Home జగిత్యాల మహిమాన్వితం… కొండగట్టు అంజన్న క్షేత్రం

మహిమాన్వితం… కొండగట్టు అంజన్న క్షేత్రం

god

* 500 ఏళ్ల క్రితం ద్విముఖాలతో స్వయంభూగా వెలసిన స్వామివారు
* భక్తులు కోరిన కోర్కెలను తీర్చే కొండగట్టు అంజన్న
* దినదిన ప్రవర్ధమానమవుతున్న ఆలయం
* ఏటేటా పెరుగుతున్న హనుమాన్ దీక్షాపరులు
* అంజన్న దర్శనానికి తండోప తండాలుగా తరలివస్తున్న భక్త జనం

మన తెలంగాణ/జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం మహిమాన్వితమైనది. ఎక్కడాలేని విధంగా కొం డగట్టులో స్వామి వారు నరసింహస్వామి, ఆంజనేయస్వామి ముఖాలతో 500 ఏళ్ల క్రి తం స్వయంభూగా వెలిశారు. కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. సంతానం లేని వారు, శారీరక, మానసిక, గ్రహ బాధలతో బాధపడేవారు స్వామి సన్నిధిలో మం డల కాలం తపస్సు చేస్తే వారి పీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. స్వామి వారి దర్శనానికి మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన భక్తులతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అంజన్న క్షేత్రం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ప్రతి మంగళ, శని, సోమ వారాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా కొండపై భక్తులకు కావాల్సిన సౌకర్యాలు మెరుగుపడాల్సి ఉంది. ప్రతి యేటా కొండగట్టులో చైత్ర పౌర్ణమి రోజున చిన్న హన్మాన్ జయంతి, వైశాఖ బహుళ దశమి రోజున పెద్ద హన్మాన్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొండగట్టు క్షేత్రం కాషాయమయంగా మారిపోతుంది. అన్నిదారులు కొండగట్టుకే అన్నట్లు ఏ దారిలో చూ సిన హన్మాన్ భక్తులే కనిపిస్తారు. భక్తులు 11, 21, 41 రోజు ల హన్మాన్ దీక్షలు తీసుకుని, హన్మాన్ జయంతోత్సవాల రోజున మాల విరమణ చేసుకుంటారు. సూదూర ప్రాంతాల నుంచి హనుమాన్ దీక్షాపరులు కాలినడకన కొండగట్టుకు చేరుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి యేటా హన్మాన్ దీక్షాపరుల సంఖ్య పెరుగుతోందని, దీక్షాప రులు లక్షల సంఖ్యలో చేరుకుంటారని ఆలయ అధికారులు, అర్చకులు పేర్కొంటున్నారు.
స్థల పురాణం
ఐదు వందల సంవత్సరాలకు పూర్వం కొడిమ్యాల పరిగణాలలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఉన్నట్లుం డి ఆ మందలోని ఓ ఆవు తప్పిపోయింది. ఆవు కోసం సంజీవుడు ఉత్తర దిశలో వెతికి వేసారి ఓ చింత చెట్టు నీడన పడుకున్నాడు. అతడికి స్వామివారు కలలో కనిపించి ఓ యాద వా… నేనిక్కడి కొరంద చెట్ల పొదల్లో ఉన్నాను… నాకు ఎం డా, వానా, ముండ్ల నుంచి రక్షణ కల్పించు… ఫలానా వైపు వెళ్తే నీ మంద నుంచి తప్పిపోయిన ఆవు కనిపిస్తుందని స్వామివారు చెప్పడంతో నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచిన సంజీవుడు ఇది కలయా…? నిజమా…? అనుకుని స్వామి చెప్పిన మార్గంలో వెళ్లి ఆవుకోసం వెతకడం ప్రారంభించాడు. కొ రంద పొదల్లో కోటి సూర్యుల కాంతితో విరజిమ్మే ఆ పవిత్ర పవనసుతుడు సంజీవుడికి కనిపించగా ఆయనలో ఒక్కసారిగా భక్తిభావం పొంగిపొర్లింది. అతడి కళ్లలోంచి ఆనంద భాష్పాలు రాలి స్వామివారి పాదాలను తడిపాయి. అంతలోనే కొంతదూరం నుంచి ఆవు అంబా అంటూ తన వైపు రావడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయా యి. తన చేతిలో ఉన్న గొడ్డలితో కొరంద పొదను తొలగించి స్వామివారికి తన శక్తి కొలది ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆ తర్వాత కొడిమ్యాల వాస్తవ్యుడైన కీర్తిశేషులు కృష్ణారావు దేశ్‌ముఖ్ పదహారు స్తంభాలతో మూ డు ఆలయాలు, మూడు గోపురాలతో మంటప నిర్మాణం చే సినట్లు తెలుస్తోంది. ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలో స్వామి వారికి రెండు ముఖాలుండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఈ దేవాలయం అనేకమైన కొండలు, గుట్టలు, దట్టమైన అరణ్యంలో వెలిసింది. చుట్టూ పెద్దపెద్ద కొండలతో ఉండి ఆ కొండల మీద ఒక చిన్న గట్టు ఉండటం వల్ల ఈ క్షేత్రానికి కొండగట్టు అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. లక్ష్మణుడు రావణ యుద్ధంలో మూర్చపోగా ఆంజనేయస్వామి సంజీవ ని ఔషధం కోసం సంజీవని పర్వతం తీసుకుని వెళ్తుండగా అందులోంచి ఒక కొండ భాగం రాలి ఈ కొండల్లో పడటం వల్లే అది కొండగట్టు అయిందని చెప్పుకుంటారు. సంజీవని పర్వతం నుంచి కొంత భాగం రాలి పడటం వల్ల శారీరక, మానసిక, గ్రహ బాధలు ఉన్నవారు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఒకే మండపంలో మూడు వేర్వేరు గర్భగుడులు:
కొండ గట్టు క్షేత్రంలో ఒకే మండపంలో మూడు వేర్వేరు గర్భగుడులు ఉన్నాయి. మధ్యలో శ్రీ ఆంజనేయస్వామి ఉం డగా, కుడిపక్కన శ్రీవేంకటేశ్వరస్వామి, ఎడమ పక్కన అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయానికి వెనుక వైపు బేతాళుడు క్షేత్ర పాలకుడిగా ఉన్నారు. బేతాళుడికి దక్షిణ దిశలో శ్రీరా మపాదుకలు, వీటికి ఎదురుగా కూర్చుని సీతమ్మ తన కష్టాలను తలుచుకుంటూ ఏడ్వగా ఆమె కన్నీటి చుక్కలు బండపై పడగా ఆ గుర్తులు నేటికి ఉన్నాయి. దక్షిణం వైపు బొజ్జ పోత న్న, ఆలయానికి ఈశాన్య భాగాన పంచ గుండాలు గల పెద్ద కోనేరు ఉంది. ప్రకృతి సిద్ధమైన పొడవైన బండరాతి పరుపు ల మధ్యన వెలిసిన ఈ ధర్మ గుండంలో భక్తులు స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు.
1994 నుంచి పెరుగుతున్న భక్తుల రద్దీ:
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు భక్తులు 1994కు ముందు అంతంత మాత్రంగానే వచ్చేవారని తెలుస్తోంది. 1994లో ఆలయ పునర్నిర్మాణం చేసి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారిచే చక్రప్రతిష్ఠ, 1995లో అష్టోత్తర శతకుండాత్మక యాగం, 1996లో రాజగోపుర ప్రతిష్ఠ చేసిన తర్వాత ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని అర్చకులు,అధికారులు పేర్కొంటున్నారు. 1994 నుంచి ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతోందని, క్షేత్రం లో అంతంత మాత్రంగా ఉన్న వసతి సౌకర్యాలు పెరిగి భక్తుల ఇబ్బందులు తీరిపోయాయని వారు చెబుతున్నారు.
కొత్త వాహనం కొంటే ముందు కొండగట్టుకే:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరు కొత్త వాహనం కొనుగోలు చేసినా ముందు కొండగట్టుకు వెళ్లి అక్కడ వాహన పూజ చేయించుకుంటారు. ద్విచక్రవాహనం మొదలుకుని ప్రొక్లైన్‌ల వరకు అంజన్న క్షేత్రంలో వాహన పూజలకు వస్తుంటాయి. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు పూజకు బారులు తీరుతున్నాయంటే భక్తులు స్వామివారిని ఏ స్థాయిలో నమ్ముతున్నారో తెలుస్తోంది. కొండగట్టులో వాహన పూజకు బంధుమిత్రులందరినీ తీసుకెళ్లి విందు భోజనం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దాంతో కొండగట్టు కింది ప్రాంతంలో ఎక్కడ చూసినా విందు భోజనాలే కనిపిస్తాయి.
అంజన్నకు ముడుపు కడితే విజయమే:
కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడు పు కడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, విజయం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో స్వామి వారికి పోటీ పడి ముడుపులు కడతారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ముడుపు కట్టి కోరిన కోర్కెలు తీరిన తర్వాత, విజయం సా ధించిన తర్వాత ఆలయంలో కట్టిన ముడుపును విప్పి స్వా మి వారికి చెల్లించుకుంటారు.
కొండగట్టుకు వస్తే మానసిక రోగం మాయం:
మానసిక రోగంతో బాధపడే వారు కొండగట్టుకు వచ్చి స్వామి సన్నిధిలో గడిపితే రోగం నయమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మానసిక రోగులను వారి కుటుంబ సభ్యు లు కొండగట్టుకు తీసుకొచ్చి స్వామి వారి భజన కార్యక్రమాల్లో పాల్గొనేలా, తీర్థ ప్రసాదాలు స్వీకరించేలా చూస్తారు. ప్రతి రోజు ఆలయం వద్ద పదుల సంఖ్యలో మానసిక రోగు లు కనిపిస్తారు. మానసిక రోగులు భక్తులపై దాడులు చేయకుండా, తప్పించుకుని పోకుండా ఉండేందుకు వారిని కు టుంబ సభ్యులు గొలుసులతో బంధిస్తారు. మండల కాలం పాటు స్వామి సన్నిధిలో ఉంటే తప్పక నయమవుతుందని బాధితుల కుటుంబ సభ్యులే పేర్కొనడం గమనార్హం.
సుదూర ప్రాంతాల నుంచి కాలి నడకన
హన్మాన్ దీక్షలు తీసుకునే వారి సంఖ్య ప్రతి యేటా పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో భక్తులు హన్మాన్‌దీక్షలు తీసుకుంటున్నారు. 11, 21, 41 రోజుల దీక్షలు తీసుకుని దీక్షా సమయం పూర్తి కాగానే కొండగట్టుకు కాలినడకన చేరుకుని స్వామి సన్నిధిలో మాల విరమణ చేస్తారు. నిప్పులు కురిపిస్తున్న ఎండను లెక్క చేయకుండా నిప్పుల కొలిమిలా మారిన తారు రోడ్లపై కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ స్వామివారిపై తమకు ఉన్న భక్తిని చాటుకుంటున్నారు హన్మాన్ దీక్షా పరులు. ఎక్కువగా చిన్న హన్మాన్ జయంతి, పెద్ద హన్మాన్ జయంతి రోజున మాల విరమణ జరిగేలా భక్తులు దీక్షలు తీసుకుంటారు. గ్రామాల నుంచి భక్తులు బృందాలుగా ఏర్పడి పాదయాత్ర ప్రారంభిస్తారు. దాంతో చిన్న హన్మాన్ జయంతి, పెద్ద హన్మాన్ జయంతోత్సవాల సమయంలో రోడ్లన్నీ హన్మాన్ దీక్షా పరులతో రద్దీగా మారుతాయి. ఏ రోడ్డు వెంబడి చూసినా పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్న హన్మాన్ దీక్షా పరులే కనిపిస్తారు.