Home సినిమా రిషిగా ప్రయాణం మొదలు

రిషిగా ప్రయాణం మొదలు

Mahesh Babu unveils Maharshi

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘మహర్షి’ అని పేరు పెట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహేష్ 25వ చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మహేష్ 43వ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు ఫిల్మ్‌మేకర్స్. ఈ ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే సినిమా టీజర్‌ను మహేష్ తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా షేర్ చేశాడు. “మీ ప్రేమ, దీవెనలకు చాలా సంతోషంగా ఉంది. రిషిగా నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఇక 42 సెకండ్ల టీజర్‌తో మహేష్ మ్యాజిక్ చేశాడు. ఓ బ్యూటిఫుల్ కాలేజ్… అక్కడ స్టూడెంట్‌గా మహేష్ చేతిలో ల్యాప్‌పట్టుకొని నడుచుకుంటూ వెళ్తాడు. అతన్ని చూసి అమ్మాయిలు మైమరచిపోతారు. ఇక ఈ చిత్రంలో రిషిగా ఓ డిఫరెంట్ రోల్‌లో, కొత్త లుక్‌లో మహేష్ ప్రేక్షకులు, అభిమానులను అలరించనున్నారు. డెహ్రాడూన్, హైదరాబాద్, గోవాలలో షెడ్యూల్స్ జరుపుకున్న ఈ భారీ చిత్రం నిర్మాణం ఏకధాటిగా జరుగుతోంది. 2019 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కామెడీ హీరో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె.యు.మోహనన్ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ ఈ చిత్రానికి సాంకేతిక వర్గం.
ప్రముఖుల శుభాకాంక్షలు…
మహేష్ బర్త్‌డే సందర్భంగా ‘మహర్షి’ టైటిల్, ఫస్ట్‌లుక్, టీజర్‌లను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో అతని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే రిషిగా నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నానని అంటూ మహేష్ చేసిన ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఈ సూపర్‌స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బర్త్‌డే విషెస్ ట్వీట్స్‌లో కొన్ని…
హ్యాపీ బర్త్‌డే మహేష్ అన్నా.. మీకు ఈ ఏడాది విజయవంతంగా ఉండాలని, మీరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్
హ్యాపీ బర్త్‌డే ఎవర్ గ్రీన్ వన్ అండ్ ఓన్లీ మహేష్‌బాబు. బ్లాక్‌బస్టర్ సినిమాలతో మీకు ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. రకుల్‌ప్రీత్ సింగ్
హ్యాపీ బర్త్‌డే మహేష్. ‘మహర్షి’ చిత్రం మీ కెరీర్‌లో పెద్ద హిట్ అవుతుంది. మీ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. పూజా హెగ్డే
నాకు అత్యంత ఆప్త మిత్రుడు, సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. కొరటాల శివ
అందగాడు, నిగర్వి, శాంతమూర్తి, మానవతావాది అయిన ప్రియమైన మహేష్‌కు సూపర్ మ్యూజికల్ హ్యాపీ బర్త్‌డే. మీరు ఎల్లప్పుడూ విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. మీ 25వ చిత్రంలో భాగస్వామినయినందుకు గర్విస్తున్నా.
దేవిశ్రీ ప్రసాద్
ఈ ‘రవి’ నుంచి ‘రిషి’కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సర్. ‘మహర్షి’ సినిమాలో నేనూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఓ మైలురాయి. అల్లరి నరేష్