Home ఎడిటోరియల్ మలేషియా ప్రజల మహాతీర్పు

మలేషియా ప్రజల మహాతీర్పు

edt

మలేషియా ఎన్నికల్లో 92 సంవత్సరాల మహతీర్ ముహమ్మద్ కు ప్రజలు పట్టం కట్టారు. ప్రపంచంలో అతి పెద్ద వయస్కుడైన పాలకుడయ్యాడు. మహతీర్ ముహమ్మద్ గెలుపు కేవలం మలేషియాలోనే కాదు మొత్తం ఆగ్నేయాసియా రాజకీయాలపై ప్రభావం వేయవచ్చు. మహతీర్ బిన్ ముహమ్మద్ మలేషియాను ఇంతకు ముందు సుదీర్ఘకాలం పాలించిన నాయకుడు. ఆయన 1981 నుంచి 2003 వరకు 22 సంవత్సరాలు నిరవధికంగా మలేషియాను పరిపాలించాడు. 1946లో యునైటెడ్ మాలేస్ నేషనల్ ఆర్గనైజేషన్ పార్టీ తరఫున రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో మలేషియా నాయకుడు తుంకు అబ్దుర్రహ్మాన్‌తో విభేదాలొచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అబ్దుర్రహ్మాన్ రాజీనామా చేసిన తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి 1976లో ఉపప్రధానిగాను, 1981లో ప్రధానిగాను పదవీ బాధ్యతలు స్వీకరించారు. మలేషియాను ప్రగతి బాటన నడిపించిన ప్రధానిగా పేరుపొందారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర పాశ్చాత్యదేశాలకు మింగుడుపడని నాయకుడాయన. సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత 2003లో రిటైర్మెంట్ ప్రకటించారు. కాని 2015లో అవినీతి కుంభకోణాలు వెలుగు చూసిన తర్వాత మలేషియా ప్రధానిగా ఉన్న ఒకప్పటి తన అనుయాయుడు నజీబ్ రజాక్ ను తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. చివరకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి 60 సంవత్సరాలుగా మలేషియాను తిరుగులేకుండా పాలిస్తున్న పార్టీని గద్దె దించారు.
మహతీర్ ముహమ్మద్ 1990లలో ప్రధానిగా ఉన్నప్పుడు మలేషియా అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రగతి సాధించింది. పొరుగున ఉన్న ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పిన్స్ తదితర దేశాల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ సమస్యగా మారుతున్న కాలంలో మలేషియాలో మాత్రం లిబరల్ ఇస్లాంకు పెద్దపీట వేసిన నేతగా కూడా పేరు పొందారు. పొరుగున ఉన్న థాయ్‌లాండ్ టెర్రరిస్టు దాడులతో అతలాకుతలం అవుతున్న కాలంలో కూడా మలేషియా ప్రశాంతంగా ఉంది. రిటైర్మెంట్ తర్వాత ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసిందని అందరూ భావించారు. ప్రధాని నజీబ్ రజాక్ ను ఆయన ఎంత విమర్శించినా, ప్రభుత్వాన్ని గద్దెదించడం ఆయనకు సాధ్యం కాదని అనుకున్నారు. కాని తొంభై రెండేళ్ళ వయసులో అద్భుతమైన విజయం సాధించి ప్రభుత్వాన్ని గద్దె దించాడు.
ఆర్థికంగా పతనం అంచున ఉన్న మలేషియాను మళ్ళీ ప్రగతి బాటన నడిపించే నాయకుడు ఆయనే అని ప్రజలు నమ్మారు. అవినీతి, కక్షసాధింపు రాజకీయాలు కాదు ప్రజాసంక్షేమమే ముఖ్యంగా ప్రజలు భావించారు. నజీబ్ రజాక్ పై ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అవినీతి కుంభకోణాల వల్ల మలేషియా ప్రతిష్ఠ కూడా అడుగంటింది. పైస్థాయిలో అవినీతి మాత్రమే కాదు దేశంలో అధికారయంత్రాంగంలోనూ అవినీతి గూటుకట్టుకుంది. ఈ ఎన్నికలకు ముందే మహతీర్ ముహమ్మద్ తనకు పదవులపై వ్యామోహం లేదని స్పష్టంగా ప్రకటించారు. 22 సంవత్సరాలు దేశాన్ని పాలించిన నాయకుడు, 92 సంవత్సరాల వయసులో ఈ మాటలు చెబుతున్నప్పుడు ప్రజలు సహజంగానే నమ్మారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రధాని పదవిలో తాను కొనసాగేది కూడా ఉండదని, కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటానని, అన్వర్ ఇబ్రాహీంకు రాజు నుంచి క్షమాభిక్ష లభించిన తర్వాత ఆయన్ను ప్రధానిగా చేసి తాను తప్పుకుంటానని కూడా చెప్పారు. విచిత్రమేమంటే, అన్వర్ ఇబ్రాహీంను జైలు పాలు చేసింది కూడా మహతీర్ ముహమ్మదే. మలేషియన్ ఇస్లామిక్ యూత్ మూమెంట్ నాయకుడిగా ఉన్న అన్వర్ ఇబ్రాహీంను 70లలో రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మహతీర్ ముహమ్మద్. అన్వర్ ఇబ్రాహీం ఉపప్రధాని స్థాయికి ఎదిగారు. తన తర్వాత అన్వర్ ఇబ్రాహీం ప్రధాని అవుతారని అప్పట్లో కూడా మహతీర్ ముహమ్మద్ చెప్పేవారు. కాని ఆసియాలో ఆర్థిక సంక్షోభం కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత అన్వర్ ఇబ్రాహీంను పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించడం, చివరకు ఆయన్ను కేసుల్లో ఇరికించి అరెస్టు చేయడం వరుసగా జరిగిపోయాయి. అప్పటి నుంచి అన్వర్ ఇబ్రాహీం జైల్లోనే ఉన్నాడు. అన్వర్ ఇబ్రాహీంను తప్పించిన మహతీర్ తర్వాత నజీబ్ రజాక్ తదితర నాయకులను ప్రోత్సహించారు. అదే తాను చేసిన తప్పని ఇప్పుడాయన భావిస్తున్నారు. అన్వర్ ఇబ్రాహీంకు పూర్తి క్షమాభిక్ష లభించేలా ప్రయత్నించి ఆయన్ను ప్రధానిగా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మలేషియా ఎన్నికల్లో అత్యధికంగా 82 శాతం పోలింగ్ జరిగింది. ప్రజలు మార్పు కోరుతున్నారనడానికి ఇది కూడా నిదర్శనం. ప్రజలు పోలింగ్ బూతులకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటు వేసినట్లు తెలుస్తోంది. అధికారపక్షాన్ని గద్దె దించాలన్న బలమైన ప్రజాభిప్రాయం ఈ ఎన్నికల్లో కనబడింది. మహతీర్ ముహమ్మద్ పనితీరు తెలిసిన విశ్లేషకులు ఆయన అవినీతి కుంభకోణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని, నజీబ్ రజాక్ పై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తారని భావిస్తున్నారు. ఇప్పుడు మలేషియా రాజకీయ నాయకులు, అధికారుల్లో ఈ భయం పట్టుకుంది. చాలా మందిపై వేటు తప్పదని భావిస్తున్నారు. ఇంతకుముందు 1981 నుంచి 2003 వరకు ఆయన పాలించినప్పుడు ఫలితాలే ముఖ్యమన్నట్లు పాలించాడు. ఆర్థికరంగాన్ని చక్కదిద్దడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. ఆయన రాజకీయ ధృక్కోణం సాంప్రదాయిక రాజకీయాలకు భిన్నమైనది. అలాగే ఆయన కఠినమైన పాలకుడుగా కూడా పేరుపొందాడు. పాశ్చాత్య ప్రజాస్వామ్య భావనకు, మహతీర్ ముహమ్మద్ ఆలోచనలకు మధ్య చాలా తేడా ఉంది. ఆగ్నేయాసియా దేశాల్లో అవినీతిని నిర్మూలించడానికి వినూత్నమైన, విభిన్నమైన ప్రజాస్వామిక సరళి అవసరమని వాదించేవారు. అవినీతిని అంతం చేయడానికి కొద్దిపాటి నిరంకుశ ధోరణి అవసరమన్నట్లు ఆయన వ్యవహరిస్తారు. ఫలితాలు సాధించడానికే ప్రాముఖ్యం ఇచ్చే ఆయన పరిపాలనలో కఠినమైన నిర్ణయాలు భవిష్యత్తులో ఉంటాయని చాలా మంది అభిప్రాయం.
అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయన బలమైన నాయకుడిగా పేరుపొందారు. చైనా వంటి పెద్ద దేశంతో మాట్లాడినా బలమైన స్వరంతోనే మాట్లాడారు. మాలేలను ఆర్థికంగా అణచేయడానికి చైనీయులు ప్రయత్నిస్తున్నారని 70లలో తీవ్రమైన ఆరోపణతో చైనాపై విరుచుకుపడిన నాయకుడు. ఇప్పుడాయన ప్రధానిగా అధికారంలోకి వచ్చాడు కాబట్టి చైనాతో మలేషియా సంబంధాల్లో చాలా మార్పు రావచ్చు. చైనా విషయంలో ఆయన మెతకగా వ్యవహరించే నాయకుడు కాదు. ఆసియాన్ దేశాలకు కూడా ఆయన వంటి రాజకీయవేత్త మలేషియా ప్రధానిగా రావడం వల్ల చాలా ప్రయోజనమే ఉంది. ఈ ప్రాంతం ప్రయోజనాలకు తప్ప మరి దేనికి ప్రాముఖ్యం ఇవ్వని నాయకుడాయన. మలేషియాతో భారతదేశానికి 1950 నుంచి సత్సంబంధాలున్నాయి. మహతీర్ ముహమ్మద్ కాలంలోను, ఇప్పుడు గద్దె దిగిన నజీబ్ రజాక్ కాలం వరకు చక్కని సంబంధాలే కొనసాగాయి. దాదాపు 36 బిలియన్ అమెరికన్ డాలర్ల వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. గతంలో మలేషియా మనకు మద్దతిచ్చిన దేశం. మహతీర్ ముహమ్మద్ ప్రధానిగా వచ్చిన తర్వాత కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత గట్టిపడతాయని పలువురు భావిస్తున్నారు. మలేషియా రాజకీయాల్లో బలమైన మార్పుకి చిహ్నంగా మహతీర్ ముహమ్మద్ ఎన్నికల్లో గెలిచారు. ఈ ఎన్నికల ప్రభావం పొరుగుదేశాలపై కూడా ఉండవచ్చు.