Home తాజా వార్తలు మల్లన్నసాగర్ ఆగదు…

మల్లన్నసాగర్ ఆగదు…

Mallanna Sagar

 

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును 2,3 ఎకరాల
భూ యజమానుల కోసం ఆపలేం ప్రభుత్వం నిరభ్యంతరంగా ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చు : హైకోర్టు

* పరిహారం తీసుకోని రైతుల చెక్కులను వారి న్యాయవాదికి అందజేయండని సూచన, వెంటనే చెక్కులు అప్పగించిన ప్రభుత్వం
* కాళేశ్వరంపై దాఖలైన 177 పిటిషన్లను కలిపి విచారిస్తామని హైకోర్టు వెల్లడి

హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. నిర్వాసితుల పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం పరిహారం తీసుకోవాలని బాధితులకు సూచించింది. తమకు పునరావాసం కల్పించకుండా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారం టూ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు కొందరు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న మల్లన్నసాగర్ ఆగదు అనంతరం మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పనులపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు హైకోర్టు సూచించింది.

అయితే పరిహారంలో అన్యా యం జరిగితే తమ వద్దకు రావొచ్చని నిర్వాసితులకు సూచించింది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు, మూడెకరాల ఉన్న భూ యజమానుల కోసం ఆపలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. పరిహారం తీసుకోని నిర్వాసితుల తరపున న్యాయవాదికి చెక్కులను అందచేయాలని కోర్టు సూచించడంతో, వెంటనే ప్రభుత్వం చెక్కులను అందజేసింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అందించిన పుపరావాస,ఉపాధి చర్యలపై నివేదిక సిద్ధం చేశామని అయితే రిజిస్ట్రీ సమయం అయిపోయిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ధర్మాసనానికి తెలిపారు. ఆ నివేదికను నేరుగా సమర్పించాలని హైకోర్టు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన 177 పిటిషన్లను కలిపి విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం స్పష్టంచేసింది.

నీళ్ల కోసం జనం అల్లాడుతుంటే…

నీటి కోసం జనం అల్లాడుతున్నారని, ప్రభుత్వం నీటిపారుదల కోసం ప్రాజెక్టు నిర్మాణం చేస్తోందని గుర్తించాల్సిన అవసరం ఉందని హై కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదిస్తూ.. ఇప్పటికే ప్రభుత్వం కాళే శ్వరం ప్రాజె క్టుపై దాఖలైన 177 కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారి ంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ వ్యాజ్యాన్ని దాఖలు చేసిం దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసులన్నీ త్వరగా తేల్చాలని, ప్రాజెక్టు నిర్మాణాలు కొనసాగేందుకు న్యాయపరమైన అడ్డంకుల్ని తొలగించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ దశలను సవాల్ చేస్తూ మొత్తం 177 వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటన్నింటినీ కలిపి సత్వరమే విచారణ పూర్తి చేయాలని ఆయన కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని, రైతుల భూముల్ని సాగులోకి తెచ్చే మహత్తర ప్రయత్నానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసులన్నింటినీ ఒకేసారి విచారణ పూర్తి చేయాలన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అందించిన పునరావాస, ఉపాధి చర్యలపై పూర్తి నివేదిక సిద్ధం చేశామని, హైకోర్టుకు అందజేశామని తెలిపారు. భూసేకరణ చట్టం-2013 కంటే ఎక్కువగా ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణలో 4108 కుటుంబాలు ఉంటే 47 కుటుంబాలే అభ్యంతరం చెప్పాయని, 17,805.14 ఎకరాలు అవసరమైతే రైతులు ప్రభుత్వం మధ్య జరిగిన పరస్పర అంగీకారంతో భూములు ఇవ్వగా మిగిలిన 60.16 ఎకరాల్ని మాత్రమే భూసేకరణ చట్టం కింద సేకరించామని చెప్పారు. భూసేకరణ చేసిన వాటిలో 4108 కుటుంబాలకుగాను కేవలం 47 కుటుంబాలు మాత్రమే అభ్యం తరం చెప్పాయని వివరించారు. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో కోర్టు తీర్పును ఉల్లంఘించి పనులు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయ వాది రచనారెడ్డి వాదించారు.

ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అయితే ప్రాజెక్టు పనుల్ని నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ‘పరిహారం కూడా తీసుకోకుండా న్యాయపోరాటం చేస్తే రైతులే ఆర్థికంగా నష్టపోతారు. ఉదాహరణకు పదిపన్నెండేళ్ల క్రితం రైతుకు రూ.5 లక్షలు పరిహారం అందిస్తామన్నప్పుడు తీసుకుని న్యాయపోరాటం చేస్తే ఆర్థికంగా కూడా లాభం ఇప్పుడు ఆ పరిహారాన్ని రూ.8 లక్షలకు పెంచితే రైతుకే నష్టం. రైతులు కూడా ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు రావాలి. త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ప్రాజెక్టులను ప్రజల కోసమే నిర్మిస్తోందని గుర్తించాలి. రాజస్థాన్‌లో ఒక డ్యాం నిర్మాణానికి చెందిన కేసుల్ని తాను కూడా విచారించాను. ఆ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఏకంగా తొమ్మిది జిల్లాల్లో భూములు సాగులోకి వచ్చాయి.లక్షల మందికి తాగునీరు అందింది. పర్యావరణానికి కూడా దోహదపడింది. ఇక్కడ కూడా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రజల కోసమే ప్రాజెక్టులని గుర్తించాలి. అందుకు అందరూ సహకరించాలి’ అని సిజె చౌహాన్ అన్నారు.

నిర్వాసితులను రెచ్చగొట్టడం మానుకోవాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌పై గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంప పెట్టు అని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా విపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. రాజకీయాల కోసం నిర్వాసితులను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. నిర్వాసితులకు ఎక్కడా లేని విధంగా పరిహారం ఇస్తున్నామని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా, ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పరిహారం ఇస్తుందన్నారు.

Mallanna Sagar does not stop