Home వరంగల్ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత

banot-sankarnayakమానుకోటలో పలు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
కెసిఆర్ ఫ్లెక్సీకి బుల్లెట్ బాధితుల క్షీరాభిషేకం

మహబూబాబాద్: టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు శిక్షణా కేంద్రాల నిర్మాణం, ఒక్కసారే రుణమాఫీకి ఏర్పాట్లు చేస్తూ రైతు సంక్షేమ ప్రభుత్వంగా కార్యక్రమాలు చేపడుతోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. పట్టణంలో రూ.60లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు శిక్షణా కేంద్రం భవన నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎప్పటిక ప్పుడు నూతన వంగడాలు, వ్యవసాయ పద్దతుల్లో వచ్చే మార్పుల గురించి సూచనలు, సలహాలు, శిక్షణలు ఇచ్చే విధంగా రైతు శిక్షణా కేంద్రం సద్వినియో గపడు తుందన్నారు.

సిసిరోడ్డుకు శంకుస్థాపన
పట్టణంలోని మున్సిపల్ 26వ వార్డు పరిధిలో రూ.4లక్షల15వేల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వార్డు కౌన్సిలర్ చౌడారపు రంగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మానుకోట పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా అభివృద్దిపథంలో నిలుస్తుందన్నారు.

కెసిఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మానుకోట రైల్వేస్టేషన్ ఘటనలో తెలంగాణ ద్రోహుల బులెట్ తూటాలకు గాయపడ్డ బాధితులకు 11మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున, అందులో బలంగా గాయాలైన ఇద్దరికి ఆరు లక్షల రూపాయలు చొప్పున టిఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం మంజూరైన సందర్భంగా గాయపడ్డ ఇమాం, పౌల్‌రాజ్, శోభన్, హచ్చా తదితరులు కెసిఆర్ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సమక్షంలో క్షీరాభిషేకం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక సంఘటనకు కారణమైన జగన్ ఓదార్పు యాత్రలో తెలంగాణ ద్రోహుల బులెట్‌లకు గాయపడ్డ తెలంగాణ ఉద్యమకా రులను కెసిఆర్ గుర్తుంచుకుని ఆదుకోవడంపట్ల ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు.

బడుగు బలహీన వర్గాలకు డబుల్‌బెడ్‌రూంల నిర్మాణం, సన్నబియ్యం, త్రాగడానికి వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా, వృద్దులు ఆసరా, వికలాంగులు, వితంతువులకు, వృద్ద కళాకారులకు పింఛన్లు, కళాకారులకు ఉద్యోగాలు కల్పించి స్వాతంత్య్రం వచ్చాక మహాత్మాగాంధీ కన్న కలలు నిజంచేసే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పానల కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇంతటి అభివృద్ది కాంగ్రెస్, టిడిపిపార్టీలకు కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆత్మపరిశీలన చేసుకుంటే ఎస్‌ఆర్‌ఎస్‌పి, దేవాదుల, కంతనపల్లి ప్రాజక్టుల ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చారో చెప్పాలన్నారు. బిందెలతో కెసిఆర్ ఫ్లెక్సీకి క్షరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో టిఆర్‌ఎస్ నాయకులు ఎర్రంరెడ్డి సిద్దార్ధరెడ్డి, చంద కృష్ణ, కౌన్సిలర్లు ఎండి ఫరీద్, డోలి లింగుబాబు, వెన్నమల్ల విజయలక్ష్మి,నిమ్మల శ్రీను, నాయకులు రామకృష్ణారావు, ఆదిల్‌పాష, మైలా చంద్రమౌళి, మెడికల్‌బాబు, డిఇ రాజ్‌కుమార్, ఎఇ సత్యనారాయణరెడ్డి, చాంద్ తదితరులు పాల్గొన్నారు.