Home ఆఫ్ బీట్ సంబురాల సంక్రాంతి

సంబురాల సంక్రాంతి

Sankrathi-photo

వాకిలి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు పాటలు, బసవన్నల ఆటలు, నువ్వుల మిఠాయిలు, ఎగిరే గాలిపటాలు …వీటన్నింటి హడావుడి కలగలిసిందీ సంక్రాంతి పండుగ..  ప్రకృతితో ముడిపడిన తెలుగువారి పండుగ సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యాకాలానికి శ్రీకారం చుట్టే పండుగ సంక్రాంతి. ఆరుగాలమూ శ్రమపడిన రైతు పంటసిరులు చేతికంది పరవశించే రోజు.  పల్లెకు పండుగ కళ తెచ్చేది..నగరాలకు నూతన వెలుగులనిచ్చేది..పంటల పండుగ..పెద్దల పండుగ..మకర సంక్రాంతి. మొక్కుల పండుగ అని కూడా ఈ పండుగకు పేర్లు.  సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే సంక్రాంతికి శ్రీకారం. భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుముగా  నాలుగురోజుల పాటు ఈ పండుగను ఆచరిస్తాం.  ప్రతి ఒక్కరోజు గ్రామీణ ఆటలు, కోడి పందాలు..పతంగుల ఎగరవేయడంలాంటివి  ఉత్సాహంగా జరుపుకుంటారు.

సంక్రాంతికి నెల రోజుల ముందే ముగ్గుల హడావుడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందూ కనువిందు చేసే రంగవల్లులు మహిళల కళాత్మక హృదయానికి నిదర్శనాలు.. ఇంటి ముందు ఆవుపేడతో చిక్కని కల్లాపి చల్లి, అది కొద్దిగా ఆరిన తర్వాత ముగ్గులు పెడతారు. వాటిపై పూలు చల్లి గొబ్బెమ్మలు పెడతారు. రంగవల్లుల వైభవం మాసాంతంలో రథం ముగ్గుతో ముగుస్తుంది. రథానికి తాడులాంటి గీతగీసి పక్కింటివారి రథం ముగ్గుతో కలుపుతారు. ఇలా చివరిరోజు ముగ్గులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమవుతాయి. ఇది అందరి మధ్య ఆత్మీయతకు చిహ్నం. ఈ విధంగా చేయడం వల్ల మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల మక్కువ. ఆరోగ్య రహస్యం మిళితమై ఉన్నాయి. ఆవుపేడతో చల్లిన కల్లాపి, రంగవల్లులు తీర్చిదిద్దటానికి ఉపయోగించే పసుపు, కుంకుమ, సున్నపుపొడుల్లో సూక్ష్మక్రిములను నాశనం చేసే తత్వం ఉంటుంది. బయట నుంచి వచ్చేవారి కాలికి ఉన్న క్రిములను ఇవి విగత జీవులను చేస్తాయి. దీని వల్ల చలికాలపు వ్యాధులను సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు. ఈ ముగ్గుల ప్రక్రియలో ఆడవారి నుంచి అందరూ స్వీకరించాల్సిన ముఖ్యమైన సుగుణాలున్నాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి పనులు చక్కదిద్దుకోవడం చేస్తే రోజంతా హుషారుగా ఉంటారు. దైవ సంబంధమైన పనులు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కుటుంబానికి వ్యాధుల బాధ ఉండదు. ఈ విధంగా సంక్రాంతి స్ఫూర్తిని ఏడాదంతా కొనసాగించాలన్నదే రంగవల్లుల పరమార్థం.

Bhogi-image

భోగభాగ్యాలను ప్రసాదించే భోగి

భోగి మంట వేయడమంటే అగ్నిని ఆరాధించడం. అగ్రకులం, తక్కువ కులం, పేద ధనిక అనే అంతరాలు మరిచి అందరినీ ఒకే దగ్గరకు చేర్చేదే భోగిమంట. ధనుర్మాసం అంతా ప్రతిరోజు ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను ఆ రోజు సాయంత్రం పిడకలుగా మార్చి, అవి ఎండిన తర్వాత పిడకల హారంగా తయారుచేస్తారు. వాటిని భోగి మంటల్లోకి ఉపయోగిస్తారు. హోమం నుంచి వెలువడే ధూమంలో ఎంతటి ఆరోగ్య శక్తి ఉంటుందో , ఆవు పిడకల భోగిమంటల ధూమానికి అంతటి శక్తి ఉంటుంది. చలికి గడ్డకట్టిన శరీరం మామూలు స్థితికి వస్తుంది. భోగిమంటల్లో ఇంటిలోని పాత సామగ్రిని దగ్ధం చేయడం వల్ల వాటిని ఆవాసం చేసుకున్న వ్యాధికారక క్రిములు కూడా నాశనమౌతాయి. కాలం చెల్లిన ఆలోచనలను దగ్ధం చేసి, కొత్త ఆలోచనలు చేసి జీవితాన్ని సరికొత్తగా మలచుకో అన్న సందేశాన్ని భోగిమంటలు మనకిస్తాయి. ఇలా మన ప్రతి సంప్రదాయంలో అర్థం ఉంటుంది. ఇంట్లో 13 ఏళ్లు దాటిన పిల్లలకు ఇదే రోజున భోగిపండ్లు పోస్తారు. ముందుగా నువ్వుల నూనెతో పిల్లలకు నలుగు పెట్టి తలారా స్నానం చేయిస్తారు. శీతాకాలంలో ఇలాంటి స్నానం వల్ల శరీరంపై వ్యాధులను నివారించే రక్షణ కవచం ఏర్పడుతుంది. కొత్త బట్టలు ధరించిన పిల్లలపై రేగిపండ్లు, నాణేలు , అక్షతలు (కొన్ని ప్రాంతాల్లో శనగలు కూడా కలుపుతారు) కలిపి తల చుట్టూ మూడుసార్లు తిప్పి, పిల్లలకు భోగిపండ్లు పోస్తారు. ఈ వేడుకకు చుట్టుపక్కల ఆడవారిని పిలిచి పండు తాంబూలం ఇస్తారు. సూర్యతత్వానికి ప్రతీకైన రేగిపండ్లు శరీరానికి తగిలినా, తిన్నా చలి పారిపోతుంది. హిందూ ధర్మంలో ఆచరించే అన్ని పండుగల్లోనూ దేవుని ఆరాధనా, జీవుని ఆరోగ్యం రెండూ మమేకమై ఉంటాయి.

gangiredhulu

ధనుర్మాసం గొప్పదనం

ధనుర్మాసం అంటే భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి, ఆమె రచించిన పాశురాలు గుర్తుకొస్తాయి. శ్రీరంగనాథుని భక్తురాలైన గోదాదేవి స్వామిలో ఐక్యమైంది భోగి రోజే. అందుకే భోగి రోజు అన్ని వైష్ణవ ఆలయాలలో గోదాదేవి రంగనాథులకు వైభవంగా కల్యాణం జరిపిస్తారు. అంతేకాకుండా రాక్షస చక్రవర్తి అయిన బలిని శ్రీమహావిష్ణువు వామనావతారుడై పాతాళానికి అణగదొక్కిన రోజుకూడా భోగియే. ఈ రోజున దేశంలోని కొన్ని ప్రాంతాలలో వామనుని ఆరాధన జరుగుతుంది. పంటచేలు ఇంటికి రావడానికి రైతన్నతో పాటుగా ఎంతో శ్రమించిన పశువులను శుభ్రంగా కడిగి నుదుట పసుపు, కుంకుమ పెట్టి బంతి, చేమంతి దండలు మెడలో వేసి వాటిని ఆరాధిస్తారు. అందుకే దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు.

Sankrathi-image

సంక్రాంతి ప్రాధాన్యత

పండుగ అనే పదంతో కలిసి వచ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతికి నెలరోజుల ముందే పొగమంచు పట్టడం, దగ్గరలో ఉన్న మనిషి కూడా కనిపించకపోవడం ఇవన్నీ తెలిసినవే. అంత పొగమంచులోనూ మహిళలు ఉదయాన్నే లేచి ఇంటి ముందు రంగవల్లులు వేయడంలో మునిగిపోతుంటారు. వేకువజామునే హరిదాసులు ప్రత్యక్షమై హరినామ సంకీర్తనతో ఇంట్లోని మిగతావారిని నిద్రలేపుతుంటారు. పట్నంలో ఉన్నవారు వారివారి స్వస్థలాలకు సంక్రాంతికి చేరుకుంటారు. కుటుంబంలో కొత్త అల్లుళ్లను ఆహ్వానించడం, ఇలా కుటుంబాన్ని మొత్తం కలిపి ఉంచే పండుగ సంక్రాంతి. కుటుంబ వ్యవస్థకు సమాజ ఐక్యతకు ప్రతీక. ఈ పండుగ మరో స్పెషల్ గంగిరెద్దుల వారు. గంగిరెద్దులతో వారు చేయించే విన్యాసాలకు ఆనందపడి అతనికి దక్షిణ, గంగిరెద్దుకు వస్త్రదానం చేస్తారు. మామిడాకులతోపాటు బంతిపూల దండలను గుమ్మాలకు అలంకరిస్తారు. ఇంటికి వచ్చిన కొత్త ధాన్యంతో పొంగళ్లు కాచి, వివిధ రకాల పిండివంటలు చేసి ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పిస్తారు. పంట సిరులు ఇంటికి చేరుకోవడానికి ముందే పక్షుల కోసం వరి జొన్న కంకులను ఇంటిముందు గానీ పెరట్లో చెట్లకు కడతారు. మనిషి జాలిగుణం ఉండాలనే పరమార్థం దీనిలో ఉంది.

గంగిరెద్దుల వెనుక కథ

పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం చాలా ఏళ్లు తపస్సు చేస్తాడు. గజాసురుడు కోరిన వరం మేరకు శివుడు వాడి గర్భాన్నే నివాసం చేసుకుని గజాసురుని నిత్యపూజలు అందుకుంటాడు. ఈశ్వరుడు కనిపించకపోవడంతో పార్వతి విష్ణువుతో మొరపెట్టుకుంటుంది. శివుడు ఎక్కడున్నాడో తెలుసుకున్న విష్ణువు, బ్రహ్మ, దేవతలు.. సన్నాయి, డోలు ఇతర వాయిద్యాలను వాయించే కళాకారులుగా మారారు. శివుని వాహనమైన నందీశ్వరుని చక్కగా అలంకరించారు. గజాసురుని నగరానికి వెళ్లి ఆట మొదలుపెట్టారు. వారి అద్భుత నైపుణ్యం గురించి విన్న గజాసురుడు, వారిని పిలిపించి తన ఎదుట గంగిరెద్దుల ఆట ఆడించమన్నాడు. వారు ఆటను అద్భుతంగా ప్రదర్శించారు. గజాసురుడు ఆనందంతో వారిని ఏమైనా కోరుకోమన్నాడు. వెంటనే వారు ఈ గంగిరెద్దు శివుని వాహనమైన నందీశ్వరుడు. తన యజమాని కోసం వచ్చాడు. శివుని ఇవ్వు అని కోరారు. వచ్చిన వారు ఎవరో గుర్తించిన గజాసురుడు చేసేదిలేక సరే అన్నాడు. అంతే విష్ణువు నందిని ప్రేరేపించగా నంది తన వాడి కొమ్ములతో వాడి పొట్టను చీల్చి శివుని బయటకు రప్పించాడు. అంతా ఎవరిలోకాలకు వారు వెళ్లారు. స్వార్థంతో కీర్తి, సంపద, అధికారం తన ఒక్కరి దగ్గర ఉండాలని కోరుకునే వారికి ఎప్పటికైనా పతనం తప్పదనే భావన ఈ కథలో ఉంది.

gangireddhulu

కనుమ పండుగ

కనుమ రోజు గతించిన పెద్దలను అంటే పితృదేవతలను స్మరించుకుంటారు. వారికి ఇష్టమైన పదార్థాలను వండి వారికి సమర్పిస్తారు. మంచి కర్మలు కానివ్వండి, చెడు కానివ్వండి మనిషి దేహత్యాగం చేసినా ఇవి మాత్రం ఆత్మను అంటిపెట్టుకునే ఉంటాయి. వీటి ప్రభావం వల్ల మనిషి ఆత్మ ఉత్తమ లోకాలకు చేరలేవు. అథోలోకాల్లో అవస్థలు పడుతూనే ఉంటాయి. ఇలాంటి వారికి కనుమ రోజు పితృకర్మలను ఆచరిస్తారు. దాని వల్ల వారికి ఉత్తమలోక గతులు సంప్రాప్తిస్తాయని నమ్మకం. ఇలా ఊర్థలోకాలకు చేరగానే వారికి ఆత్మకు మహత్తరమైన శక్తి లభిస్తుంది. ఈ శక్తినే భూమిపై తనకు పితృకర్మలు ఆచరించినవారికి , వారి కుటుంబానికి తమ ఆశీశ్శుల రూపంలో అందిస్తారు. భగవంతుని అనుగ్రహం కంటే వీరి ఆశీస్సులకే ఎక్కువ శక్తి ఉంటుంది. ఇలా పెద్దలను స్మరించుకునే రోజు కనుక దీనిని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు.

kolla-pandalu

మొక్కుల పండుగ కూడా..

పెద్దవాళ్లను గౌరవించడం మన సంప్రదాయం. తల్లిదండ్రులే ప్రత్యక్షదైవాలు. ఈ పండుగ రోజు పెద్దవారి కాళ్లకు దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవారికి మొక్కడం వల్ల ఈ పండుగను మొక్కుల పండుగ అని కూడా అంటారు. నేటికాలంలో పెద్దలను అనాథాశ్రమంలో పెట్టే దౌర్భాగ్యస్థితి పట్టింది. ఈ పండుగ వల్ల ఇంట్లో పెద్దవారు ఉండాలనే ఓ సందేశం వెళ్తుంది.

ముక్కనుమ..

కొత్త దంపతులు సావిత్రి, గౌరి, కాత్యాయని పూజలు, వ్రతాలు విధిగా చేసుకుంటారు. ఇదే రోజు వీరు చేసే బొమ్మల కొలువులో అమ్మవారి ప్రతిమలు తప్పనిసరిగా ఉంటాయి. అవి మట్టి ప్రతిమలైతే మంచిది. ఈ రోజు నుంచి తొమ్మిది రోజు వరకు అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి చివరిరోజు అమ్మవారి మట్టి ప్రతిమను దగ్గర్లోని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వల్ల కొత్త దంపతుల జీవితం ఆనందంగా ఉంటుందని నమ్మకం. చక్కని సంతానంతో వంశాభివృద్ధి చెందుతుందంటారు. పేరంటానికి వచ్చిన ముత్తయిదువుల ఆశీస్సులు లభిస్తాయి. పెళ్లికాని పిల్లలు బొమ్మల కొలువు చేసుకుంటారు. అందువల్ల వారికి మంచి భర్త లభిస్తాడంటారు. బాలలు చేస్తే బాలల మెదడు పాదరసంలా పనిచేస్తుందంటారు. ఇలా అందర్నీ అలరించేది సంక్రాంతి పండుగ.

haridasulu