Home ఆఫ్ బీట్ ప్రజారవాణా, రోడ్డు భద్రతకు పెద్దపీట

ప్రజారవాణా, రోడ్డు భద్రతకు పెద్దపీట

ప్రజా రవాణా, రోడ్డు భద్రతకు పెద్ద పీట వేస్తామని, తెలంగాణను ప్రమాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో తెలిపారు.

Untitled-1

రవాణా శాఖలో గడచిన నాలుగేళ్లలో జరిగిన ప్రగతి గురించి వివరిస్తారా?

రవాణా శాఖను ఆధునికతకు మారు పేరుగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఐటి సేవలను పూర్తిగా వినియోగించుకుని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతాం. ఓవైపు రవాణా సేవలతో పాటు మరో వైపు ప్ర భుత్వ ఆదాయ వనరుల్లో రవాణాశాఖ మూడో స్థానం దిశగా సాగుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాం.

ఆర్‌టిసి బలోపేతానికి తీసుకుంటున్న చర్యలేంటి?

గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా ప్రజా రవాణాలో కీలక భూమిక పోసిస్తున్న ఆర్‌టిసిని అప్పుల ఊబి నుండి బయటపడేలా చేస్తున్నాం. కోట్లాది నిధులను కేటాయించి జవజీవాలను నింపుతున్నాం. ‘ఈ గవర్నెన్స్’కు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మరిన్ని విస్తృత సేవలను అందేలా చూస్తున్నాం. తెలంగాణ రవాణాశాఖ దేశంలోనే తొలి రాష్ట్రంగా నగదు చెల్లింపులు లేని ఆన్‌లైన్ సేవలను అందిస్తూ ఆదర్శంగా నిలిచింది.

రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవల ఫలితాలు ఎలా ఉన్నాయి?

దేశంలో నగదురహిత చెల్లింపులను ప్రొత్సహించేలా ఐటి సేవలను విస్తృతపరిచాం. దళారుల ప్రాబల్యం, ప్రభావం తగ్గిస్తూ ప్రజలకు సేవలను అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోం ది. 59 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. గత ఏడాది 20 లక్షల డ్రైవింగ్ లైసెన్సులను జారీచేశాం. 18 లక్షల వాహన రిజిష్ట్రేషన్‌లు, 3 లక్షల వాహన పర్మిట్‌లు, 35 లక్షల ఇతర సేవలను అందిస్తు న్నాం. రోజుకు 34 వేల సేవలను పౌరులకు అందించే వ్యవస్థగా రవాణ శాఖ పనిచేస్తోంది.

రవాణా శాఖలో ఎం వ్యాలెట్ వినియోగం ఎలా ఉంది?

రవాణా శాఖలో ఎం–వ్యాలెట్ మొబైల్ యాప్ కొత్త ఒరవడిని సృష్టించింది. వాహన సమాచారంతో పాటు లైసెన్స్ వివరాలన్నీ ఈ యాప్‌లోనే ఉండడంతో డ్రైవింగ్ లైసెన్స్‌లు పోగొట్టుకున్నా, ఇంట్లోనే మర్చిపోయినా బెంగ లేకుండా సెల్‌ఫోన్‌తోనే పరిష్కరించుకునే వీలు కలిగింది. ఈ యాప్‌ను రాష్ట్రంలోని 20 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోవడం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత విస్తృతంగా వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి?

రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత అవగాహనతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం రాష్ట్రంలో కేంద్రం సమాచారంతో రూ. 18 కోట్లతో సిరిసిల్లలో (ఐడిటిఆర్) డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. ఏటా కనీసం 5 వేల మంది యువతకు ఉచిత వసతి కల్పించి డ్రైవింగ్‌లో తర్పీదునిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. యాదాద్రి జిల్లా మల్కాపూర్‌లో ఇప్పటికే రూ. 5 కోట్లతో వాహన సామర్థ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశాం. ప్రభుత్వం త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ ఇలాంటివి నిర్మిస్తుంది.

వచ్చే ఏడాది ప్రాధాన్యతాంశాలేంటి?

రాష్ట్రలో రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలలో ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు క్షతగాత్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఏటా జరిగే 5 లక్షల ప్రమాదాల్లో లక్షన్నర మంది చనిపోతున్నారు. మన రాష్ట్రంలో 20 వేల ప్రమాదాల్లో 7 వేల మంది చనిపోతున్నారు. చనిపోతున్నవారిలో 18-22 ఏళ్ల యువకులే ఎక్కువ. యువత చనిపోవడం రాష్టానికే కాదు, దేశానికి కూడా నష్టదాయకం. అందుకే ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల పట్ల విస్తృతంగా అవగాహన కలిగించాలనుకుంటోంది. నగర రోడ్లపైకి వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటి దాటింది. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రమాద రహిత తెలంగాణగా మార్చాలన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ భావన. ఆ దిశగా అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో ‘రోడ్డు భద్రత క్లబ్’లను ఏర్పాటు చేసి విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్డు భద్రతలో పాల్గొనేటట్లు చేస్తాం. హెల్మెట్లు, సీట్ బెల్టు నిబంధనలను పకడ్బందీ చేస్తున్నాం. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను (డేంజర్ స్పాట్లు) గుర్తించాం. వీటిపై జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రతి మూడు నెలలకు ఒక సారి రోడ్డు భద్రత సమావేశాలు నిర్వహించి ప్రమాదాల మీద విశ్లేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో రోడ్డు భద్రత కౌన్సిల్ సమావేశంలో ప్రమాదాల నివారణ, ప్రాణ రక్షణ, బాధితులకు సహాయక చర్యలు, రోడ్డు భద్రత అవగాహన, రోడ్డు భద్రత నిధి తదితరాల మీద చర్చిస్తూ ప్రమాద రహిత తెలంగాణ కోసం నిరంతరం శ్రమిస్తున్నాం.

నష్టాల్లో ఉన్న ఆర్‌టిసిని గట్టెక్కించేదెలా?

గత పాలకుల నిర్వాకంతోనే ఆర్‌టిసి నష్టాల పాలైంది. సంస్థను సామాజిక కోణంలో అవసరమైన విధంగా ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ భరోసానిస్తున్నారు. బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు ఆర్‌టిసికి అందించారు. రాష్ట్రంలో 97 ఆర్‌టిసి డిపోల్లో 10,613 బస్సులు ఉన్నాయి. 52 వేల మంది సిబ్బంది 3,692 రూట్‌లలో ప్రతి రోజూ 94 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. ఆర్‌టిసి కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి గౌరవించాం. ఈ ఏడాది 1100 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. గత రెండేళ్ల కాలంలో 2400 కొత్త బస్సులు ఆర్‌టిసికి చేరాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 500 ఎలక్ట్రిక్ బస్సులను 38 డిపోల పరిధిలో 17 చొప్పున బయో డీజిల్ వాహనాలను ప్రవేశ పెట్టి కాలుష్యాన్ని నివారించాలనుకుంటున్నాం. ఏసి బస్సులను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా మహబూబ్‌నగర్, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం తదితర ప్రధాన ప్రాంతాలకు జెఎన్‌యూఆర్‌ఎం నిధులతో కొనుగోలు చేసిన 100 ఏసి బస్సులను నడిపిస్తున్నాం. ఆర్‌టిసి బస్టాండ్ల అభివృద్ధికి గత రెండేళ్లలో రూ. 125 కోట్లు కేటాయించి అభివృద్దిచేస్తున్నాం.