Home హైదరాబాద్ నగరానికి మలేరియా కాటు

నగరానికి మలేరియా కాటు

Malaria is booming in hyderabad city

25 రోజుల్లో 50 కేసులు నమోదు
ఫీవర్ ఆసుపత్రికి పెరిగిన తాకిడి
నగర ఆసుపత్రుల్లో 100వరకు కేసులు

మన తెలంగాణ/ సిటీబ్యూరో: నగరంలో మలేరియా విజృంభిస్తోంది. దీంతో నగరవాసులు నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ చివరి నాటికి 160 మలేరియా కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల నగరంలో కురిసిన వర్షానికి ఒక్కసారిగా దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ నెల గడిచిన 25రోజుల్లో 50కేసులు నమోదయ్యాయి. ఒక్క ఫీవర్ ఆసుపత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే నగరంలోని మిగతా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి మొత్తం మలేరియా కేసులు 100వరకు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో దోమలు విజృంభిస్తుండటమే ఇందుకు కారణమని వైద్యులు అంటున్నారు. ఇదిలా ఉంటే నగరంలోని పానిపూరా, జియాగూడ, భరత్‌నగర్ ప్రాంతాల్లోని పలువురు ప్ర జలు ఇటీవల మెదక్ జిల్లాలోని ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చిన అనంతరం ఈ ప్రాంతాల వారు మలేరి యా భారిన పడినట్లు సమాచారం. అక్కడ దోమలు అధికంగా ఉండవచ్చని, అవి కుట్టడం వల్లే ఈ ప్రాంతాలవారు మలేరియాకు గురైనట్లు అంటున్నారు.

ఫీవర్ ఆసుపత్రిలో అప్రమత్తమైన వైద్యులు….
330 పడకల విస్తీర్ణం ఉన్న ఫీవర్ ఆసుపత్రికి ప్రధానంగా మలేరియా, డెంగీ, డిప్తిరియా, టెటానస్, చికెన్‌ఫాక్స్, మెజిల్స్, మామ్స్, డయేరియా, చికెన్‌గున్యా, హైపటైటీస్, రెబీస్‌తో పాటు కుక్కకాటు వాక్సిన్ కోసం రోగులు ఎక్కువగా వస్తుంటారు. కాగా ఫీవర్ ఆసుపత్రికి ఇటీవల మలేరియా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వైద్య ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత చర్యల్లో భాగంగా మలేరియా బాధితులకు ప్రత్యేక వైద్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో ఫీవర్ ఆసుపత్రి వైద్య బృందం ఆసుపత్రిలో రిటైర్డ్ వైద్యులతో సమావేశమై సలహాలు, సూచనలు సైతం స్వీకరించారు. మలేరియా తీవ్ర స్థాయిని అరికట్టి రోగులు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు పక్కాగా చర్యలకు సిద్ధమయ్యారు.

పిఎఫ్ కేసులతో ప్రాణాలకు ముప్పు….
మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్(పివి), ప్లాస్మోడియం ఫాల్సీ ఫారమ్(పిఎఫ్) అనేవి రెండు రకాలు ఉంటాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు దీని లక్షణాలు. ఇది మొదటి స్టేజి. దీని తీవ్రత తక్కువగా ఉంటుంది. పిఎఫ్ కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలి, జ్వరం, తల, ఒళ్లు నొప్పులు, వాంతులు లాంటివి దీని లక్షణాలు. ఇలాంటి కేసులు అరుదుగా నమోదవుతాయి. పిఎఫ్ త్వరగా గుర్తించి వైద్యం అందించకపోతే కాలేయం, మూత్రపిండాలు, రక్తకణాలపై ప్రభావం పడుతోంది. మెదడుపై ప్రభావం పడి సిరబ్రల్ మలేరియాకు దారితీస్తుంది. మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవి ఆడ అనాఫిలస్ కల్సి ఫేసిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇవి ఎక్కువగా మురుగు కాల్వలు, చెరువులు, కుంటలు, పంట కాల్వలు, పొలాల్లో, పూల కుండీలు, టైర్లలోని నీటి నిల్వల్లో పెరుగుతాయి. ఇవి రాత్రిల్లు కుడతాయి. దోమ కాటుతో శరీరంలోకి ప్రవేశించిన ప్లాస్మోడియం పరాన్నజీవి ఎర్రరక్త కణాలపై దాడి చేస్తుంది. గతేడాది నగర వాసులను పీల్చిపిప్పి చేసిన మలేరియా కేసులు ఈ ఏడాది కూడా అదే తరహాలో విజృంభిస్తున్నాయి. ఈ వ్యాధుల విషయంలో ఎంటమాలజీ విభాగం అధికారులు ముందుస్తుగా చర్యలు తీసుకోలేకపోతున్నారు.