Home లైఫ్ స్టైల్ మహద్‌ ఒక నిరంతర దీర్ఘయాత్ర

మహద్‌ ఒక నిరంతర దీర్ఘయాత్ర

lf

మానవ హక్కుల, పౌర హక్కుల ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర వహించిన నేత, అగ్రకుల దౌష్ట్యానికి వ్యతిరేకంగా పోరాడిన దళితుల విమోచనోద్యమ సారధి ప్రజానాయకుడు బొజ్జా తారకం. అభ్యుదయ రచయితగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. తారకం కలం నుండి జాలువారిన మరో మంచి పుస్తకం ‘మహద్ ఒక నిరంతర దీర్ఘయాత్ర’ తారకం గారి జయంతి సందర్భంగా ఇటీవల షేర్డ్ మిర్రర్ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో మహద్, దండి పోరాటాల వాస్తవ కథనం ఖచ్చిత వ్యాఖ్యానం ఆసక్తిదాయకంగా ఉంది. తారకం ఐదు దశాబ్దాల పోరాటం, తాత్త్విక చింతనకు సాక్షీభూతం ఈ పుస్తకం. రెండు చారిత్రక ఉద్యమాల నేపథ్యం. ఇద్దరు ప్రజానాయకుల పోరాట నేపథ్యం, వైరుధ్యాలు, నాడు, నేడు ఆ ఉద్యమాల ప్రాసస్త్యం, ఉపయోగిత ఈ పుస్తకంలోని విషయాలు. మహద్ పుస్తకానికి ముందు అనేక వైవిధ్య అంశాలపై రాసిన కులం, వర్గం (1996) నది పుట్టిన గొంతుక (1983), నేల‘నాగలి’ మూడెద్దులు, దళితులు రాజ్యం (2008), నాలాగే గోదారి, పంచతంత్రం (2012) గ్రంథాలు దళిత పోరాటాల పట్ల తారకం అంకిత భావాన్ని వ్యక్తం చేశాయి. వాస్తవాల కూర్పులో నిర్భీతి, స్పష్టమైన భావాల పొందిక, సూటిగా నిక్కచ్చిగా చేసే వ్యాఖ్యానం తారకం సొంతం.
చరిత్రలో ఏ ఒక్క సంఘటనను మరో దానితో పోల్చలేమని గ్రంథాలు తెల్పుతూనే ప్రజల్ని ప్రభావితం చేసిన మహద్, దండి ఉద్యమాల ప్రాధాన్యతను తగ్గించకుండా వాటి విశేషాల్ని వైరుధ్యాల్ని చక్కగా ఈ పుస్తకంలో వివరించారు తారకం. మహద్, దండి ఉద్యమాలు ప్రత్యేకత కలిగినవి. మహద్ 19 మార్చి నుండి డిసెంబర్ 25, 1927 వరకు డా॥ బి.ఆర్. అంబేద్కర్ సారథ్యంలో జరిగిన మానవ హక్కుల పోరాటం, దండి సత్యాగ్రహంగాంధీ నాయకత్వంలో మార్చ్ 12 నుండి ఏప్రిల్ 6, 1930 వరకు సాగిన శాసన ఉల్లంఘన ఉద్యమం.
బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో దండి ఒక భాగమైతే మహద్ వేలాది సంవత్సరాలుగా సమాజం లో పాతుకునిపోయిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిందని తారకం రాశారు.
దండి సత్యాగ్రహం కన్నా మూడేళ్ళ ముందే మహద్ పోరాటం జరిగినా, చరిత్ర పుటల్లో కానీ, ప్రధాన స్రవంతి రచనల్లో కానీ మహద్ గురించి చాలా మందికి తెలియదు. చరిత్రకారులు సామాజిక విశ్లేషకులు కూడా దండి సత్యాగ్రహాన్ని వలసవాద, సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్యమ ఘట్టంగా కీర్తిస్తూ మహద్ పట్ల ఒక నిశ్శబ్దాన్ని ప్రకటించారు. గాంధీ, దండి కథలు కథలుగా ప్రజల్లో వ్యాపిస్తే అంబేద్కర్, మహద్ కేవలం దళిత చరిత్రకే పరిమితమైనాయని తారకం పేర్కొన్నారు.
మహద్ తాగునీటి హక్కుకై చేసిన పోరాటమైతే, దండి ఉప్పు పై హక్కు కోసం చేసినది. రెండూ ప్రాథమికావసరాలనే ఉద్దేశించి జరిగాయని చెప్తూ తారకం ఒకటిసాంప్రదాయ, ఛాందసవాద హైందవ సమాజ కట్టుబాట్లును ఎదురించి క్రూరమైన కుల వివక్షకు, అంటరాని తనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాగా, మరొకటి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా, వారి నిరంకుశ చట్టాల్ని వ్యతిరేకిస్తూ వారి పాలన అంతం కోసం ఉద్దేశించి జరిపిన ఉద్యమమనీ ఒకటి చట్టం సాయంతో కోల్పోయిన హక్కుల్ని తిరిగి పొందడానికి ఉద్దేశించి చేస్తే మరోటి చట్టాల్ని ఉల్లంఘించి చేసిన పోరాటం అని రాసారు. మహద్‌లో మానవీయ కోణం ఉంటే, దండికి రాజకీయ ప్రయోజన ముందనీ తారకం తెల్పారు.
తారకం రెండు ఉద్యమాల చారిత్రక నేపథ్యంగా వివరిస్తూ, మహద్ గ్రామంలో దళితులకు కనీస మానవ హక్కులు నిరాకరించబడ్డాయని, మహద్ మునిసిపాలిటీకి చెందిన చౌదర్ ట్యాంకు నీటిని పశువులు తాగొచ్చని దళితులు తాగరాదనే అగ్రకుల అహంకారాన్ని ధిక్కరించిన అంబేద్కర్ ఉద్యమబాట పట్టాడు. ఎస్.కె. బోలే మహద్ చెరువు నీరు దళితులు వాడుకునే హక్కులకై తీర్మానాన్ని 1923లో ప్రతిపాదించగా, 1926లో మహద్ మునిసిపాలిటీ ఆమోదించింది. ఆ హక్కులు సాధించే ప్రయత్నంగా అంబేద్కర్ మహద్ పోరాటానికి సమాయత్తమైనాడని తారకం పేర్కొన్నారు.
దండి విషయానికొస్తే బ్రిటీష్ వారి శాసనాలకు అనేకసార్లు భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడింది. స్వాతంత్య్రం అంతిమ లక్ష్యంగా ఉప్పు సత్యాగ్రహం ద్వారా శాంతియుత అంతిమ పోరాటానికి సిద్ధంకావాలని గాంధీ ప్రబోధించారు. ఈ దిశగానే దండి సత్యాగ్రహాన్ని చేపట్టారు.
నేపథ్యంలోనే ఇంత భిన్నత్వం ఉంటే రెండు ఉద్యమాల సన్నాహాల్లో మరింత వైరుధ్యం కన్పిస్తుందని తారకం పేర్కొన్నారు. మహద్ పోరాటం ముందు మార్చ్ 1920లలో సభల కోసం ఎలాంటి ముందస్తు సన్నాహాలు ఆర్భాటాలూ లేవనీ, వందలమైళ్ళు ప్రయాణం చేసి మహారాష్ట్ర, గుజరాత్ నుండి నలుమూలల నుండి వచ్చిన పదివేల మంది దళితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారనీ, అగ్రకులాల వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కనీసం తాగునీరు కూడా వందల రూపాయలు వెచ్చించి కొనవలసి వచ్చిందనీ, భోజన సదుపాయం లేనందున ఎవరికి వారు రొట్టెల మూటలు భుజాన వేసుకొని తరలి వచ్చారనీ తెల్పారు. పక్కా ప్రణాళికతో సుశిక్షుతులైన సబర్మతీ ఆశ్రమ వాసులు దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారనీ, నీటికీ, భోజనానికీ ఎటువంటి లోటు లేకుండా, దండి యాత్ర పొడవునా, గ్రామస్తులు చూసుకున్నారని భారీ సన్నాహాల నడుమ గాంధీ యాత్ర సాగిందనీ మొత్తం మీద 79 మంది మాత్రమే సత్యాగ్రహంలో పాల్గొన్నారని తారకం రాశారు. దండి, మహద్ పొరాటాల్లో ప్రస్ఫుటంగా కన్పించే మరో అంశం స్త్రీల భాగస్వామ్యం. ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ 79 మంది పురుషుల్లో కేవలం ఐదారుగురు స్త్రీలకే గాంధీ అనుమతి ఇచ్చారు, అందునా వారు ప్రత్యక్ష సత్యాగ్రహంలో పాల్గొనరాదని, సహాయకులుగానే ఉండాలని గాంధీ ఆదేశించారు. వాస్తవానికి స్త్రీలకు కూడా ఈ విషయం నచ్చలేదు. ఆనాటి నాయకురాలైన దుర్గాబాయి దేశ్‌ముఖ్ గాంధీ ఆదేశం కోసం ఉత్తరం రాసి, అనుమతి రాకపోవడంతో స్వచ్ఛందంగా తాను ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నారు. దీనికి భిన్నంగా మహద్ పోరాటంలో స్త్రీల భాగస్వామ్యం ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. ఉద్యమాల్లో స్త్రీలు అనుచరులుగా కాక సమాన భాగస్వాములుగా పాల్గొనాలని అంబేద్కర్ ప్రబోధించారు. తన అన్ని పోరాటాల్లో స్త్రీలు ముందుండే పోరాడాలని ప్రోత్సహించేవారు. మానవ హక్కుల ఉద్యమమైన మహద్‌లో భాగంగా స్త్రీలకు హక్కుల్ని నిరాకరించిన మనుస్మృతి దహనం చేపట్టారు. మహద్ సత్యాగ్రహం ద్వారా అంబేద్కర్ రెండు లక్ష్యాల్ని సాధించారని ఒకటి హైందవ సమాజ నియంత్రణను ఎదిరించడం, రెండు న్యాయ సూత్రాల ధిక్కారం అని తారకం పేర్కొన్నారు. దండి సత్యాగ్రహం పట్ల మొదట్లో ప్రభుత్వం స్పందించలేదు. కానీ మహద్ సత్యాగ్రహం తర్వాత దళితులు అగ్రకుల దాడికి, దౌర్జన్యాలకు గురైనారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న దళితులపై పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
మహద్ సత్యాగ్రహం తర్వాత వీరేశ్వర్ ఆలయాన్ని కూడా దళితులు ముట్టడిస్తారన్న వదంతి వల్ల అగ్రకులస్థులు వారిపై దాడికి దిగారు. అంతేకాక చెరువు నీరు అంబేద్కర్ చేతిలో మలినమైందనీ, టన్నులకొద్ది ఆవుపేడ, మూత్రంతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. వీరి చర్య అంబేద్కర్‌ను తీవ్రంగా కదిలించిందనీ, అంటరాని తనానికి వ్యతిరేకంగా దీర్ఘపోరాటానికి ఇంకా సన్నద్ధం చేసిందనీ తారకం రాశారు. దళితుల ఆలయ ప్రవేశ పోరాటాలపై గాంధీ మౌనాన్ని కూడా తారకం తన రచనలో విమర్శించారు.దండి సత్యాగ్రహంలో గాంధీ తన అనుచరులకు ఉప్పు కోసం కాదు బ్రిటీష్ వారి నుండి స్వాతంత్య్రం కోసం పోరాడాలని పిలుపు ఇవ్వగా అంబేద్కర్ తన వారికి కేవలం నీటి హక్కు కాదు, ఆత్మగౌరవ హక్కుకై పోరాడాలని పిలుపిచ్చారు. దండి అప్పటికే కొనసాగుతున్న జాతీయోద్యమ చివరి పోరాట ఘట్టం కొనసాగింపైతే, మహద్ జాతీయ విముక్తి ఉద్యమానికి నూతన కోణాన్నిచ్చింది.
మహద్ చెరువు ప్రక్కన అంబేద్కర్ విగ్రహం, ఒక పానెల్‌ను స్మారక చిహ్నాలుగా నిర్మించారు. ప్రతియేటా వేలాదిమంది డిసెంబర్ 25 మనుస్మృతి దహన దివస్ పాటించడమే కాక, మార్చ్ 19 దళిత మానవ హక్కుల దినంగా జరుపబడుతున్నది. దండిలో కూడా స్మారకం కట్టబడింది. చారిత్రక పోరాటానికి సాక్ష్యంగా నిలిచిన దండి కాలగమనంలో తన ప్రాధాన్యత కోల్పోగా, మహద్ సమానత్వం, మానవ హక్కుల గౌరవ సూచకంగా నిలచి ఉంటుందని తారకం పేర్కొన్నారు. మానవ స్వేచ్ఛ, గౌరవాలు ఉల్లంఘించబడినంత వరకూ వేలవేల మహద్ మార్చ్‌లు ఉద్భవిస్తూనే ఉంటాయని దండి గత పోరాట చిహ్నం కాగా, మహద్ ప్రస్తుత సమాజంలో ఏదో ఒక మూల నిత్యం ఈ దీర్ఘయాత్ర సాగుతున్నదనీ తారకం 2011లో ఈ పుస్తకం లో రాసుకున్నారు. మహద్ జరిగి తొంభై ఏళ్ళు కావస్తున్నా నిరంతరంగా జరిగే దళితుల ఆత్మగౌరవంలో మహద్ పోరాటాలు ఇంకా మనల్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఈ మార్చ్‌కు ముగింపెన్నడని….?

ఆచార్య ఇ.సుధారాణ్టి