Friday, March 29, 2024

ఆపదలో ఆదర్శ పథకం

- Advertisement -
- Advertisement -

నిరుపేద గ్రామీణ శ్రామిక జనానికి పనులు కల్పించి ఆదుకోడానికి ఉద్దేశించిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం నీరుగార్పిస్తున్న తీరు బాధాకరంగానే కాదు, జుగుపాకరంగానూ వుంది. తరచూ అర్ధాకలితో కాలం వెళ్లబుచ్చే వర్గాలకు గ్రామ పంచాయతీల ద్వారా అభివృద్ధి పనులలో ఉపాధి కల్పించడానికి అనేక సంవత్సరాలుగా ఉపయోగపడుతున్న ఈ పథకానికి చరమ గీతం పాడడమే బిజెపి పాలకుల అంతిమ ఉద్దేశమని తెలుస్తున్నది. తొమ్మిదేళ్ళ క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దీని తల నరికివేత తప్పదనే సూచనలు వెలువడ్డాయి. కాని గ్రామీణ పేద ప్రజల్లో ఈ పథకానికి అప్పటికే నెలకొన్న మంచి పేరును దృష్టిలో వుంచుకొని దానిని కొనసాగనివ్వాలని తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయించారు.

అదే సమయంలో వీలు చిక్కినప్పుడల్లా దాని కాళ్ళూ, చేతులూ విరిచేసే నిర్వాకానికి పాల్పడ్డారు. ఈ పథకం కింద శ్రామికులకు, అవసర సామగ్రికి అంతవరకు 60:40 గా వున్న కేటాయింపులను 2014లోనే 51:49 గా మార్చి వేశారు. అలాగే అది అమలయ్యే బ్లాకుల సంఖ్యను కూడా 2500కి తగ్గించి వేశారు. ఆ తర్వాత ఒక్కొక్క నిరుపేద కూలినాలి కుటుంబంలో ఒకరికి ఏడాదికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించి తీరాలనే నిబంధనను కూడా నీరసపరిచారు. పనిని ఒక హక్కుగా కల్పించిన ఈ పథకాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక భద్రతా పథకంగా గుర్తించారు. గ్రామీణాభివృద్ధి కృషిలో అత్యున్నత ఉదాహరణగా పేర్కొనదగిన పథకమని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, భూమి అభివృద్ధి పనులు, చెక్ డ్యాంలు, నీటి పొదుపు ట్యాంకులు వంటి వాటిని నిర్మించడానికి పేదల శ్రమను వినియోగించుకోడం దీని లక్షం. సామాజికంగా అణచివేతకు గురై అణగారిపోయి వున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసిలను ఆదుకోడంలో ఇది ఎంతో ఉపయోగపడుతున్నది. ఇటువంటి పథకానికి తాజా (202324) కేంద్ర బడ్జెట్‌లో నిధులను భారీగా కోసివేసి రూ. 60 వేల కోట్లకే పరిమితం చేశారు. 30 శాతానికి పైగా కోత కోశారు. 25 శాతం నిధులు బకాయిల చెల్లింపుకే సరిపోతాయి.

వాస్తవ నిధుల వినియోగం ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరులోగాని వెల్లడి కాదు. అది మరింత తక్కువగా వుండే సూచనలే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2.72 లక్షల కోట్లు కేటాయించాలని ఈ పథకం కోసం పోరాడుతున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ సంఘర్ష్ మోర్చా డిమాండ్ చేసింది. 202223 సవరించిన బడ్జెట్ ప్రకారం ఈ పథకం కింద రూ. 89 వేల 400 కోట్లు ఖర్చు చేయవలసి వుంది. అందులో ఇంకా రూ. 6157 కోట్లు విడుదల చేయనే లేదని వార్తలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసిపోడానికి గట్టిగా 50 రోజులు కూడా లేదు. ఆలోగా ఎన్ని నిధులు విడుదల చేస్తారో, ఎంత సొమ్ముకు చెయ్యిస్తారో చెప్పలేము. ఇటీవలి వరకు దారుణంగా పీడించిన కరోనా కష్ట కాలంలో గ్రామీణులనే కాదు పట్టణాలలో, నగరాలలో లాక్‌డౌన్ వల్ల ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయి తిరిగి గ్రామాలకు వలస కట్టిన వారిని కూడా ఇది ఆదుకొన్నది.

పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ మహిళల సాధికారత కల్పన, పల్లెల నుంచి పట్టణాలకు వలసలను అరికట్టడం వంటి సమున్నత లక్షాల సాధనలో ఉపాధి హామీ పథకం నిర్వర్తిస్తున్న పాత్ర అమోఘం అనడం అతిశయోక్తి కాదు. దేశ పౌరులందరికీ పని హక్కు కల్పించడానికి కృషి చేయాలని ఆదేశిక సూత్రాల్లోని రాజ్యాంగ అధికరణలు 41, 42 లో స్పష్టం చేసిన ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చే దిశగా అవతరించిన ఈ పథకాన్ని జీవచ్ఛవం చేయడం కంటే రాజ్యాంగ ద్రోహం మరొకటి వుండదు. పని హక్కు కల్పన రాజ్యాంగం 21వ అధికరణ హామీ ఇస్తున్న జీవన హక్కులో ప్రధాన భాగమనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. జీవన హక్కు అంటే ఏదో విధంగా బతికే హక్కు మాత్రం కాదు.

ఆత్మగౌరవంతో బతికే హక్కునే జీవన హక్కుగా సుప్రీంకోర్టు నిర్వచించింది. గ్రామాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి తదితర అణగారిన సామాజిక వర్గాలకు చెందిన పేదలు భూసంపద గల పైవర్గాల వారిచ్చే పనుల మీద ఆధారపడి మాత్రమే బతుకుతూ వుంటారు. అటువంటి వారికి ఏ పనీ లేకపోతే నేనున్నానంటూ ఈ పథకం ఉపాధిని హామీ ఇస్తున్నది. దీని వల్ల వారు పై వర్గాల వద్ద అణగిమణిగి ఉండి తీరాల్సిన దుస్థితి నుంచి బయటపడ్డారు. అందుచేతనే ఈ పథకం వచ్చిన తర్వాత కూలి రేట్లు పెరిగిపోయి వ్యవసాయ ఖర్చులు మితిమించిపోయాయని పైవర్గాల వారు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఉపాధి హామీ పథకాన్ని రైతుల వ్యక్తిగత వ్యవసాయ పనులకు మళ్ళించాలనే డిమాండ్ బయలుదేరింది. సామాజికంగా, ఆర్థికంగా నిటారుగా నిలబడలేని వారి వెన్నెముక అనదగిన పథకాన్ని బిజెపి పాలకుల కుట్ర నుంచి కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News