విషయాలు చెప్పారు.
ఆ రాష్ట్రంలోని ఆరు జిల్లాల అత్యంత ముఖ్యమైన మార్కెట్ల అమ్మకాల సమాచారాన్ని విశ్లేషించగా గత ఐదేళ్ల లో అతి తక్కువకు సోయాబీన్ ధర పడిపోయినట్లు తేలింది. మరో ఆందోళనకర అంశం ఏమిటంటే అమ్మకాల కొనుగోలు విండోను మార్కెట్‌లో తెరిచిన వెంటనే ఆ పంట ధర పతనం మొదలయింది. ఈ అంశమే అధికంగా రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉదాహరణకు ఇండోర్ మార్కెట్‌లో అమ్మకాల విండో ఈ పంటల కాలానికి అక్టోబర్ 16న మొదలు కాగానే ధర అత్యధికంగా క్వింటాల్ రూ.2800 అందుకొంది. అయితే నవంబర్ 15 నాటికి అది రూ. 2000కు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో సోయాబీన్ క్వింటాల్ ధర రూ.3000 చూసింది. 2015లో కూడా క్వింటాల్ సగటున రూ.3500 దాటింది. అంటే మధ్యప్రదేశ్ ప్రభు త్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం రైతులకు రక్షణ కల్పించకపోగా వ్యతిరేకంగా పని చేస్తోంది.
సాధారణంగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 14 దాకా సోయాబీన్ ధర పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఆదిలో ఆ పంట తడిగా ఉంటుంది. ఆరిన కొద్దీ ధర పుంజుకుంటుంది. కేవలం గిరాకీ, సరఫరా పరిస్థితే కాక దేశీయ మార్కెట్‌లో ఇతర వంటనూనెల ధరల పరిస్థితి కూడా సోయాబీన్ ధరపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. సోయాబీన్ ఉత్పత్తి దారుల సంఘం ఇండోర్‌లో ఇటీవల జరిపిన ఒక మహాసభ ఈ విషయమై చర్చించింది. చౌక గా లభించే వంట నూనెల దిగుమతిని ప్రభుత్వం అధికంగా సాగిస్తుండడంతో స్థానిక మార్కెట్‌లో పోటీ తట్టుకోలేకపోతున్నామనీ ఆ సంఘం అధ్యక్షుడు దావిష్ జైన్ తెలిపారు. 2015 నుంచి అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల నుంచి సోయాబీన్ దిగుమతులు ఎక్కువైనట్లు వ్యాపారులు చెప్పారు. దీనితో ప్రపంచ వ్యాప్తం గా సోయాబీన్ ధరల మాంద్యం ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ధరలు ఎంత తక్కువగా ఉన్నాయంటే ఆ ప్రభుత్వాలు రైతులకు తగినంత ఆదాయం అందించలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మహా రాష్ట్ర రైతులకు పోటీగా పరిణమించిన ‘సోయాబీన్’ దిగుమతులను ప్రభుత్వం కట్టడి చేయాలని నిపుణులు కోరుతున్నారు.

                                                                                                                                                                       * మృదులాచారి