Home తాజా వార్తలు మార్చి 2, 10న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు

మార్చి 2, 10న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు

Parliamentary Election Meetings

 

2న వరంగల్ పార్లమెంట్ సమావేశాలు
10న మహబూబాబాద్ పార్లమెంట్ సమావేశాలు
కెటిఆర్ అధ్యక్షతన కొనసాగునున్న సమావేశాలు
సమాయత్తం అవుతున్న టిఆర్‌ఎస్ శ్రేణులు 

మనతెలంగాణ/వరంగల్: పార్లమెంట్ ఎన్నికల సమయం ఆసన్నం కావడం అన్ని రాజకీయ పక్షాలు అలర్ట్ అవుతున్నాయి. టిఆర్‌ఎస్ పార్టీ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఆ సమావేశాలకు సన్నద్ధం కావడానికి స్థానిక నాయకత్వాన్ని ఏర్పాట్లలో మునిగిపోతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం మార్చి 2న నిర్వహించడానికి తేదీని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మార్చి 2న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంతో పాటు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని దాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై కార్యకర్తలకు, నాయకులకు దశ దిశను నిర్దేశించనున్నారు.

మార్చి 10న మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి కెటిఆర్ హాజరవుతుండగా ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఇతర ప్రజాప్రతినిధులు క్రియాశీల కార్యకర్తలు పాల్గొంటారు. టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెటిఆర్ ఎన్నికైన వెంటనే వరంగల్ పర్యటనను చేపట్టారు. ఉద్యమాలకు ఊపిరిలు ఊదిన గడ్డ నుండే వర్కింగ్ ప్రసిడెంట్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెడతానని చెప్పి వరంగల్ పర్యటనతో రాష్ట్రస్థాయి సమావేశాలను నిర్వహించారు. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల కార్యక్రమాన్ని కూడా ముందుగా కరీంనగర్‌లో ప్రారంభించి రెండవరోజు వరంగల్‌లో ప్రారంభిస్తున్నారు. తెలంగాణలోని 16 పార్లమెంట్ స్థానాల్లో వరంగల్ పార్లమెంట్ స్థానాలు రెండు ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పార్లమెంట్ స్థానాల నుండి టిఆర్‌ఎస్‌కు చెందిన ఎంపిలే కొనసాగుతున్నారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సీట్లను గెలిపించడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకరావడానికి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మొన్న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పాలకుర్తి ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలను కట్టబెట్టారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎర్రబెల్లి జరుగుతున్న అసెంబ్లీలో కూడా నూతన పంచాయతీ రాజ్ చట్టం బిల్లును ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా రాజకీయాల్లో అపార అనుభవాన్ని కలిగిన నేతగా దయాకర్‌రావు పేరుంది. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న తరుణంలో వస్తున్న పార్లమెంట్ ఎన్నికలు ఆయనకు సవాల్‌గా నిలుస్తున్నాయి.

జిల్లాలో ఇప్పటి వరకు మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి 12 నియోజకవర్గాల ఎంఎల్‌ఎలను, ఇద్దరు ఎంపిలను సమన్వయ పరిచి జరిగిన అన్ని ఎన్నికల్లో విజయపతాకాన్ని ఎగురవేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఎర్రబెల్లి మంత్రిగా రావడం ఆయన నాయకత్వంలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరుకానున్నారు. కెటిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల శ్రేణులు ఒకే తాటిమీదికి వచ్చి రెండు పార్లమెంట్ సీట్లను గెలిపించుకునేందుకు ఒకటిగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రూపులు, వర్గాలు, వైశమ్యాలు, నేతలు పక్కనబెట్టాల్సి ఉంది.

జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ హవా కొనసాగి భారీ మెజార్టీతో 12 అసెంబ్లీ స్థానాలకు 10 అసెంబ్లీ స్థానాలు టిఆర్‌ఎస్ గెలుచుకొంది. ప్రస్తుతం అదే హవా పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగాలనేది అధిష్ఠానం నిర్ణయంగా ఉంది. దాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక నేతలు ప్రజల నుండి ఎంత మేరకు ఓట్లు వేయించి సక్సెస్ అవుతారనేది చూడాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం తరువాత నియోజకవర్గాల వారిగా క్షేత్రస్థాయి ఎన్నికల కార్యక్రమం ప్రారంభం కానుంది. దాని కోసమే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే నియోజవర్గాల వారి సమావేశాలు పూర్తి చేయడానికి సంసిద్ధులైనట్లు తెలిసింది.

పార్లమెంట్ ఎన్నికల వరకు జిల్లా అధ్యక్షుల నియామకం జరిగేనా..?
టిఆర్‌ఎస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడానికి పార్టీ వ్యవస్థాపకులు కెసిఆర్ వర్కింగ్ పార్టీ ప్రసిడెంట్‌ను కెటిఆర్‌కు అప్పగించి రాష్ట్రంలో యువరక్తాన్ని వేడెక్కించారు. కెటిఆర్ నియామకంతో పార్టీ భవిష్యత్తుపై దిశ నిర్దేశం చూపినట్లు అయిపోయింది. అయితే కెటిఆర్ వర్కింగ్ ప్రసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించి జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం త్వరలోనే పూర్తి చేస్తామని హామీనిచ్చారు. జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందే జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం జరుగుతుందా..? పార్లమెంట్ ఎన్నికల తరువాత జరుగుతుందా..? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు నియోజకవర్గస్థాయిలో, ఇన్‌చార్జ్‌లను నియమించిన పార్టీ ప్రస్తుతం నియోజకవర్గస్థాయి ఇన్‌చార్జ్ పదవులను ఎత్తివేసి జిల్లా పదవులకే మొగ్గుచూపుతుంది. దీనివల్ల ఒక్క జిల్లాల్లో రెండు నుండి నాలుగు నియోజకవర్గాల పరిధి ఉంటుంది. జిల్లా అధ్యక్షులే అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తే కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉన్నందున పార్లమెంట్ ఎన్నికల తరువాతనే జిల్లా అధ్యక్ష పదవులను నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ పరిశీలకులు పేర్కొంటున్నారు.

Mahabubabad Parliamentary Election Meetings on 10th